నయీం ఫొటోల కలకలం.. నాయిని కామెంట్
విశాఖపట్నం: కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీంతో పలువురు పోలీసు అధికారులు కలిసి ఉన్న ఫొటోలు వెలుగుచూడటం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం విశాటపట్నం పర్యటనకు వచ్చిన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఈ విషయమై విలేకరులు ప్రశ్నించగా.. ఫొటోల ఆధారంగా నయీం కేసులో చర్యలు తీసుకోలేమని తెలిపారు. దినపత్రికల్లో వచ్చిన ఫొటోలపై తాను స్పందించబోనని పేర్కొన్నారు. సిట్ నివేదిక ఆధారంగానే నయీం కేసులో చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని చెప్పారు. జేఏసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి.. బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు కోదండరాం అడ్డుపడుతున్నారని విమర్శించారు.
విశాఖపట్నంలో జరుగుతున్న శారదాపీఠం వార్షికోత్సవాలకు తెలంగాణ హోంమంత్రి నాయిని హాజరయ్యారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శారదాపీఠం వనదుర్గ హోమాలతోపాటు.. స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో చతుర్వేద సంహిత మహాయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్‌తోపాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.