గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో అంటకాగిన నాయకులు, పోలీసు అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసు విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండడంతో నయీమ్‌తో లింకులు ఉన్న వారందరిపై సిట్ డేగకన్ను వేసింది. ఇందులో భాగంగా అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల లెసైన్స్‌డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలువురు నేతలకు నోటీసులు జారీ చేసి, కొందరి ఆయుధ లెసైన్సులు కూడా రద్దు చేసినట్లు తెలిసింది. అటు పోలీసు అధికారుల్లో కూడా ఎనిమిది మందికి మెమోలు ఇచ్చినట్లు సమాచారం. సర్వీస్ రివాల్వర్లను సరెండర్ చేయాలని వారి ని అధికారులు ఆదేశించినట్లు సమాచారం. వీరిలో ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. త్వరలో మరో 13 మందికి మెమోలు ఇచ్చి వారి నుంచి కూడా సర్వీసు రివాల్వర్లు స్వాధీనం చేసుకోవాలని పోలీసు శాఖ యోచిస్తోంది.