Madhu sudhana chari
-
దేవుడు ఎదురుచూడాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ కాలం నాటి విధానాలు ఇంకా ఎందుకంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వ శాఖలను సంస్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా వాటిని మార్చే ప్రయ త్నంలో ఉన్నారు. కానీ, ఉన్నతాధికారులు మాత్రం పాత విధానాలను వీడక అభివృద్ధి పనులకు ఆటంకంగా మారుతున్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో పరిష్కారమయ్యే అంశాలను కూడా ఏళ్లతరబడి ముందుకు సాగనీయకుండా అడ్డుపడుతున్నారు. వీరి నిర్లక్ష్యానికి.. ఆరొందల ఏళ్ల క్రితం నాటి అద్భుత ఆలయమే సజీవ సాక్ష్యం. ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ ఆలయ ప్రత్యేకతలను ఏడాదిన్నర క్రితం అమెరికా పరిశోధకుడు వెలుగులోకి తెచ్చారు. అంతకుముందు పురావస్తుశాఖ అధికారులు దీన్ని ప్రత్యేక నిర్మాణంగా గుర్తించినా, దేశంలో మరెక్కడా ఈ తరహా ఆల యాలు లేవన్న సంగతిని మాత్రం అమెరికా పరిశోధకుడు తేల్చాడు. శిథిలావస్థకు చేరుతున్న ఆలయానికి పూర్వ వైభవం కల్పించేందుకు నాటి శాసనసభాపతి మధుసూదనాచారి రూ.3 కోట్ల నిధులు విడుదల చేశారు. అయితే అధికారులు మాత్రం వివిధ కారణా లు చూపి ఇప్పటికీ పనులు సాగనివ్వడం లేదు. నిధు లుండి, పనిచేసే విభాగాలు ఆసక్తిగా ఉన్నా, ఉన్నతాధికారులు ఫైలును దగ్గర పెట్టుకుని, మన పాలన విధానాల డొల్లతనాన్ని చాటి చెబుతున్నారు. వీరి తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ.. ఈ ఆలయ ప్రత్యేకతను జనం ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో.. ‘ఇంటాక్’సంస్థ సభ్యులు గురువారం ఆ ఆలయం వద్ద ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గుట్ట రాయి గుడిగా మారి.. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నయన్‌పాక గ్రామ శివారులో ఉందీ దేవాలయం. దాదాపు 50 అడుగుల ఎత్తుతో గుట్ట రాయి మీద భారీ గర్భాలయం ఒక్కటే నిర్మితమై ఉంది. ముందు ఎలాంటి మండపాలు లేవు. ఎవరి హయాంలో నిర్మించారో స్పష్టమైన ఆధారాలు తెలిపే శాసనాలు అందుబాటులో లేవు. దీనికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలున్నాయి. ఆలయం మధ్యలో.. అదే గుట్టరాయికి మూలవిరాట్టు చెక్కి ఉంది. ఆ విగ్రహాలు విడిపోయి కాకుండా గుట్టలో భాగంగానే ఉండటం విశేషం. దాదాపు నాలుగున్నర అడుగుల ఎత్తుండే ఆ మూల విరాట్టు నాలుగు వైపులా నాలుగు రూపాల్లో ఉంది. తూర్పు ద్వారం నుంచే వెళ్తే లక్ష్మీ సమేత నారసింహుడు, పశ్చిమం వైపు ద్వారం నుంచే చూస్తే నాగలి ధరించిన బలరాముడు, ఉత్తర ద్వారం నుంచి చూస్తే సీతారామలక్ష్మణులు, దక్షిణం ద్వారం నుంచి వేణుగోపాల స్వామి రూపాలు కనిపిస్తాయి. ఇలా నాలుగు ద్వారాలు, ఒకే రాయికి నాలుగు వైపులా నాలుగు రూపాల్లో విగ్రహాలు ఉండటం సర్వతోభద్ర ఆలయంగా పేర్కొంటారు. ఇలాంటి భారీ దేవాలయం ఇప్పటివరకు ఎక్కడా వెలుగు చూసిన దాఖలాలు లేవని 2017 నవంబర్‌లో ఈ ఆలయాన్ని గుర్తించిన అమెరికా పరిశోధకుడు ఫిలిప్ బి.వ్యాగనార్ పేర్కొన్నారు. అప్పట్లో ఈ మొత్తం విశేషాలను ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. దీంతో నాటి స్పీకర్ మధుసూదనాచారి ఆలయ పరిరక్షణ, అభివృద్ధికి రూ.3 కోట్లు విడుదల చేశారు. అది ఆలయం కావటంతో దేవాదాయశాఖకు నిధులు ఇచ్చారు. కానీ, చారిత్రక నిర్మాణం అన్న స్పృహ, అవగాహన లేని దేవాదాయ శాఖ అధికారులు, ఆ రాతి నిర్మాణాన్ని కొంతమేర తొలగించి సిమెంటుతో పునర్నిర్మించటం, దిగువ ఉన్న గుట్ట రాయిని తొలిచి అంతా సిమెంటు చేయటం, ఆలయానికి ఆనుకుని కాంక్రీటు మండపం నిర్మించేందుకు సిద్ధమై పనులు ప్రారంభించారు. విషయం తెలిసిన పురావస్తు శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం చెప్పటంతో ఆపేశారు. చాలా గొప్ప నిర్మాణం అయినందున కాంక్రీటు లేకుండా రాతి నిర్మాణమే జరపాలని పేర్కొనటంతో నాటి స్పీకర్ మధుసూదనాచారి ఆ పనులు పురావస్తుశాఖనే చేపట్టాలని సూచించారు. ఇక అంతే, అధికారుల్లో వేళ్లూనుకున్న నిర్లక్ష్యం బయటపడింది. అప్పుడు ఆగిపోయిన పనులు ఇక మళ్లీ మొదలు కాలేదు. నారసింహుడు, వేణుగోపాలస్వామి ఓ ఫోన్ కాల్‌తో అయిపోయే దానికి... ఆ నిధులు తమకు అప్పగిస్తే పనులు చేపడతామని పురావస్తుశాఖ అధికారులు దేవాదాయ శాఖను కోరారు. దీనికి వారు సమ్మతించారు. కానీ, అప్పటికే తాము టెండర్ పిలిచి నిర్మాణ సంస్థను గుర్తించామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సంస్ధ ఆధ్వర్యంలోనే పనులు చేపట్టాలా, కొత్తగా టెండర్లు పిలవాలా అన్న విషయంలో పురావస్తు శాఖకు స్పష్టత రాలేదు. దీంతో విషయం తేల్చాలంటూ సచివాలయానికి అధికారులు లేఖ రాశారు. అక్కడి అధికారులు దేవాదాయశాఖ అధికారులతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుని పురావస్తు శాఖ అధికారులకు స్పష్టత ఇవ్వాలి. కానీ, దేవాదాయ శాఖ నుంచి లిఖితపూర్వకంగా ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొంటూ ఏ నిర్ణయం తీసుకోకుండా ఫైలును అటకెక్కించి చోద్యం చూస్తున్నారు. అప్పట్లోనే పనులు మొదలై ఉంటే ఈ పాటికి పూర్తయి అద్భుత దేవాలయానికి శిథిలావస్థ బెడత తప్పి ఉండేది. ఆలయ శిఖరం వద్ద ఉన్న ఇటుకలు దెబ్బతినటంతో వానలు కురిస్తే నీళ్లు లోనికి చేరి కట్టడం క్రమంగా పాడవుతోంది. రాళ్లు కూడా కదిలిపోతున్నాయి. వెంటనే పనులు చేపట్టకపోతే ప్రధాన నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో రూ.13 లక్షలతో ఆలయానికి ప్రహరీగోడ, రూ.45 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారని ఆలయ పూజారి పెండ్యాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఇక పనుల్లో జాప్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టాలని పురావస్తుశాఖ విశ్రాంత అధికారి రంగాచార్యులు పేర్కొన్నారు. -
ప్రజలను చైతన్యం చేసిన కవి సుద్దాల
హైదరాబాద్: ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన గొప్ప ప్రజా కవి సుద్దాల హనుమంతు అని తాజా మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి కొనియాడారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు– జానకమ్మల జాతీయ పురస్కారాన్ని ప్రఖ్యాత ప్రజా కవి జయరాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మధుసూదనాచారి మాట్లాడుతూ.. తెలంగాణ పల్లెల్లో ప్రతి నాలుక మీద ఆడిన పాట ‘‘పల్లెటూరి పిల్లగాడ పశుల గాసే మొనగాడ’’పాట అని గుర్తు చేశారు. నేటికీ ఆ పాటను తెలంగాణ సమాజం మరువలేదని కితాబిచ్చారు. నిర్భందాలు కొనసాగుతున్నప్పటికీ సాహి త్యాన్ని సృష్టించి సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి సుద్దాల అని కితాబిచ్చారు. అలాంటి వ్యక్తి పురస్కారాన్ని జయరాజుకు ఇవ్వటం అభినందనీయం అని కొనియాడారు. మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్న తరుణంలో తల్లిదండ్రు ల ఖ్యాతిని పెంచేవిధంగా వారి పేరిట అవార్డులు ఇవ్వడం ఆదర్శనీయం అని అన్నారు. ప్రముఖ కవి, విమర్శకులు కోయి కోటేశ్వర్రావు మాట్లాడుతూ.. తెలంగాణ నిరంకుశ పాలనను తన పాటల ద్వారా ప్రజలకు చాటి చెప్పన గొప్ప ప్రజా కవి సుద్దాల హనుమంతు అని కొనియాడారు. కార్మిక, కర్షక, వెట్టిచాకిరి, బహుజనుల విముక్తి కోసం ఆయన అనేక పాటలు రాశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎస్.ఎస్. తేజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు, సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, హనుమంతు కుమార్తె రచ్చ భారతి, పలువురు సీపీఐ నాయకులు పాల్గొన్నారు. సభకు ముందు సినీ సంగీత దర్శకులు యశోకృష్ణ నిర్వహణలో అశోక్ తేజ, జయరాజు పాటలను పాడి సభికులను అలరించారు. -
ఎవరికి వారే.. యమునా తీరే
భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి, గండ్ర సత్యనారాయణ వర్గాలు వేర్వేరుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో కనీసం వేదికను పంచుకునే పరిస్థితి లేదు. ములుగు నియోజకవర్గం నుంచి మంత్రి చందూలాల్ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ఆయన ఎక్కువగా ప్రభుత్వ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎన్నికలకు ఏడాది సమయమే ఉన్నా.. అధికార పార్టీ టీఆర్ఎస్లో ఐక్యతా రాగం వినిపించడం లేదు. అంతా కలిపి ఒక్కటిగా పార్టీ వాణి వినిపించే ప్రయత్నం గతంతో పోల్చితే తగ్గిపోయింది. పార్టీలో అంతర్గత విభేదాలు తగ్గించి ఒక్కతాటిపై నడిపించేందుకు ఉద్దేశించిన ఆత్మీయ సమావేశాల ఊసే లేదు. జిల్లాల విభజన జరిగిన తర్వాత ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా పనిచేసుకుంటున్నారు. 2009 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగానే ఎక్కువ గుర్తింపు పొందింది. డిసెంబరు 9 ప్రకటన తర్వాత టీఆర్ఎస్ పార్టీ క్రమంగా బలపడుతూ వచ్చింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టారు. పాత, కొత్త నేతల కలయిక తర్వాత ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పార్టీ పరంగా ప్రతి నెల ఆత్మీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆత్మీయ సమావేశాలు 2016 ప్రారంభంలో ఒకటి, రెండు సార్లు జరిగాయి. ఆ తర్వాత జిల్లాల విభజన అంశం తెరపైకి రావడంతో స్థానిక డిమాండ్లకు అనుగుణంగా ఎక్కడి నేతలు అక్కడే తమ ప్రాంతాలకే పరిమితం కావాల్సి వచ్చింది. జిల్లాల విభజన జరిగి ఏడాది కావొస్తున్నా.. నేతలందరూ ఒక్క తాటిపైకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నాయకులను, కార్యకర్తలను ఒక్కతాటిపై నడిపించే నేతలు పార్టీలో కరువయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి, చందూలాల్ ఇద్దరు మంత్రులుగా ఉన్నా.. పార్టీని సమన్వయం చేసే పరిస్థితి లేదు. వీరిద్దరు ఐదు జిల్లాలో పర్యటిస్తున్నా.. ఎక్కువగా ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. పార్టీలో నేతల మధ్య సమన్వయం సాధించేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గ్రూపులు బలపడతున్నాయి. దీనికి తోడు ఉద్యమకారులకు పార్టీలో సరైన గుర్తింపు లేకుండా పోతుందంటూ ఇటీవల అసమ్మతి గళం విప్పుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన వారికి ప్రస్తుతం పార్టీలో గుర్తింపు లేదంటూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్త నేతలతో మాట్లాడి వారి రాజకీయ భవిష్యత్‌కు హామీ ఇచ్చి నచ్చజెప్పే ప్రయత్నం పార్టీ పరంగా జరగడం లేదు. వరంగల్ తూర్పులో అచ్చ విద్యాసాగర్ వంటి నేతలు బహిరంగ లేఖ రాసినా.. పార్టీ నుంచి సరైన స్పందన లేదు. దీంతో అచ్చ విద్యాసాగర్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్లో కొత్తవారికే పదవులు దక్కుతున్నాయి.. పాత వారికి ప్రాధాన్యం లేదంటూ మార్చిలో గీసుకొండలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సమావేశం నిర్వహించారు. ఇద్దరు మంత్రులు ఉన్నా.. పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యేను ఆ సమావేశం దగ్గరకు పంపారు. దీంతో సంతృప్తి చెందని వారు వారం తర్వాత రెండో సమావేశం నిర్వహించారు. పదవులు పొందిన నేతలు పార్టీ పటిష్టతకు పనిచేయడం లేదని, దీని ఫలితంగా పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. -
తెలంగాణ స్పీకర్‌కు పాలాభిషేకం.. వైరల్
సాక్షి, భూపాలపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్లకు, ఫొటోలకు ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు అప్పుడప్పుడు పాలాభిషేకాలు చేయడం చూశాం. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారికి ఆయన అభిమానులు పాలాభిషేకం చేశారు. ఆయనను మధ్యలో కూర్చోబెట్టి.. నిండు బిందె పాలతో ఆయనను తడిపేశారు. పెద్దపల్లి జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా పెద్దపల్లిలో స్పీకర్ మధుసూదనాచారికి ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయనను మొదట శాలువతో సత్కరించారు. అనంతరం తమ అభిమానం చాటుకుంటూ.. ఒక బిందె పాలను ఆయనపై గుమ్మరించారు. ఈ పాలాభిషేకంతో స్పీకర్ తడిసిముద్దయ్యారు. తమ గ్రామంలో కొత్త గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభమైన ఆనందంలో అభిమానులు స్పీకర్‌కు పాలాభిషేకం చేసినట్టు తెలుస్తోంది. ఈ పాలాభిషేకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. -
విద్యాభివృద్ధికి కృషి చేస్తా
రేగొండ : విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి హామీ ఇచ్చారు. రేగొండ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ హైస్కూల్లో అదనపు గదుల నిర్మాణానికి రాజీవ్ విద్యామిషన్ నుంచి రూ.35 లక్షలు మంజూరయ్యూరుు. ఈ మేరకు గదుల నిర్మాణానికి మంగళవారం స్పీకర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగాంగా నాగరికతకు దూరంగా ఉన్న చెంచుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు. చెంచు విద్యార్థులు ఆంగ్ల భాష ఉచ్చరించేలా కమ్యూనికేట్ విద్యనందించేందుకు నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. గవర్నర్, సీఎంతో చెంచు విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడే విధంగా ఆరు నెలల్లో వారిని తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గేయూన్ని స్పీకర్ ఆలపించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో స్ధానిక సర్పంచ్ మోడెం ఆదిలక్ష్మి, ఎంపీపీ ఈర్ల సదానందం, ఎంపీటీసీ సభ్యుడు పట్టెం శంకర్, ఎంఈఓ కె.రఘుపతి, పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం వి.హేమ, ఎస్ఎంఎస్ చైర్మన్ కిషన్, కుంచాల సదావిజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.