జయరాజును సుద్దాల హనుమంతు– జానకమ్మల పురస్కారంతో సత్కరిస్తున్న దృశ్యం
హైదరాబాద్: ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన గొప్ప ప్రజా కవి సుద్దాల హనుమంతు అని తాజా మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి కొనియాడారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు– జానకమ్మల జాతీయ పురస్కారాన్ని ప్రఖ్యాత ప్రజా కవి జయరాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మధుసూదనాచారి మాట్లాడుతూ.. తెలంగాణ పల్లెల్లో ప్రతి నాలుక మీద ఆడిన పాట ‘‘పల్లెటూరి పిల్లగాడ పశుల గాసే మొనగాడ’’పాట అని గుర్తు చేశారు. నేటికీ ఆ పాటను తెలంగాణ సమాజం మరువలేదని కితాబిచ్చారు. నిర్భందాలు కొనసాగుతున్నప్పటికీ సాహి త్యాన్ని సృష్టించి సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి సుద్దాల అని కితాబిచ్చారు. అలాంటి వ్యక్తి పురస్కారాన్ని జయరాజుకు ఇవ్వటం అభినందనీయం అని కొనియాడారు.
మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్న తరుణంలో తల్లిదండ్రు ల ఖ్యాతిని పెంచేవిధంగా వారి పేరిట అవార్డులు ఇవ్వడం ఆదర్శనీయం అని అన్నారు. ప్రముఖ కవి, విమర్శకులు కోయి కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ నిరంకుశ పాలనను తన పాటల ద్వారా ప్రజలకు చాటి చెప్పన గొప్ప ప్రజా కవి సుద్దాల హనుమంతు అని కొనియాడారు. కార్మిక, కర్షక, వెట్టిచాకిరి, బహుజనుల విముక్తి కోసం ఆయన అనేక పాటలు రాశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎస్.ఎస్. తేజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు, సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, హనుమంతు కుమార్తె రచ్చ భారతి, పలువురు సీపీఐ నాయకులు పాల్గొన్నారు. సభకు ముందు సినీ సంగీత దర్శకులు యశోకృష్ణ నిర్వహణలో అశోక్ తేజ, జయరాజు పాటలను పాడి సభికులను అలరించారు.
Comments
Please login to add a commentAdd a comment