భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి, గండ్ర సత్యనారాయణ వర్గాలు వేర్వేరుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో కనీసం వేదికను పంచుకునే పరిస్థితి లేదు. ములుగు నియోజకవర్గం నుంచి మంత్రి చందూలాల్ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ఆయన ఎక్కువగా ప్రభుత్వ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎన్నికలకు ఏడాది సమయమే ఉన్నా.. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో ఐక్యతా రాగం వినిపించడం లేదు. అంతా కలిపి ఒక్కటిగా పార్టీ వాణి వినిపించే ప్రయత్నం గతంతో పోల్చితే తగ్గిపోయింది. పార్టీలో అంతర్గత విభేదాలు తగ్గించి ఒక్కతాటిపై నడిపించేందుకు ఉద్దేశించిన ఆత్మీయ సమావేశాల ఊసే లేదు. జిల్లాల విభజన జరిగిన తర్వాత ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా పనిచేసుకుంటున్నారు. 2009 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగానే ఎక్కువ గుర్తింపు పొందింది. డిసెంబరు 9 ప్రకటన తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ క్రమంగా బలపడుతూ వచ్చింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు.
రాజకీయ పునరేకీకరణ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టారు. పాత, కొత్త నేతల కలయిక తర్వాత ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పార్టీ పరంగా ప్రతి నెల ఆత్మీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆత్మీయ సమావేశాలు 2016 ప్రారంభంలో ఒకటి, రెండు సార్లు జరిగాయి. ఆ తర్వాత జిల్లాల విభజన అంశం తెరపైకి రావడంతో స్థానిక డిమాండ్లకు అనుగుణంగా ఎక్కడి నేతలు అక్కడే తమ ప్రాంతాలకే పరిమితం కావాల్సి వచ్చింది. జిల్లాల విభజన జరిగి ఏడాది కావొస్తున్నా.. నేతలందరూ ఒక్క తాటిపైకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నాయకులను, కార్యకర్తలను ఒక్కతాటిపై నడిపించే నేతలు పార్టీలో కరువయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి, చందూలాల్ ఇద్దరు మంత్రులుగా ఉన్నా.. పార్టీని సమన్వయం చేసే పరిస్థితి లేదు. వీరిద్దరు ఐదు జిల్లాలో పర్యటిస్తున్నా.. ఎక్కువగా ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. పార్టీలో నేతల మధ్య సమన్వయం సాధించేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గ్రూపులు బలపడతున్నాయి. దీనికి తోడు ఉద్యమకారులకు పార్టీలో సరైన గుర్తింపు లేకుండా పోతుందంటూ ఇటీవల అసమ్మతి గళం విప్పుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన వారికి ప్రస్తుతం పార్టీలో గుర్తింపు లేదంటూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అసంతృప్త నేతలతో మాట్లాడి వారి రాజకీయ భవిష్యత్‌కు హామీ ఇచ్చి నచ్చజెప్పే ప్రయత్నం పార్టీ పరంగా జరగడం లేదు. వరంగల్ తూర్పులో అచ్చ విద్యాసాగర్ వంటి నేతలు బహిరంగ లేఖ రాసినా.. పార్టీ నుంచి సరైన స్పందన లేదు. దీంతో అచ్చ విద్యాసాగర్ టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లో కొత్తవారికే పదవులు దక్కుతున్నాయి.. పాత వారికి ప్రాధాన్యం లేదంటూ మార్చిలో గీసుకొండలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సమావేశం నిర్వహించారు.
ఇద్దరు మంత్రులు ఉన్నా.. పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యేను ఆ సమావేశం దగ్గరకు పంపారు. దీంతో సంతృప్తి చెందని వారు వారం తర్వాత రెండో సమావేశం నిర్వహించారు. పదవులు పొందిన నేతలు పార్టీ పటిష్టతకు పనిచేయడం లేదని, దీని ఫలితంగా పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment