వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొని.. గాజువాకలో చిక్కాడు
వరంగల్/గాజువాక: పటిష్ట భద్రత ఉండే వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుపోయిన ఇద్దరు ఖైదీల్లో ఒకడైన సైనిక్ సింగ్ గాజువాక దరి శ్రీనగర్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇతను ఆర్మీలో ఉద్యోగం చేసేవాడు. ఆయుధాల దొంగతనంలో పట్టుబడి వరంగల్ సెంట్రల్ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్నాడు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మరో ఖైదీ రాజేష్ యాదవ్ అలియాస్ కుమార్‌తో కలసి జైలునుంచి తప్పించుకున్నాడు. గాజువాకలో గస్తీ నిర్వహిస్తున్న క్రైమ్ ఎస్‌ఐ అశోక్ చక్రవర్తి శ్రీనగర్ జంక్షన్లో అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని విచారించగా పొంత నలేకుండా మాట్లాడటంతో స్టేషన్కు తరలించారు.
వరంగల్ పోలీసులు తమ వద్ద ఉన్న ఫొటోలను వాట్సప్‌లో పంపగా పారిపోయిన ఖైదీ సైనిక్‌సింగ్‌గా విశాఖ పోలీసులు గుర్తించారు. తాను వరంగల్ జైలునుంచి తప్పించుకున్నట్టు సింగ్ అంగీకరించడంతో పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలు సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. అతడు చెప్పిన వివరాలు సరిపోవడంతో అరెస్టు చేశారు. కాగా, సైనిక్‌సింగ్‌తో కలసి జైలునుంచి పరారైన రెండో ఖైదీ రాజేష్ యాదవ్ కూడా గాజువాక ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గాజువాకలో అరెస్టైన ఖైదీ సైనిక్ సింగ్‌ను పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకువచ్చే పనిలో ఉన్నారు.
ఒక ఖైదీ దొరికాడు..!
Published Mon, Nov 14 2016 2:07 AM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM
Advertisement
Advertisement