సాక్షి, కరీంనగర్ : హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కరీంనగర్ జైలులో ఎక్కువ మంది ఉండడంతో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితులగా ఉన్న వారి సేఫ్టీ కోసం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. న్యాయవాదుల హత్య కేసులో 18న అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్, శివంతుల చిరంజీవి, అక్కపాక కుమారులను 19న మంథని కోర్టులో హాజరుపరిచారు. వీరికి 14 రోజులు జుడిషియల్ రిమాండ్ విదించడంతో నాలుగు రోజులుగా కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. కరీంనగర్ జైలులో ఎక్కువ మంది ఖైదీలు ఉండడంతో పాటు లాకప్‌లన్నీ నిండిపోవడంతో కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ముగ్గురు నిందితులను వరంగల్ సెంట్రల్ జైల్‌కు తరలించినట్లు సూపరిండెంట్ సమ్మయ్య తెలిపారు.
మరోవైపు హత్య కేసు నిందితులను వారంరోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో పోలీస్ కస్టడీ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. హత్య కేసులో మరో నిందితుడు బిట్టు శ్రీనును మంథని కోర్టులో హాజరు పరచనున్నారు. ఇప్పటికే గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగిటివ్ రిపోర్ట్ రావడంతో అతన్ని మంథని కోర్టుకు తరలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment