ఆ పత్రికలో మాపై తప్పుడు వార్తలు’
నల్లగొండ : గ్యాంగ్స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నయీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సొంత పత్రికలో తమపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారని కోమటిరెడ్డి శుక్రవారమిక్కడ ఆరోపించారు. తాము తప్పు చేసినట్లు అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని కోమటిరెడ్డి అన్నారు. నిజాయితీగా పనిచేస్తున్న శివధర్ రెడ్డిని ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పించారన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని కోమటిరెడ్డి మండిపడ్డారు. తమకు ప్రజాసేవే ముఖ్యమని, తమ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బెదిరింపులు, బ్లాక్ మెయిల్స్ కు తాము మొదటి నుంచి వ్యతిరేకమన్నారు. తాము నిప్పులా బతికామని, అలాగే బతుకుతామని అన్నారు. చట్టవిరుద్ధమైన పనులు చేయాల్సిన అవసరం తమ జీవితాల్లోనే లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు.