కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీం దురాగతాలపై సిట్ విచారణ కొనసాగుతోందని రాష్ట్ర హోం, కార్మిక శాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. అతనికి అనుకూలంగా ఎవరూ వ్యవహరించినట్లు తేలినా వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... నయీమ్ బాధితులకు భూములు ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా పని చేస్తుందన్నారు. చట్టానికి విరుద్ధంగా ఎవరూ పని చేసినా క్షమించబోమని చెప్పారు.
రాష్ట్రంలో ఇటీవల ఎస్సైలు ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని... అలాగే వారి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని నాయిని వివరించారు. ఇప్పటికే జిల్లాల స్థాయిలో ఎస్సైలకు ఎస్పీలు కౌన్సెలింగ్ నిర్వహించారని నాయిని చెప్పారు.