warangal central jail
-
Warangal Central Jail: కాలగర్భంలోకి 135 ఏళ్ల చరిత్ర!
వరంగల్: నిజాం పాలనా సమయంలో నిర్మించిన వరంగల్ సెంట్రల్ జైలుది 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర. నిజాం హయాంలో స్వాతంత్య్ర సమరయోధుల నుంచి స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, పీపుల్స్‌వార్, మావోయిస్టు అగ్రనేతల దాకా ఎందరో ఈ జైలులో ఖైదీలుగా గడిపారు. ఇంతటి చరిత్ర ఉన్న జైలు భవనాలు త్వరలోనే కాలగర్భంలో కలిసిపోనున్నాయి. ప్రజలకు విస్తృతమైన వైద్యసేవలు అందించడం కోసం.. వరంగల్ నడిబొడ్డున ఉన్న ఈ జైలు స్థానంలో రీజనల్ కార్డియాక్ సెంటర్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివార్లలోని మామునూరులో కొత్త జైలు నిర్మాణానికి స్థలం కేటాయించింది. కొత్త నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఖైదీలను ఇతర జైళ్లలో ఉంచనున్నారు. ఈ మేరకు ఖైదీల తరలింపును జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్‌లోని సెంట్రల్ జైలు ప్రత్యేకతలపై కథనం.. 1886లో నిర్మాణం స్వాతంత్య్రానికి ముందు దేశం మొత్తం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో కొనసాగింది. అప్పట్లో శిక్ష పడిన ఖైదీలను ఉంచడానికి హైదరాబాద్‌లో చంచల్‌గూడ, ముషీరాబాద్ సెంట్రల్ జైళ్లు ఉండగా.. ఉత్తర తెలంగాణ ప్రాంత ఖైదీల కోసం 1886లో వరంగల్‌లో సెంట్రల్ జైలును నిర్మించారు. మొత్తం 66 ఎకరాల్లో ఈ జైలు ఉండగా.. రెండేళ్ల క్రితం కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీకి ఆరు ఎకరాలు ఇవ్వడంతో అరవై ఎకరాలు మిగిలాయి. సుమారు 30 ఎకరాల్లో పరిపాలనా భవనం, ఖైదీల బ్యారెక్‌లు, హై సెక్యూరిటీ బ్యారెక్‌లు, ఖైదీల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కర్మాగారాలు, ఆస్పత్రి ఉన్నాయి. నిజాం పాలనలో ఉన్నప్పటికీ జైలు నిర్మాణం మొత్తం బ్రిటిష్ ఇంజనీర్ల పర్యవేక్షణలో జరిగింది. డంగు సున్నం, ఇంగ్లండ్ నుంచి తెప్పించిన ఇనుమును వాడారు. ఇప్పటికీ లాకప్ ఇనుప కడ్డీలపై మేడిన్ ఇంగ్లండ్ అని ఉండటం చూడొచ్చు. జైలు నిర్మించిన సమయంలో 51 బ్యారెక్‌లు నిర్మించారు. భద్రత కోసం ఎత్తయిన ప్రహరీ, ఐదు వాచ్ టవర్లు, పరిపాలనా సౌలభ్యం కోసం మరో టవర్ కట్టారు. 2010లో కేంద్రం నుంచి రూ.22 కోట్లు మంజూరు కాగా.. రెండు కొత్త బ్యారెక్‌లు, హై సెక్యూరిటీ ప్రహరీ, నాలుగు కొత్త వాచ్ టవర్లను నిర్మించారు. పోరాట యోధులు, విప్లవ ఖైదీలకు అడ్డా స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న విప్లవ యోధులు పలువురు వరంగల్ సెంట్రల్ జైలులోనే శిక్ష అనుభవించారు. 80వ దశకం నుంచి అప్పటి పీపుల్స్‌వార్, ఇప్పటి మావోయిస్టులతోపాటు సీపీఐ (ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి, రవూఫ్ తదితర వర్గాలకు చెందిన నక్సల్స్ ఇక్కడే ఖైదీలుగా గడిపారు. ఇక్కడ నక్సల్స్ కోసం ప్రత్యేకంగా నక్సల్స్ బ్యారెక్ (ఎన్ఎక్స్ఎల్) ఏర్పాటు చేశారు. ఈ బ్యారెక్స్‌లో ఉండే నక్సల్స్‌కు జైలు అధికారులు నిత్యావసరాలు ఇస్తే.. వారే స్వయంగా వండుకొని తినేవారు. తర్వాత మావోయిస్టు కార్యకలాపాలు తగ్గడంతో ఈ బ్యారెక్‌ను సాధారణ ఖైదీలకు కేటాయించారు. పీపుల్స్‌వార్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కేజీ సత్యమూర్తి, మావోయిస్టు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు కోబాడ్ గాంధీ, శాఖమూరి అప్పారావు, విరసం నేత వరవరరావు, సీపీఐఎంఎల్ (జనశక్తి) వర్గ నాయకుడు కూర రాజన్న, ఆర్ఓసీ రవూఫ్, నూడెమోక్రసీ గడ్డం వెంకట్రామయ్య అలియాస్ దొరన్న, బోగా శ్రీరాములు అలియాస్ మాధవ్, ధనసరి సమ్మన్న అలియాస్ గోపి, మధుతోపాటు దళ కమాండర్, సభ్యుల స్థాయి వారు ఇక్కడ ఖైదీలుగా గడిపారు. ఇంకా దూరమైపోతున్నారా? ‘ఇప్పటికే మాకు దూరంగా ఉన్నారు. దగ్గరుంటే అప్పుడో, ఇప్పుడో చూసుకునేటోళ్లం. ఇప్పుడు ఇంకా దూరమైపోతున్నారా..’అంటూ వరంగల్ సెంట్రల్ జైలు వద్ద ఖైదీల బంధువులు కన్నీళ్లు పెట్టుకున్నారు. జైలు నుంచి ఖైదీలను తరలిస్తున్న విషయం తెలిసి పలువురి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తమవారిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఖైదీ సెంట్రల్ జైలులో ఉండేవాడు. ఆయన భార్య, చిన్నపిల్లలు అప్పుడప్పుడు వచ్చి ములాఖత్‌లో కలిసి వెళ్లేవారు. కానీ ఇప్పుడు అతడిని చర్లపల్లి జైలుకు తరలిస్తుండడంతో.. అంత దూరం రావడం ఎలా, చూసుకోవడం ఎలా అంటూ ఆయన తల్లి, భార్యాపిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారు జైలు నుంచి బయటికి వచ్చిన వాహనం వెంట గుండెలు బాదుకుంటూ కొంత దూరం వెళ్లడం.. ఆ ఖైదీ వాహనం నుంచి చూస్తూ రోదించడం కలచివేసింది. భద్రత ఎంతో పటిష్టం దేశంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లున్న జైలుగా తీహార్ జైలుకు పేరుంది. దీనిని మించిన భద్రతతో వరంగల్ సెంట్రల్ జైలును తీర్చిదిద్దారు. కమాండ్ కంట్రోల్ రూం, హైసెక్యూరిటీ బ్యారక్స్, నిరంతర పర్యవేక్షణతోపాటు ఖైదీలకు ఉపాధి కల్పించే కార్యక్రమాల్లోనూ వరంగల్ జైలు మొదటి స్థానంలో ఉంది. హైసెక్యూరిటీ బ్యారక్స్‌లో 48 సెల్స్ ఉన్నాయి. వీటికి ప్రత్యేక లాకింగ్ సిస్టం, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. కరుడుగట్టిన, ప్రమాదకర ఖైదీలను ఇందులో ఉంచేవారు. ప్రస్తుతం వీటిలో 40 మంది వరకు ఉన్నారని సమాచారం. ఇక ఈ జైల్లోని కమాండ్ కంట్రోల్ రూం నుంచి 24 గంటల పాటు సిబ్బంది నిఘా ఉంటుంది. భద్రతా చర్యల్లో భాగంగా 154 శక్తివంతమైన హైరిజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఖైదీలకు ఉపాధి కోసం.. వరంగల్ సెంట్రల్ జైలులో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఏటా 20 లక్షల మొక్కలను పెంచి జిల్లా యంత్రాంగానికి అందజేస్తున్నారు. జైలు ఆవరణలో రెండు పెట్రోల్ పంపులను ఖైదీలతో నిర్వహిస్తున్నారు. దర్రీస్, సబ్బులు, ఫినాయిల్, స్టీల్ బీరువాలు, బెంచీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి ఉత్పత్తులను ‘మై నేషన్’బ్రాండ్ పేరిట విక్రయిస్తున్నారు. వాటి నుంచి సగటున ఏటా రూ.3 కోట్ల వరకు ఆదాయం అందుతోంది. తరచూ నేరాలు చేసేవారి మనస్తత్వం మార్చేందుకు ‘ఉన్నతి’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, పీజీ కోర్సులను జైలులోనే అందిస్తున్నారు. రెండేళ్లలో అత్యాధునిక జైలు వరంగల్: సెంట్రల్ జైలు స్థలంలో రీజనల్ కార్డియాక్ సెంటర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. వైద్య శాఖకు ఈ స్థలం అప్పగించడం కోసం ఖైదీలను ఇతర జైళ్లకు తరలిస్తున్నామని జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది తెలిపారు. మంగళవారం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీల తరలింపు ప్రక్రియ మొదలైంది. దీనిని ఆయన పరిశీలించి, మీడియాతో మాట్లాడారు. మామునూరులో కేటాయించిన స్థలంలో అత్యాధునిక హంగులతో కూడిన సెంట్రల్ జైలును రెండేళ్లలో నిర్మిస్తామని రాజీవ్ త్రివేది తెలిపారు. ప్రస్తుతం జైల్లో 956 ఖైదీలు ఉన్నారని.. అందులో తొలివిడతగా మంగళవారం 119 మంది ఖైదీలను భారీ బందోబస్తుతో హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలుకు తరలించామని వివరించారు. చదవండి: ముందు పోలీస్ వాహనం..వెనుకే ఆమె పరుగు.. Telangana: ఇంటర్ ఫైనల్ పరీక్షలు రద్దు?! -
రెండేళ్లలో మోడ్రన్ జైలును నిర్మిస్తాం: రాజీవ్ త్రివేది
సాక్షి, వరంగల్: వరంగల్‌లోని సెంట్రల్ జైలుని మంగళవారం జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది సందర్శించారు. కాగా గతంలో కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా సెంట్రల్ జైలు స్థానంలో ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే వరంగల్ సెంట్రల్ జైలును వేరే చోటికి తరలిస్తున్నారు. దీనిలో భాగంగా ఖైదీలను వివిధ జైళ్లకు తరలిస్తున్నట్లు రాజీవ్ త్రివేది పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '' ప్రస్తుతం ఈ జైలులో 956 మంది ఖైదీలు, 2,667 మంది సిబ్బంది ఉన్నారు. ఇవాళ మొత్తం 119 మంది ఖైదీలను తరలిస్తున్నారం. 15 రోజుల్లోగా ఖైదీల తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తాం. త్వరలో వరంగల్ సెంట్రల్ జైలును వేరొకచోట మోడ్రన్ జైల్‌గా నిర్మిస్తాం. కొత్త జైలు నిర్మాణం కోసం భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రెండేళ్లలోగా ఆధునిక టెక్నాలజీతో కొత్త జైలును మోడ్రన్ జైలుగా నిర్మాణం చేపడతాం. ఎంజీఎం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, సెంట్రల్ జైల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేయనున్నారు.'' అని రాజీవ్ త్రివేది పేర్కొన్నారు. -
వరంగల్ జైలుకు వామన్‌రావు నిందితులు
సాక్షి, కరీంనగర్ : హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కరీంనగర్ జైలులో ఎక్కువ మంది ఉండడంతో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితులగా ఉన్న వారి సేఫ్టీ కోసం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. న్యాయవాదుల హత్య కేసులో 18న అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్, శివంతుల చిరంజీవి, అక్కపాక కుమారులను 19న మంథని కోర్టులో హాజరుపరిచారు. వీరికి 14 రోజులు జుడిషియల్ రిమాండ్ విదించడంతో నాలుగు రోజులుగా కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. కరీంనగర్ జైలులో ఎక్కువ మంది ఖైదీలు ఉండడంతో పాటు లాకప్‌లన్నీ నిండిపోవడంతో కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ముగ్గురు నిందితులను వరంగల్ సెంట్రల్ జైల్‌కు తరలించినట్లు సూపరిండెంట్ సమ్మయ్య తెలిపారు. మరోవైపు హత్య కేసు నిందితులను వారంరోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో పోలీస్ కస్టడీ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. హత్య కేసులో మరో నిందితుడు బిట్టు శ్రీనును మంథని కోర్టులో హాజరు పరచనున్నారు. ఇప్పటికే గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగిటివ్ రిపోర్ట్ రావడంతో అతన్ని మంథని కోర్టుకు తరలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. -
గాంధీ జయంతి నాడు ఖైదీలకు విముక్తి
సాక్షి, వరంగల్: జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాలతో 38 మంది ఖైదీలను వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు శనివారం రాత్రి విడుదల చేశారు. గాంధీ జయంతి సందర్భంగా సత్ప్రవర్తనతో శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక రెమిషన్ జారీ చేసింది. ఈ మేరకు వరంగల్ సెంట్రల్ జైలులో 66 శాతం శిక్ష పూర్తి చేసిన 41 మంది విడుదలకు అర్హులుగా పేర్కొంటూ జాబితా రూపొందించారు. ఈ జాబితాను పరిశీలించిన ఉన్నతాధికారులు 38 మంది విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచిస్తున్న జైలు సూపరింటెండెంట్ మురళీబాబు ఈసందర్భంగా ఫైల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 1వ తేదీన గవర్నర్ ఆమోదానికి పంపించగా శుక్రవారం గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. అయితే, దుబ్బాక ఉప ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం వేచి చూడగా, శనివారం అనుమతి వచ్చింది. అయితే, ప్రభుత్వం జీఓ విడుదల చేసినా జైళ్ల శాఖ నుంచి శనివారం సాయంత్రం 6 గంటలకు ఆదేశాలు రాగానే అధికారులు ఖైదీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి నేరాలకు పాల్పడబోమని, సత్ప్రవర్తనతో సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తామని మహాత్మాగాంధీ చిత్రపటం ముందు వారితో జైలు సూపరింటెండెంట్ మురళీబాబు ప్రమాణం చేయించారు. ఆదుకున్న ‘చాంబర్’ కమలాపురం మండలానికి చెందిన మొగిలిచర్ల బిక్షపతి పేరు విడుదలయ్యే వారి జాబితాలో ఉంది. అయితే, ఆయన కోర్టు విధించిన రూ.17,500 జరిమానా చెల్లించాల్సి ఉండగా, అంత డబ్బు లేకపోవడంతో నిరాశ చెందారు. ఈ విషయాన్ని జైలు అధికారులు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యుల దృష్టికి తీసుకెళ్లగా వారు డబ్బు కట్టడంలో బిక్షపతి కూడా విడుదలయ్యారు. కాగా, ఖైదీలు విడుదల సందర్భంగా పలువురి కుటుంబ సభ్యులు శనివారం ఉదయం నుంచి జైలు వద్ద వేచి ఉన్నారు. తమ కుటుంబీకులు బయటకు రాగానే ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకోవడంతో ఉద్విఘ్న భరిత వాతావరణం నెలకొంది. అయితే, కొందరికి సంబంధించి బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడం గమనార్హం. తల్లి లక్ష్మిని తీసుకెళ్తున్న కుమారుడు 38మంది విడుదలయ్యారు... గాంధీ జయంతి సందర్భంగా జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయం ఉత్తర్వుల మేరకు సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 38 మంది ఖైదీలను విడుదల చేశారు. వీరిలో 14 ఏళ్లకు పైగా శిక్ష పూర్తి చేసిన 27 మంది పురుషులు, ఎనిమిదేళ్లకు పైగా శిక్ష పూర్తిచేసుకున్న 11 మంది మహిళలు ఉన్నారు. వీరందరూ పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు. – ఎన్.మురళీబాబు, జైలు సూపరింటెండెంట్ ఆదుకున్నారు.. కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. ఇప్పుడు విడుదలకు అన్ని అర్హతలు ఉన్నా జరిమానా చెల్లించేందుకు డబ్బు లేక పోవడంతో పెండింగ్‌లో పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా జైలు అధికారులు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు తెలపగా వారు డబ్బు చెల్లించారు. చాంబర్ ప్రతినిధులతో పాటు జైలు అధికారులకు రుణపడి ఉంటాను. – మొగిలిచెర్ల భిక్షపతి, కమలాపురం -
వరంగల్ జైలుకు సంజయ్
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పది మంది హత్యకేసులో నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్‌ను మంగళవారం పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్ వరంగల్ శాంతినగర్‌లోని గోనెసంచుల తయారీ కేంద్రంలో పనిచేస్తున్న మహమ్మద్ మక్సూద్ ఆలం, అతని కుటుంబ సభ్యులతో పాటు మరికొందరిని భోజనంలో నిద్రమాత్రలు కలిపి హత్య చేసిన విషయం తెలిసిందే. గొర్రెకుంట బావిలో తోసేసి తొమ్మిది మందిని, అంతకు ముందు ఒకరిని హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు సంజయ్‌కుమార్‌ను వరంగల్ పోలీసులు మంగళవారం ఉదయం 3వ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడికి ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి జైలుకు తరలించారు. సంజయ్‌కుమార్‌ను హైసెక్యూరిటీ బ్యారక్‌లో ఉంచామని జైలు సూపరింటెండెంట్ మురళీబాబు తెలిపారు. మృతదేహాలకు వరంగల్‌లో అంత్యక్రియలు హత్యకు గురైన తొమ్మిది మందిలో ఏడుగురి అంత్యక్రియలను మంగళవారం ముస్లిం మత పెద్దలు వారి బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించారు. మృతుడు మక్సూద్ బంధువులు ఉదయం పశ్చిమ బెంగాల్ నుంచి వరంగల్‌కు చేరుకోవడంతో పోలీ సులు మృతదేహాలను వారికి అప్పగించగా పోతనరోడ్డులోని శ్మశానవాటిలో అంత్యక్రియలను పూర్తి చేశారు. షకీల్, మక్సూద్ ఆలం, అతని కుటుంబ సభ్యుల మృతదేహాలకు గీసుగొండ ఇన్చార్జి తహసీల్దార్ సుహాసిని, రాయపర్తి తహసీల్దార్ సత్యనారాయణ పంచనామా నిర్వహించారు. బిహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్‌కుమార్ మృతదేహాలు ఎంజీఎంలోనే ఉన్నాయి. సమగ్ర విచారణకు మృతుల బంధువుల డిమాండ్.. మక్సూద్ బంధువులకు ఆరు మృతదేహాలను అప్పగించిన అనంతరం షకీల్ మృతదేహాన్ని తమకు ఇవ్వకపోవడంతో అతని భార్య తాహెరా బేగం పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టింది. షకీల్‌కు ఇద్దరు భార్యలు ఉండటంతో ఎవరికి మృతదేహం అప్పగించాలనే విషయంలో అధికారులు ఇబ్బందికి గురయ్యారు. షకీల్ మొదటి భార్యకు విడాకుల ప్రక్రియ పూ ర్తయిందని అతని సోదరుడు సజ్జర్ చెప్పడంతో అతని వివరణ తీసుకున్న తర్వాత రెండో భార్య తాహెరా బేగంకు మృతదేహాన్ని అప్పగించారు. 9 మందిని ఒక్కడే హతమార్చాడని పోలీసులు చెప్పడంపై పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన మక్సూద్ బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఎంజీఎం మార్చురీ వద్ద నిషా సోదరుడు ఫిరోజ్‌షా మాట్లాడుతూ తొమ్మిది మందిని సంజయ్‌కుమార్ యాదవ్ హత్య చేశాడని పోలీసులు పేర్కొంటున్నారని, ఒక్కడే ఇంతమందిని ఎలా హత్య చేస్తాడని ప్రశ్నించారు. సంజయ్‌కుమార్‌కు మరికొంతమంది సహాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. -
నల్లగొండ కోర్టుకు సైకో శ్రీనివాస్‌రెడ్డి
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో వరుస హత్యల కేసులో నిందితుడు సైకో శ్రీనివాస్‌రెడ్డికి పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం నల్లగొండ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు భువనగిరి ఏసీపీ భుజంగరావు వెల్లడించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి విచారణలో తెలిపిన వివరాల మేరకు పోలీసులు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనను హత్య చేసిన ప్రదేశంలో గాలించగా బాలిక స్కూల్ ఐడీ కార్డు లభించింది. అలాగే తిప్రబోయిన మనీషా ఆధార్ కార్డు, సెల్‌ఫోన్ పడవేసిన ప్రాంతంలో వెతకగా, అధార్ కార్డు లభ్యమైంది. సెల్‌ఫోన్ జాడ దొరకలేదు. ముగ్గురు బాలికల హత్యలలో నిందితుడు ఒంటరిగానే దురాగతాలకు పాల్పడ్డాడా.. ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో మూడు రోజుల పోలీస్ కస్టడీలో విచారించినట్లు తెలిసింది. -
పోలీసుల కస్టడీకి శ్రీనివాస్ రెడ్డి
సాక్షి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న అతడిని బుధవారం ఉదయం రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణాధికారిగా భువనగిరి ఏసీపీ భుజంగరావును రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నియమించిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసును లోతుగా విచారించేందుకు నిందితుడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్‌రెడ్డి ఈ నెల 8 నుంచి 13 వరకు విచారణ కోసం పోలీస్ కస్టడీకీ అను మతి ఇచ్చారు. ఆ సమయంలో పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని ఏ విధమైన శారీరక, మానసిక హింసకు గురి చేయరాదని ఉత్తర్వులో పేర్కొన్నారు. నేర చరిత్రపై కొనసాగనున్న విచారణ.. క్రూరమైన హత్యలకు పాల్పడిన శ్రీనివాస్‌రెడ్డి నేర చరిత్రపై పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి. నిందితుడి స్వగ్రామం హాజీపూర్, బొమ్మలరామాం, హైదరాబాద్, వేములవాడ, కరీంనగర్, కర్నూలు ఇతర ప్రాంతాల్లో జరిగిన మిస్సింగ్ కేసులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారించే అవకాశాలు ఉన్నాయి. నాలుగేళ్లుగా రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు తెప్పించుకున్న పోలీసులు వాటితో శ్రీనివాస్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారించనున్నారు. ఫేస్బుక్ స్నేహితులపై ఆరా... శ్రీనివాస్‌రెడ్డికి ఉన్న ఫేస్బుక్ అకౌంట్లోని స్నేహితుల వివరాలపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అతడి నేర ప్రవృత్తికి ఎవరైనా బలైపోయారా అన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. కాగా శ్రీనివాస్ రెడ్డి ఫేస్బుక్ ఖాతాలో ఎక్కువమంది మహిళలకు సంబంధించిన స్నేహితులే ఉన్నారు. కస్టడీ విచారణలో ఫేస్బుక్ పరిచయాలు, వారిందరితో గల సంబంధాలు వారి ప్రస్తుత పరిస్థితిని విచారణలో అధ్యయనం చేయనున్నారు. -
పోలీసుల కస్టడీకి హాజీపూర్ నిందితుడు
-
జీవిత ఖైదీ ఆత్మహత్య
వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న పండారి కిషన్ (48) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్న కిషన్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందతూ మృతిచెందాడు. జైలు సూపరింటెండెంట్ మురళీబాబు కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలుకా మల్క్వాడి కి చెందిన పండారి కిషన్‌కు ఓ హత్య కేసులో ఆదిలాబాద్ జిల్లా కోర్టు 2014లో జీవితఖైదు శిక్షను విధించింది. అప్పటి నుంచి కిషన్ వరంగల్ సెంట్రల్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే భార్య తల్లిని చంపిన కేసులో ముద్దాయి కావడంతో భార్యతో పాటు ముగ్గురు పిల్లలు అతడిని చూసేందుకు మూడేళ్లుగా రాలేదు. ఈ క్రమంలో ఆదివారం టిఫిన్ చేసిన కిషన్ బాత్రూమ్కు వెళ్లి తాడుతో ఉరి వేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కిషన్ మృతిచెందాడు. -
వరంగల్ జైలులో ఇటుకల పరిశ్రమ మూసివేత
వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీలు నిర్వహించే ఇటుకల పరిశ్రమను మూసివేశారు. జైలు ఇన్చార్జ్ పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తున్న సంపత్‌కు కాంట్రాక్టర్ లవకుమార్ రూ.3 లక్షల లంచం ఇవ్వలేదనే అక్కసుతో ఇటుకల పరిశ్రమను మూసివేయించారు. దీంతో 60మంది జీవిత ఖైదీలు ఉపాధిని కోల్పోయారు. పైగా ఖైదీలకు వడ్డించే ఆహారంలో నాణ్యత పాటించడం లేదంటూ కొంతమంది ఖైదీలను పావుగా వాడుకుని కాంట్రాక్టర్ లవకుమార్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేయించారు కూడా. దీనిపై విచారణ చేపట్టాలని సీఎం కేసీఆర్ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించారు. -
నయీం గ్యాంగ్‌తో కుమ్మక్కు: జైలర్‌పై వేటు
హైదరాబాద్: వరంగల్ కేంద్ర కారాగారంలో పనిచేస్తోన్న మరో అధికారిపై బదిలీ వేటు పడింది. ఇద్దరు ఖైదీల పరారీ ఘటనకు బాధ్యులుగా పలువురు ఉన్నతాధికులు, సిబ్బందిపై సస్పెన్షన్, బదిలీ వేటు పడగా, తాజాగా నయీం గ్యాంగ్‌తో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో జైలర్ గోపి రెడ్డిని బదిలీచేశారు. నయీం గ్యాంగ్‌కు చెందిన పాశం శ్రీను, సుధాకర్‌లు ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీలుగా ఉన్నారు. ఈ క్రమంలో జైలర్ గోపి రెడ్డి ఖైదీల నుంచి డబ్బులు తీసుకుని వారికి అదనపు సౌకర్యాలు కల్పించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. చివరికి ఆ ఆరోపణలన్నీ నిజమేనని రుజువు కావడంతో జైలర్ గోపి రెడ్డిపై బదిలీ వేటు పడింది. అంతేకాదు, జైలర్ వ్యవహారంపై విచారణ జరపాలని నయీం కేసును విచారిస్తున్న సిట్‌కు లేఖ రాసినట్లు జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్ తెలిపారు. నవంబర్ మొదటి వారంలో వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలన రేపిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఒక్కొక్కటిగా చోటుచేసుకుంటున్న పరిణామాల్లో ఉన్నతాధికారులతో పాటు జైలులో కింది స్థాయి సిబ్బందిపైనా చర్యలు తీసుకున్నారు. జైలు సూపరింటెండెట్ న్యూటన్ను బదిలీ చేయగా, ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో ఖైదీలకు సహకరిస్తూ జైలును, జైలు భద్రతను అప్రతిష్టపాలు చేయాలని భావించిన ఇద్దరు వైద్యులపై వేటు వేసింది. మరో వైద్యుడిపై పూర్తి స్థాయి నివేదికకు ఆదేశించింది. ఇప్పుడు జైలర్‌ను బదిలీ చేశారు. -
ఖైదీల పరారీ: జైలు సిబ్బందిపై వేటు
వరంగల్: సంచలన రీతిలో వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీలు పరారైన సంఘటనలో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సైనిక సింగ్, బీహార్‌కు చెందిన రాజేష్ యాదవ్ అనే ఇద్దరు ఖైదీలు శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జైలు గోడ దూకి పరారుకాగా, జైలు సిబ్బందే ఖైదీలకు సహకరిచారనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ఇద్దరు సిబ్బందిపై సస్సెన్షన్ వేటు వేశారు. ఘనట వెలుగు చూసిననాడే జైల్ సూపరింటెండెంట్ న్యూటన్ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దుప్పట్ల సహాయంతో జైలు గోడ దూకి పరారైన ఖైదీల కోసం వరంగల్ అర్బన్ పోలీస్‌లు గాలిస్తున్నారు. కాగా, జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు అనారోగ్యం పేరుతో పెరోల్ మీద బయటకు వెళ్లేందుకు సహకరిస్తోన్న ఇద్దరు నర్సింగ్ సిబ్బందితోపాటు ఎంజీఎం, కేఎంసీకి చెందిన ఇద్దరు డాక్టర్లపై జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు వైద్యులపై మట్టెవాడ పోలీసులు కేసులు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. -
ఒక ఖైదీ దొరికాడు..!
వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొని.. గాజువాకలో చిక్కాడు వరంగల్/గాజువాక: పటిష్ట భద్రత ఉండే వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుపోయిన ఇద్దరు ఖైదీల్లో ఒకడైన సైనిక్ సింగ్ గాజువాక దరి శ్రీనగర్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇతను ఆర్మీలో ఉద్యోగం చేసేవాడు. ఆయుధాల దొంగతనంలో పట్టుబడి వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మరో ఖైదీ రాజేష్ యాదవ్ అలియాస్ కుమార్‌తో కలసి జైలునుంచి తప్పించుకున్నాడు. గాజువాకలో గస్తీ నిర్వహిస్తున్న క్రైమ్ ఎస్ఐ అశోక్ చక్రవర్తి శ్రీనగర్ జంక్షన్లో అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని విచారించగా పొంత నలేకుండా మాట్లాడటంతో స్టేషన్‌కు తరలించారు. వరంగల్ పోలీసులు తమ వద్ద ఉన్న ఫొటోలను వాట్సప్‌లో పంపగా పారిపోయిన ఖైదీ సైనిక్సింగ్గా విశాఖ పోలీసులు గుర్తించారు. తాను వరంగల్ జైలునుంచి తప్పించుకున్నట్టు సింగ్ అంగీకరించడంతో పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలు సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. అతడు చెప్పిన వివరాలు సరిపోవడంతో అరెస్టు చేశారు. కాగా, సైనిక్సింగ్తో కలసి జైలునుంచి పరారైన రెండో ఖైదీ రాజేష్ యాదవ్ కూడా గాజువాక ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గాజువాకలో అరెస్టైన ఖైదీ సైనిక్ సింగ్‌ను పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకువచ్చే పనిలో ఉన్నారు. -
సెంట్రల్ జైలు ఖైదీ పరారీ
వరంగల్: కోర్టు నుంచి బస్సులో తీసుకెళ్తుండగా టాయిలెట్కని దిగిన ఓ జీవిత ఖైదీ తప్పించుకు పారిపోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా జనగామ మండలం యశ్వంతాపూర్ వద్ద చోటుచేసుకుంది. వరంగల్ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఉప్పల సూరిని పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ నిమిత్తం తీసుకువచ్చారు. తిరిగి అతడిని భూపాలపల్లి డిపో బస్సులో వరంగల్‌కు తీసుకెళ్తున్నారు. యశ్వంతాపూర్ సమీపంలోకి వెళ్లగానే మూత్రం వస్తోందంటూ అతడు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు బస్సును ఆపించారు. అతడు బస్సు దిగి, మూత్రానికని దూరంగా వెళ్లి అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిపైకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అయినప్పటికీ అతడు దొరక్కుండా తప్పించుకుపోయాడు. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అతడి కోసం గాలింపు చేపట్టింది. -
వరంగల్ జైలులో ఖైదీ మృతి
వరంగల్ : వరంగల్ కేంద్ర కారాగారంలో అనారోగ్యంతో ఒక ఖైదీ మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి మంగళవారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సాయంత్రం మృతి చెందాడు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సమయం వృథా చేయొద్దు
పోచమ్మమైదాన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఓపీని పరీక్షించే సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్త పడాలని, లేనిపక్షంలో రోగులు బారులు తీరుతారని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ సురేష్‌చందా అన్నారు. స్థానిక కేఎంసీలో శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐఎంఏ ప్రతినిధులు, కేఎంసీ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు యాంటీ బయాటిక్ మందులు రాయడం వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుంది తప్ప తగ్గదని సూచించారు. సాధ్యమైనంత వరకు జనరిక్ మందులు రాయాలని సూచించారు. డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ కంప్యూటరైజ్ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం కేఎంసీ బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. హెల్త్ హబ్‌గా వరంగల్‌ను మార్చొచ్చు వరంగల్‌ను హెల్త్ హబ్‌గా మార్చొచ్చని ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ విజయచందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేఎంసీ పరిధిలో 120 ఎకరాలు, సెంట్రల్ జైలు పరిధి లో 80 ఎకరాలు, ఎంజీఎం పరిధిలో 30 ఎకరాల భూ మి ఉంది. ఈ నేపథ్యంలో హెల్త్ హబ్ ఏర్పాటుకు భూ సమస్య లేదని తెలుపగా స్పందించిన ఇన్చార్జ్ వీసీ ఆ విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు. పాత బ్యాంకు భవనంలో యూనివర్సిటీ కార్యకలాపాలు ఎంజీఎం : హెల్త్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగించేందుకు పాత ఆంధ్రబ్యాంకు భవనం అనువుగా ఉంటుందని ఎంజీఎం సూపరింటెండెంట్ మనోహర్, కేఎంసీ ప్రిన్సిపాల్ రమేశ్‌కుమార్ సూచన మేరకు సురేష్‌చందా ఆ భవనాన్ని పరిశీలించారు. భవనంలో మెరుగైన సౌకర్యాలు, యూనివర్సిటీ నూతన భవన నిర్మాణాలకు సంబంధించి ప్రణాళిక తయారు చేసి హైదరాబాద్‌కు తీసుకురావాలని ఎంపీఎస్‌ఐడీసీ ఈఈని ఆదేశించారు. ఆయన వెంట దేవేందర్‌రెడ్డి, కేఎంసీ పీడీ తుమ్మ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
41 మంది జీవిత ఖైదీలకు విముక్తి
సాక్షి, హన్మకొండ, వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు జైలు జీవితం నుంచి విముక్తి పొందారు. గాంధీ జయంతి సందర్భంగా వారిని విడుదల చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం గతంలోనే అంగీకరించినప్పటికీ వాయిదాపడుతూ వస్తోంది. ఎట్టకేలకు సర్కార్ అనుమతి మేరకు 220 జీఓ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 390 మంది ఖైదీలు విడుదల కాగా... వరంగల్ సెంట్రల్ జైలులో 41 మంది ఖైదీలు క్షమాభిక్షకు అర్హులుగా తేలారు. వీరందరినీ శనివారం విడుదల చేస్తున్నట్లు జైళ్ల శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మే రకు రాత్రి 12.30 గంటల సమయంలో 37 మంది జైలు నుంచి బయటకు వచ్చారు. మిగతా వారిలో జీవిత ఖైదు అనుభవిస్తున్న కొమ్ము రాధ అనే మహిళను 20 రోజుల క్రితం హైకోర్టు ఉత్తర్వుల మేరకు విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్ రాజేష్ తెలిపారు. ఆమెతోపాటు నసీం ఖాన్, పిట్ల రాజేశ్వర్, ఎండీ.షాన్వాజ్ పెరోల్‌పై బయటనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ నలుగురిని ఆదివారం ఉదయం జైలు నిబంధనల మేరకు కేంద్ర కారాగారంలో జైలు అధికారుల ఎదుట సరెండర్ అవుతారని, ఆ తర్వాత క్షమాభిక్ష కింద వారిని వెంటనే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రెండున్నరేళ్ల తర్వాత... క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలను ముందుగానే గుర్తించి.. గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయడం ఇప్పటివరకు ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో చివరిసారి 2011 గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఖైదీ లను క్షమాభిక్షపై విడుదల చేశారు. ఆ తర్వాత రెండున్నరేళ్లపాటు ఆ ఊసే ఎత్తలేదు. 2013 గాంధీ జయంతి సందర్భం గా కూడా ప్రభుత్వం ఈ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలే కా కుండా అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తారుు. దీంతో సర్కారు హడావుడిగా అక్టోబరు 1న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ప్రకటించింది. కానీ... నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కావడంతో గాంధీ జయంతి నాటికి క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష ప్రకటన వెలువడిన తర్వాత జైళ్లశాఖ నియమ నిబంధనల ప్రకారం ఎంతమందికి క్షమాభిక్షకు అర్హులవుతారనే అంశాన్ని గుర్తించేందుకు రెండున్నర నెలల సమయం పట్టింది. వరంగల్ సెంట్రల్ జైలులో 41 మంది ఖైదీ లు అర్హులుగా తేలింది. వీరి జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. అన్ని పరిశీలనలు పూర్తరుున తర్వాత శనివా రం రాత్రి వీరిని విడుదల చేశారు. సాక్షి కార్యాలయానికి లేఖలు ‘మేము వరంగల్ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీలుగా వివిధ సెక్షన్ల కింద జీవిత ఖై దీలుగా శిక్ష అనుభవిస్తున్నాం. మేము విముక్తి కోసం ఇక్కడ జీవచ్ఛవాలుగా ఇక్కడ ఎదురు చూస్తున్నాం. తా ము చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందుతున్నాం. మాకు మరో జీవితాన్ని ప్రసాదించాలి. మా మనోవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి’ అంటూ గతంలో సాక్షి కార్యాలయానికి వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీలు పలు మార్లు లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించే గణతంత్ర, గాంధీజయంతి సందర్భంగా వీరి బాధలను ‘సాక్షి’ ప్రచురించిం ది. 60 ఏళ్లు పైబడిన పురుష ఖైదీలు, 55 ఏళ్లు పైబడిన మహిళా ఖైదీల ప్రవర్తను దృష్టిలో ఉంచుకుని క్షమాభిక్షపై విడుదల చేయాలని కోరుతూ ఆగస్టు 11న వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీలు ఆమరణ దీక్ష కూడా చేపట్టారు.