సాక్షి,ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచార స్లోగన్ ‘ఐ విల్ బి బ్యాక్’ గురించి ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న దేవేంద్ర ఫడ్నవీస్ రచయిత ప్రియమ్ గాంధీ-మోదీతో 2019 ఎన్నికల గురించి మాట్లాడారు. తాను ఐ విల్ బి బ్యాక్ అంటూ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిచ్చాను.
రెండోసారి అధికారంలోకి వస్తామని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ కూటమిని చీల్చి అధికారంలోకి వచ్చాం. ఇదంతా చేయడానికి రెండున్నరేళ్లు పట్టిందని అన్నారు. అదే ఎన్నికల్లో ‘బీజేపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంది.శివసేన (2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే మాకు ద్రోహం చేశారు. ఫలితంగా మేం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
రాజకీయ పరిణామాలతో
ఆ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ఎంపికయ్యారు. అయితే, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మహా వికాస్ అఘాడీ కూటమి కుప్పకూలింది.
ఆ తర్వాత బీజేపీ, శివసేనలోని ఏక్‌నాథ్ షిండే వర్గం, ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గాలు ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఆ కూటమిలో మహరాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment