అతడి వల్లే మా జీవితాలు అస్తవ్యస్తం
హైదరాబాద్: నయీమ్ వల్లే తమ జీవితాలు అస్తవ్యస్తమయ్యాయని నయీమ్ బాధితులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అతడి ముఠా ఆగడాల వల్లే అయినవారు తమకు లేకుండా పోయారని.. కుటుంబాలన్నీ ఛిన్నాభిన్నమైపోయాయని వారు వాపోయారు. నయీమ్ అనుచరులు, ఆ ముఠాతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వ, పోలీసు అధికారులను శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ప్రజాఫ్రంట్ (టీపీఎఫ్) ఆధ్వర్యంలో నయీమ్ బాధితులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నయీమ్ వల్ల ఆచూకీ లేకుండా పోయిన, మరణించిన వారికి సంబంధించి జోడు ఆంజనేయులు తల్లి బాలమ్మ, భార్య సత్యలక్ష్మి, హక్కుల నేత పురుషోత్తం కూతురు శ్వేత, బెల్లి లలిత సోదరి బెల్లి సరిత, బెల్లి కృష్ణ కుమారుడు చంద్రశేఖర్, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి భార్య విద్యారెడ్డి, కె. అంజప్ప భార్య కె. ఈశ్వరమ్మ తదితరులు మాట్లాడారు. నయీమ్, అతడి ముఠా ఆగడాలతో తమ కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నమయ్యాయో కన్నీళ్లతో వివరించారు. ఈ ధర్నాలో సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు నారాయణ మాట్లాడుతూ నయామ్ వ్యవహరంలో ప్రభుత్వమే ముద్దాయని అన్నారు.
ప్రభుత్వం అండ లేకుండా నరహంతక నయీమ్ ఇంచుకూడా కదలలేడని, అతడి ఆగడాలు సాగవని, సీఎం, హోం మంత్రి, డీజీపీలందరికీ తెలుసన్నారు. 1996 నుంచి ఉన్న సీఎంలు, హోం మంత్రులు, డీజీపీలకు నార్కో టెస్టులు నిర్వహించాలని.. నిజాలు రాకపోతే ఇందిరాపార్కు వద్ద తాను ఉరి వేసుకుంటానని సవాలు చేశారు. నయీ మ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్, లేదా రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనైనా విచారణ జరపాలని వరవరరావు కోరారు.
సీపీఎం రాష్ర్ట కార్యవర్గ సభ్యులు రాములు మాట్లాడుతూ నిజాయితీ పరుడైన జడ్జితో విచారణ జరిపించాలని, లేదంటే రాజకీయ ప్రత్యర్థులను అణిచి వేయడానికి ప్రభుత్వం నయీమ్‌డైరీని ఉపయోగించుకునే ప్రమాదం ఉందన్నారు. మానవ హక్కుల వేదిక అధ్యక్షులు జీవన్‌కుమార్, తెలంగాణ ఉద్యమ నేత చెరుకు సుధాకర్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సాధినేని వెంకటేశ్వర్‌రావు, టీపీఎఫ్ నాయకులు నల్లమాస కృష్ణ, న్యూడెమోక్రసీ నాయకులు హన్మేష్, నయీం హంతక ముఠా వ్యతిరేకపోరాట కమిటీ నాయకులు బుచ్చారెడ్డి, న్యాయవాది రఘునాథ్ మాట్లాడారు.