
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుడు శ్రీధర్‌గౌడ్‌ను తెలంగాణ పోలీసులు పీడీ యాక్ట్ కింద నిర్బంధంలోకి తీసుకోవడంలో ఎటువంటి తప్పులేదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. శ్రీధర్‌గౌడ్ వంటి వ్యక్తులు సాధారణ చట్టాలకు భయపడే పరిస్థితి లేదని, అటువంటి వారిపై పీడీ యాక్ట్ ప్రయోగమే సరైన చర్యని అభిప్రాయపడింది. శ్రీధర్‌గౌడ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించ డాన్ని సవాలు చేస్తూ అతని భార్య ఎన్.శ్రీలత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. శ్రీధర్‌గౌడ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ రాచకొండ కమిషనర్ 2016లో ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని తెలంగాణ ప్రభుత్వం ఆమోదిస్తూ 2017 జనవరి 5న జీవో జారీ చేసింది.
అనంతరం పీడీ యాక్ట్ కింద శ్రీధర్‌గౌడ్‌ను నిర్బంధిం చడాన్ని సలహా బోర్డు కూడా ధ్రువీకరిం చింది. వీటన్నింటిపై శ్రీధర్ గౌడ్ భార్య శ్రీలత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించా లంటూ హెబియస్ కార్పస్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హోంశాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, 2016 జనవరి నుంచి ఆగస్టు వరకు శ్రీధర్‌గౌడ్ 8 నేరాలు చేశారన్నారు. నేరాలకు పాల్పడటం శ్రీధర్‌గౌడ్ అలవాటు చేసుకున్నారని, దీని వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు.
నయీమ్ ఎన్‌కౌంటర్ తరువాత కూడా శ్రీధర్‌గౌడ్ తన తీరును మార్చుకోలేదన్నారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, శ్రీధర్ చర్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నాయంది. పోలీస్ కమిషనర్, ప్రభుత్వం అనాలోచితంగా నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది. ఈ ఉత్తర్వుల్లో ఎటువంటి తప్పులేదంటూ శ్రీలత పిటిషన్‌ను కొట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment