నయీమ్ ‘ఐపీఎస్’ గాయబ్
కేసులో విచారిస్తారన్న భయంతో అజ్ఞాతంలోకి..
► గ్యాంగ్‌స్టర్‌తో చేతులు కలిపి కోట్లకు పడగలెత్తిన వైనం
► సెటిల్‌మెంట్లు, భూదందాలు, కబ్జాలతో అడ్డగోలు సంపాదన
► ఆస్తులకు బినామీగా తోడల్లుడు... ఇటీవలే ఆయన షోరూంలో సిట్ సోదాలు
► నయీమ్‌తో చుట్టరికం కూడా కలుపుకొన్న మాజీ ఐపీఎస్ అధికారి
► కేసులో తన పేరు బయటకు రాకుండా మాజీ డీజీపీతో స్కెచ్
► అరెస్ట్ తప్పదని మాయమైపోయారంటున్న సిట్
సాక్షి, హైదరాబాద్: ఆయన పోలీస్ శాఖలో సీనియర్ ఐపీఎస్‌గా పనిచేశారు.. అదనపు డీజీపీ హోదాలో పని చేసి పదవీ విరమణ పొందారు.. మావోయిస్టు కార్యకలాపాలపై డేగ కన్ను వేసే ఎస్‌ఐబీ(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)కు చీఫ్‌గా రెండున్నరేళ్లు పనిచేసిన ఆయన గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో చేతులు కలిపారు.. సెటిల్‌మెంట్లు, భూదందాలు, కబ్జాలకు పాల్పడ్డారు.. వందల కోట్లకు పడగలెత్తారు.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్ది భూమిని వెనకేసుకున్నారు.. ఇప్పుడు నయీమ్ కేసులో ఉచ్చు బిగుస్తుండటంతో జంప్ అయ్యారు! అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు!!
పరువు పోతుందని..
నయీమ్ కేసులో తనను ఎక్కడ విచారిస్తారో నన్న భయంతోనే సదరు రిటైర్డ్ అదనపు డీజీపీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. నయీమ్ కేసులో సస్పెండ్ అయిన ముగ్గురు అధికారులు, విచారణ ఎదుర్కొంటున్న మరో ముగ్గురు అధికారుల ద్వారా ఈయన కార్యకలాపాలు సాగించినట్టు సిట్ ఇప్పటికే ధ్రువీకరించింది. భూలావాదేవీలు, రిజిస్ట్రేషన్ పత్రాలతోపాటు ఢిల్లీలోని ఓ ఇంటిని సైతం నయీమ్ ఈ మాజీ అధికారికి ఇప్పించాడని, ఇందుకు తమ వద్ద ఆధారాలున్నాయని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనను విచారిస్తారని భావించి అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. నోటీసులు జారీ చేస్తే ఎక్కడ పరువు పోతుందోనని హైదరాబాద్‌కు రావడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో ఉంటూ కేంద్రం ద్వారా ఒత్తిడి తెచ్చే యత్నాలు చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు.
ఇటీవలే తోడల్లుడి షోరూంలో సోదాలు
నయీమ్ అండదండలతో రెచ్చిపోయిన సదరు మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి బంజారాహిల్స్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 500 గజాల స్థలం కబ్జా చేసి భవనం నిర్మించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇందులో ఆయన కుటుంబీకులు ఓ షోరూం నిర్వహిస్తున్నారని, అందులో రెండు నెలల క్రితం తాము సోదాలు కూడా నిర్వహించి సంబంధిత పత్రాలు తీసుకున్నట్లు సిట్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈయన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలోని ఓ కీలక కమిషనరేట్‌కు కమిషనర్‌గా పనిచేసిన సమయంలోనూ నయీమ్‌ను అక్కడకు పిలిపించి సెటిల్‌మెంట్లు చేసినట్టు ఫిర్యాదులు వచ్చినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. నయీమ్‌తో ద్వారా చేయించిన భూకబ్జాలు, ఆస్తులన్నింటిని తన పేరిట కాకుండా తోడల్లుడి పేరిట సదరు మాజీ అధికారి రిజిస్ట్రేషన్ చేయించారని, ప్రస్తుతం తోడల్లుడు షోరూం నిర్వహణలో భాగంగా విదేశాల్లో ఉంటూ బిజినెస్ చేస్తున్నారని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన ఆయన కూడా.. నయీమ్ కేసులో విచారిస్తారని భయపడి విదేశాలకు వెళ్లినట్టు తెలిసిందన్నారు. మొత్తం ఆస్తులన్నీ వారి పేరిటే ఉండటంతో తనకేమీ సంబంధం లేన్నట్టు రిటైర్డ్ ఐపీఎస్ వ్యవహరిస్తున్నారని, కానీ త్వరలోనే ఆయనకు నోటీసులిచ్చి విచారిస్తామని దర్యాప్తు అధికారులు స్పష్టంచేశారు.
నయీమ్‌తో చుట్టరికం కూడా..
మాజీ సీనియర్ ఐపీఎస్ కుటుంబంలో నయీమ్ కుటుంబానికి సంబంధించిన యువతి ఉందని, ఆమె ఎవరన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉందని సిట్ వర్గాలు తెలిపాయి. ఆమె పేరిట నగర శివారులో నాలుగెకరాల భూమి పత్రాలున్నాయని పేర్కొన్నాయి. ఆ యువతిని రిటైర్డ్ ఐపీఎస్ తోడల్లుడి కుమారుడికి ఇచ్చి నయీమ్ స్వయంగా వివాహం జరిపించాడు. ఈ విషయాన్ని నయీమ్ భార్య తన వాంగ్మూలంలో పేర్కొందని సిట్ అధికారి ఒకరు తెలిపారు. ఈ బంధుత్వాన్ని అడ్డుపెట్టు కొని సదరు మాజీ ఐపీఎస్ భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్టు తమ దర్యాప్తులో బయటపడిందన్నారు. వీటింన్నింటిపై త్వరలోనే విచారణ జరుపుతామని, ఆయన దర్యాప్తునకు హాజరుకావాల్సి ఉంటుందని సిట్ అధికారులు స్పష్టంచేశారు.
రిటైర్డ్ డీజీపీతో గేమ్
తన వద్ద పనిచేసి సస్పెండ్ అయిన వారు విచారణలో తన పేరు చెప్పకుండా ఉండేందుకు సదరు మాజీ ఐపీఎస్ అధికారి పథకం రచించారు. ఇందులో భాగంగానే రిటైర్డ్ డీజీపీని రంగంలోకి దించాడని పోలీస్ అధికారులు తెలిపారు. తన పేరు బయటపడకుండా ఉండాలంటే సస్పెండ్ అయిన వారిని కాపాడాలని భావించారు. అందుకే ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగలిగే రిటైర్డ్ డీజీపీని సీఎంవో కార్యాలయానికి పంపినట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే అది సాధ్యపడకపోవడంతో నగరం విడిచి ఢిల్లీ వెళ్లినట్టు తెలిసిందన్నారు.
రాజకీయాల్లో కలసి రాని అదృష్టం..
అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులన్నింటికి తన తోడల్లుడిని బినామీగా పెట్టుకొన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రాజకీయాల్లోకి కూడా దిగారు. అయితే రాజకీయాల్లో అదృష్టం కలిసి రాకపోవడంతో ఏపీలో బిజినెస్‌లు ప్రారంభించారు. పేరుకు తెలంగాణ అని చెప్పుకునే ఈయన పక్క రాష్ట్రంలో కోట్లు పెట్టుబడి పెట్టి ఢిల్లీలో ఉంటూ చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.