
మిర్యాలగూడనుంచి ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభకు బయలుదేరిన ట్రాక్టర్లు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని దారులన్నీ గులాబీమయం అవుతున్నాయి. హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లో ఆదివారం జరగనున్న టీఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభకు తరలివెళ్లడానికి ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. హైదరాబాద్‌కు సమీపంగా ఉమ్మడి నల్లగొండలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కువగా ఉండడంతో జన సమీకరణపై ఎక్కువగా దృష్టి పెట్టారు. జిల్లాకు 3లక్షల మందిని తరలించాలని లక్ష్యం పెట్టడంతో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులు సమీకరణ కోసం వారం రోజులుగా పల్లెపల్లె తిరుగుతున్నారు. ఒకరోజు ముందుగానే జిల్లానుంచి కార్యకర్తలు, రైతులు ట్రాక్టర్లలో కొంగరకలాన్‌కు పయనమయ్యారు. హైదరాబాద్‌కు దూరంగా ఉన్న కోదాడ, హుజూర్‌నగర్ వంటి నియోజకవర్గాలకు, నాగార్జునసాగర్‌కు మిగతా నియోజకవర్గాల కన్నా తక్కువ లక్ష్యం పెట్టారు. ఈ మూడు చోట్లా పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు వివిధ రూపాల్లో ప్రగతి నివేదన సభ కోసం ప్రచారం చేశారు.
ముందస్తు ఎన్నికల వార్తలు వెలువడుతున్న తరుణంలో జరుగుతున్న బహిరంగ సభ కావడంతో అధినాయకత్వం వద్ద తమ బలాన్ని నిరూపించుకునేందుకు నాయకులు శ్రమిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న ప్రతి నాయకుడు తమ అనుచరులను, పట్టున్న గ్రామాలనుంచి జనాన్ని తరలించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఆశావహులున్న చోట సన్నాహక సమావేశాలు కూడా వేర్వేరుగా నిర్వహించారు. ప్రధానంగా ఈ సభను ఒక విధంగా ఎన్నికల శంఖారావం పూరించనున్నదిగా భావిస్తుండడంతో జిల్లా నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణపై దృష్టి పెట్టింది. మూడు రోజుల కిందటే నకిరేకల్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అనుబంధ విద్యార్ధి విభాగం టీఆర్‌ఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రగతి నివేదన సభకు పాదయాత్రగా బయలుదేరారు.శనివారం మిర్యాలగూడ, నకిరేకల్ , తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి ట్రాక్టర్ల ర్యాలీలు బయలు దేరాయి. ఆదివారం ఉదయం ఆయా నియోజకవర్గ కేంద్రాల నుంచి కార్యకర్తలు బయలుదేరే వాహనాల్లోనే ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు ప్రయాణించనున్నారు.
ప్రైవేటు వాహనాల ఏర్పాటు చేసుకుంటున్న నియోజకవర్గాలకు అదనంగా ఆర్టీసీ బస్సులనూ కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో తుంగతుర్తి మినహా మిగిలిన పదకొండు నియోజకవర్గాలకు మొత్తంగా 817 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. నాగార్జున సాగర్ నియోజవర్గానికి ఏపీలో మాచర్ల నుంచి 30 బస్సులను అద్దెకు తీసుకున్నారు. జిల్లాలో ఉన్న బస్సులు సరిపోని కారణంగా హైదరాబాద్ నుంచి మరో 120 బస్సులను జిల్లాకు కేటాయిం చారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల్లోని బస్సులను ప్రగతి నివేదన కోసం కేటాయించడంతో రోజువారీ నడిచే అన్ని బస్సు సర్వీసులను రద్దు చేశామని, ప్రజలు తమ ప్రయాణాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్టీసీ డీజీఎం మధుసూదన్ ‘సాక్షి’కి చెప్పారు.
- ప్రగతి నివేదన సభకోసం మొత్తం బస్సులు : 817
- ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం బస్సులు : 667
- హైదరాబాద్ నుంచి కేటాయించినవి : 20
- ఏపీలోని మాచర్ల నుంచి అద్దెకు తీసుకున్న బస్సులు : 30

నకిరేకల్ : ట్రాక్టర్ నడుపు తున్న ఎమ్మెల్యే వీరేశం
Comments
Please login to add a commentAdd a comment