‘24మందిని హతమార్చిన నయీం’
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ అయినా అతడి అరాచకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. నయీం చేతిలో 24మంది హతమారినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. అయితే అందులో నాలుగు మృతదేహాలకు వైద్యులు తప్పుడు పోస్ట్మార్టం నివేదికలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ వైద్యులకు నోటీసులు జారీ చేశామని, వారిని కూడా విచారణ జరపనున్నట్లు సిట్ అధికారులు సోమవారమిక్కడ పేర్కొన్నారు. అలాగే నయీం కేసులో ఇప్పటివరకూ 99కేసులో నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకూ లభించిన డాక్యుమెంట్లు, కీలక ఆధారాలను నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు.
మరోవైపు నయీం కేసులో రాజకీయ, పోలీసుల లింక్లపై ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు సిట్ అధికారులు. ఆధారాల సేకరణకు రెండు బృందాలను ఏర్పాటు చేసి, పూర్తి ఆధారాలు లభ్యమైన తర్వాత నోటీసులు అందచేసి విచారణ జరుపుతామని అధికారులు చెబుతున్నారు. ఇక భూకబ్జాలకు సంబంధించి నయీంకు సహకరించిన అధికారుల వివరాల కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీజీకి లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యేలోపు ఈ కేసు దర్యాప్తును సిట్ ముగించనున్నట్లు తెలుస్తోంది.