నయీం గ్యాంగ్‌తో కుమ్మక్కు: జైలర్‌పై వేటు
హైదరాబాద్: వరంగల్ కేంద్ర కారాగారంలో పనిచేస్తోన్న మరో అధికారిపై బదిలీ వేటు పడింది. ఇద్దరు ఖైదీల పరారీ ఘటనకు బాధ్యులుగా పలువురు ఉన్నతాధికులు, సిబ్బందిపై సస్పెన్షన్, బదిలీ వేటు పడగా, తాజాగా నయీం గ్యాంగ్‌తో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో జైలర్ గోపి రెడ్డిని బదిలీచేశారు.
నయీం గ్యాంగ్‌కు చెందిన పాశం శ్రీను, సుధాకర్‌లు ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీలుగా ఉన్నారు. ఈ క్రమంలో జైలర్ గోపి రెడ్డి ఖైదీల నుంచి డబ్బులు తీసుకుని వారికి అదనపు సౌకర్యాలు కల్పించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. చివరికి ఆ ఆరోపణలన్నీ నిజమేనని రుజువు కావడంతో జైలర్ గోపి రెడ్డిపై బదిలీ వేటు పడింది. అంతేకాదు, జైలర్ వ్యవహారంపై విచారణ జరపాలని నయీం కేసును విచారిస్తున్న సిట్‌కు లేఖ రాసినట్లు జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్ తెలిపారు.
నవంబర్ మొదటి వారంలో వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలన రేపిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఒక్కొక్కటిగా చోటుచేసుకుంటున్న పరిణామాల్లో ఉన్నతాధికారులతో పాటు జైలులో కింది స్థాయి సిబ్బందిపైనా చర్యలు తీసుకున్నారు. జైలు సూపరింటెండెట్ న్యూటన్‌ను బదిలీ చేయగా, ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో ఖైదీలకు సహకరిస్తూ జైలును, జైలు భద్రతను అప్రతిష్టపాలు చేయాలని భావించిన ఇద్దరు వైద్యులపై వేటు వేసింది. మరో వైద్యుడిపై పూర్తి స్థాయి నివేదికకు ఆదేశించింది. ఇప్పుడు జైలర్‌ను బదిలీ చేశారు.