నయీం కేసులో వేగం పెంచిన సిట్ | SIT Officers speed up investigation on gangster nayeem case | Sakshi
Sakshi News home page

‘పోలీసు అధికారులకు ఉచ్చు బిగుస్తోంది’

Published Tue, Sep 27 2016 8:07 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

నయీం కేసులో వేగం పెంచిన సిట్ - Sakshi

నయీం కేసులో వేగం పెంచిన సిట్

*నయాం ‘సన్నిహిత నేతల’కు ఆయుధ లెసైన్స్‌లు రద్దు

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయాం కేసును విచారిస్తున్న ‘సిట్’ పోలీసులు వేగం పెంచారు. దీనిలో భాగంగానే అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు ఉన్న లెసైన్సుడ్ ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలువురు నాయకులకు నోటీసులు జారీ చేశారని, కొందరు నేతల ఆయుధ లెసైన్సులు కూడా రద్దు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరితో పాటు నయీమ్‌తో సత్సంబంధాలు నెరిపిన పోలీసు అధికారుల్లో ఎనిమిది మందికి మెమోలు ఇచ్చినట్లు సమాచారం. తమ సర్వీసు రివాల్వర్లను సరెండర్ చేయాలని ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలను ఆదేశించినట్లు తెలిసింది.

నేతలకు త్వరలో నోటీసులు?
నయాం ఎన్‌కౌంటర్ తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలు అన్నీ సంచలనాత్మకంగానే ఉన్నాయి. రెండు దశాబ్ధాలుగా అటు అధికారంలో ఉన్న పార్టీల నేతలతో, ఇటు పోలీసు అధికారులతో విడదీయలేని సంబంధాలున్న నయాం పాల్పడిన అరాచకాల్లో వీరికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఒక వైపు ఆయా జిల్లాల్లో పోలీసు కేసులు నమోదు అవుతుండగా వారిలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారూ ఉంటున్నారు.

అధికార, విపక్ష పార్టీలన్న తేడా లేకుండా కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ పోలీసు బాసులు ఇలా అందరికీ సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయా నాయకులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ముందుగా ఆయా నేతలకు ఉన్న వ్యక్తిగత లెసైన్సు ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సిట్ నుంచి ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం ఇవ్వడంతో, ఎస్పీలు సైతం కలెక్టర్లకు పరిస్థితిని విన్నవించారని చెబుతున్నారు. ఇప్పటికే కొందరు కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న ఆయుధ లెసైన్సులను రద్దు చేశారని సమాచారం.

కేసులు ఎలా ఎదుర్కొందాం !
నయాంతో సంబంధాలు ఉన్నాయని ప్రచారమైన నేతలు కొందరు ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో కూడా మార్గాలు అన్వేషిస్తున్నారు. ఒక వేళ అరెస్టు అయితే పరిస్తితి ఏమీటి..? కేసును ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాల్లో స్పష్టత కోసం ఇప్పటికే కొందరు నేతలు సీనియర్ న్యాయవాదులను కూడా సంప్రదించారని తెలిసింది. వీరిలో కొందరు సుప్రీం కోర్టు న్యాయవాదుల సలహా కూడా తీసుకున్నారని చెబుతున్నారు. అధికారిక పదవుల్లో ఉన్న నేతలే కాకుండా, ఆయా పార్టీలకు చెందిన నాయకులూ ఉన్నారు.

ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే పోలీసు అధికారులకు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో తమపై కేసులు తప్పవన్న అభిప్రాయానికి నేతలు వస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు పోలీసుల నుంచి తమకు నోటీసులు అందేలోపే.. తమ పదవులకు రాజీనామా చేసి, సిట్ విచారణను స్వాగతిస్తున్నామని, విచారణ తర్వాత నిర్దోషులుగా తాము బయటకు వస్తామని మీడియా ఎదుట ప్రకటించాలన్న నిర్ణయానికి కూడా వచ్చారని చెబుతున్నారు.

8 మంది పోలీసు అధికారులకు మెమోలు
గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సత్సంబంధాలు నెరిపిన పోలీసు అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. దశాబ్ద కాలంగా నయీంతో సెటిల్‌మెంట్లు జరిపిన అధికారులకు సంబంధించి బలమైన ఆధారాలు వెలుగు చూడటంతో వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది. సిట్ దర్యాప్తులో ఇప్పటికే 21 మంది పోలీసు అధికారులు నయీంతో లావాదేవీలు కొనసాగించినట్లు ఆధారాలు బయటపడ్డాయి.

పలు హత్య కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తి, అదీ తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తితో అత్యంత సన్నిహితంగా మెలగడం పట్ల పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. దానికి అనుగుణంగా మొదటి విడతలో 8మంది అధికారులకు మెమోలు జారీ చేసినట్లు సమాచారం. వీరు వెంటనే సర్వీసు రివ్వాలర్లు పోలీసు ప్రధాన కార్యాలయంలో అప్పగించాలని ఆదేశించింది. వీరిలో ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నట్లు సమాచారం.

త్వరలో మరో 13 మందికి మెమోలు ఇచ్చి వారి నుంచి కూడా సర్వీసు రివాల్వర్లు స్వాధీనం చేసుకోవాలని పోలీసుశాఖ యోచిస్తోంది. వీరందరూ గ్యాంగ్‌స్టర్‌తో అత్యంత సన్నిహితంగా మెలగడంతో పాటు పెద్ద ఎత్తున లబ్ది పొందినట్లు సిట్‌కు పక్కా ఆధారాలు లభించాయి. నయీంతో పోలీసులు సన్నిహితంగా మెలిగినట్లు అతని డెన్‌లో ఫోటోలు లభించాయి. వీటితో పాటు భారీగా భూలావాదేవీలు జరిపిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. వీటిని రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ధ్రువీకరించింది. మునుముందు వీరందరిపై క్రమశిక్షణ చర్యల కింద డిపార్టుమెంట్ నుంచి తొలగించే అవకాశం ఉందని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement