ఆనాడు దుమ్మెత్తిపోసుకుని ఇప్పుడు దగ్గరవుతున్నారు
ప్రధాని వైవాహిత జీవితంపై కూడా విమర్శలు
నల్ల బెలూన్లు ఎగరవేసి ఇప్పుడు నిస్సిగ్గుగా స్వాగతాలు
చంద్రబాబుకు పోలవరం ‘ఏటీఎం’ అని తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని
బాహుబలిలో భళ్లాల దేవుని పాత్రతో పోల్చిన వైనం
ఇప్పుడు ఒకే వేదిక పంచుకోవడంపై టీడీపీని చీదరించుకుంటున్న ప్రజలు
‘బాబు’ ప్రయోజనాల కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధమేనని విమర్శల వెల్లువ
సాక్షి, అమరావతి: చాలా కాలం తర్వాత ప్రధాని మోదీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆదివారం నాడు ఉమ్మడిగా ఒకే వేదిక నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు ఏం మాట్లాడతారోనని రాజకీయ పరిశీలకులతో పాటు రాష్ట్రంలో చాలా మంది ఆసక్తితో ఉన్నారు. ఎందుకటే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీయే నుంచి నిష్క్రమించాక మోదీ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండీ తన పార్టీ కార్యకర్తలతో నల్ల చొక్కాలు వేయించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయించారు. ప్రధాని పర్యటన సమయంలో టీడీపీ నేతలు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసనలు తెలిపారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీని ఉద్ధేశించి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తే... దానికి బదులు ప్రధాని మోదీ సైతం తీవ్రంగానే ప్రతిస్పందించారు. ఆయన ఏమన్నారు.. ఈయన ఏమన్నారంటే...
2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని మోదీనుద్దేశించి వివిధ సందర్భాల్లో చేసిన విమర్శలు
బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఇంకా 15 సీట్లు వచ్చేవి
► ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఎన్డీయే నుంచి బయటకు వస్తే.. అది రాజకీయ ప్రయోజనాల కోసం అని మాట్లాడుతున్నారు. నిజంగా నేను రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకుని ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే.. ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చేవి’ –మార్చి 29, 2018న రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు.
► ‘దేశ రక్షణ రంగంలో అతి పెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న రూ. 59,000 కోట్ల రఫెల్ ఒప్పందం, దానికి సంబంధించిన నివేదికలు ఉన్నాయి. ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయి. దానిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. మోదీ జీ, మీరు దేశాన్ని మోసం చేసినప్పుడు సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు’ – ఫిబ్రవరి 8, 2019 తన ట్విట్టర్‌లో చంద్రబాబు
► మీకూ, బ్రిటిష్ వాళ్లకూ తేడా లేదు. మీకంటే వాళ్లే నయం. కాటన్ దొర ఇచ్చిన నీళ్లయినా తాగుతున్నాం. నాలాంటి సీనియర్ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నారంటే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అర్ధం చేసుకోవాలి. 2002లో మోదీ, నిన్న అమిత్‌షా రాజకీయాల్లో వచ్చారు. నేను 1978లోనే ఎమ్మెల్యేనయ్యా. మోదీని సార్ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి, నీరు ముఖాన కొట్టిపోయారు – 2019 ఫిబ్రవరి 2న అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు
► ‘రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకొని ఢిల్లీ వెళ్లా. కేంద్రం ముందు చేయి చాచా. ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి’. – 2018 జూన్ 9న నెల్లూరు సభలో చంద్రబాబు
► ‘బీజేపీకి ఒకటే చెబుతున్నా, తెలుగుదేశంతో పెట్టుకుంటే ఖబడ్దార్. మీ కుట్రలు ఏ రాష్ట్రంలోనైనా చెల్లుతాయేమో. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాగవు’. – 2018లో శృంగవరపుకోటలో జరిగిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు
► ‘కేంద్రం సహకారం అందించినప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి టీడీపీకి లేదు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం లాంటిది. అందులో నుంచి డబ్బులు తీసుకోవడమే. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలని యూ టర్న్ బాబు అనుకుంటున్నారన్నది మీ అందరికీ తెలుసు.‘
► ‘ఏపీలో పరిస్థితి బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి పాత్ర మాదిరిగా ఉంది. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిరిగి దానిని కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలకైనా వెనుకాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ (సంస్కృతి) మంచి పాలనతో రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ది చెందాలన్నది మా ఆలోచన అయితే... యూ టర్న్ బాబు నైజం మాత్రం తన సొంత హెరిటేజ్ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరు’ – 2019 ఏప్రిల్ 1న రాజమండ్రిలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో ప్రధాని మోదీ.
► దేశం కోసం గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మాకెలాంటి బెరుకు లేదు.ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు(చంద్రబాబును ఉద్దేశించి) భయపడాలి. ఎందుకంటే వారు చేసిన అవినీతి వారిని ఎల్లప్పుడూ వెంటాడుతుంది. ఈ విషయం వారికి తెలుసు. అవినీతి చేయడంలో, ముఖ్యమంత్రిగా ఉంటూ తన కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసి తప్పు చేశారని వారికి తెలుసు.– 2019 మార్చి 2న విశాఖపట్నం సభలో ప్రధాని మోదీ.
► ‘నేను ఎవరికీ భయపడేది లేదు, నరేంద్ర మోదీ, ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందను కాను. ఒక్కో రాష్ట్రంలో ఉండే నాయకత్వాన్ని బలహీన పరచడానికి, ఇష్టమొచ్చినట్లు ఆడుకోవడం వీళ్లకు అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశా. భయమనేది నా జీవితంలో లేదు’. – 2018లో మార్చి 6 తేదీన విజయవాడలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు.
► ‘విభజన హామీలను నాలుగు బడ్జెట్‌లలో పట్టించుకోలేదు. చివరి బడ్జెట్‌లోనూ పెట్టలేదు. ఈ రాష్ట్రం ఒకటి ఉందన్న ఆలోచన లేదా? ఎప్పుడైనా మిత్రపక్షంగా రండి. కూర్చుందాం అని అన్నారా? మీరు ఒక్కరే దేశాన్ని కాపాడతారా? ఏం మీకొక్కరికే దేశభక్తి ఉందా? –2018 మార్చి 7న సమావేశంలో చంద్రబాబు.
► ‘భార్యనే చూసుకోని వాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు’. – అసెంబ్లీలో చంద్రబాబు తన ప్రసంగంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలివి.
► ‘నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు’. – 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు.
ప్రధాని మోదీ వివిధ సందర్భాల్లో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన మాటలు
► ‘లోకే శ్ తండ్రి చంద్రబాబు నాకు సంపదను సృష్టించడం తెలియదన్నారు. అవును నిజమే. నాకు సొంత ఆస్తులు పెంచుకోవడం రాదు. కానీ అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి వాస్తవాలను వదిలిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రజల మద్దతు కోల్పోయారని అర్ధం. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ వ్యక్తి ఏదో పెద్ద తప్పు చేశారనే అర్ధం’
► ‘ప్రజలారా మీరే చెప్పండి. ఎన్టీఆర్ వారసత్వాన్ని తీసుకున్నాయన ఆయన కలలను సాకారం చేస్తానని మాటిచ్చారా లేదా? ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని హామీ ఇచ్చారా లేదా? ఈ రోజు ఆయన ఎన్టీఆర్‌కు గౌరవమిస్తున్నారా? సోదర సోదరీమణులారా మీకు ఈ విషయం అర్ధమవుతుంది. కానీ ఆయనలాంటి సీనియర్ నాయకుడికి ఎందుకు అర్ధం కావడం లేదు. ఇదంతా యువత తెలుసుకోవాలి్సన అవసరం ఉంది. ఎన్టీఆర్ ఏపీకి కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలనుకున్నారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్‌ను దుష్ట కాంగ్రెస్ అని ఎన్టీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి (చంద్రబాబు) అదే కాంగ్రెస్‌తో దోస్తీ కట్టారు’
► ‘చంద్రబాబుకు ఏమైంది. ఆయన నాకంటే చాలా సీనియర్‌నని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుంటారు. మీరు (చంద్రబాబు) సీనియర్. అందువల్లే గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడు తక్కువ చేయలేదు. అవును మీరు సీనియర్. కూటములు మార్చడంలో. కొత్త కూటములు కట్టడంలో. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో. ఈ రోజు ఎవరిని తిడతారో రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో.
►‘కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను చేపట్టిన పథకాలపై చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం’. – 2019 ఫిబ్రవరి 10న గుంటూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి.
Comments
Please login to add a commentAdd a comment