వరంగల్ సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తున్న మహిళలు
సాక్షి, వరంగల్: జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాలతో 38 మంది ఖైదీలను వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు శనివారం రాత్రి విడుదల చేశారు. గాంధీ జయంతి సందర్భంగా సత్ప్రవర్తనతో శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక రెమిషన్ జారీ చేసింది. ఈ మేరకు వరంగల్ సెంట్రల్ జైలులో 66 శాతం శిక్ష పూర్తి చేసిన 41 మంది విడుదలకు అర్హులుగా పేర్కొంటూ జాబితా రూపొందించారు. ఈ జాబితాను పరిశీలించిన ఉన్నతాధికారులు 38 మంది విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
సత్ప్రవర్తనతో మెలగాలని సూచిస్తున్న జైలు సూపరింటెండెంట్ మురళీబాబు
ఈసందర్భంగా ఫైల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 1వ తేదీన గవర్నర్ ఆమోదానికి పంపించగా శుక్రవారం గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. అయితే, దుబ్బాక ఉప ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం వేచి చూడగా, శనివారం అనుమతి వచ్చింది. అయితే, ప్రభుత్వం జీఓ విడుదల చేసినా జైళ్ల శాఖ నుంచి శనివారం సాయంత్రం 6 గంటలకు ఆదేశాలు రాగానే అధికారులు ఖైదీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి నేరాలకు పాల్పడబోమని, సత్ప్రవర్తనతో సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తామని మహాత్మాగాంధీ చిత్రపటం ముందు వారితో జైలు సూపరింటెండెంట్ మురళీబాబు ప్రమాణం చేయించారు.
ఆదుకున్న ‘చాంబర్’
కమలాపురం మండలానికి చెందిన మొగిలిచర్ల బిక్షపతి పేరు విడుదలయ్యే వారి జాబితాలో ఉంది. అయితే, ఆయన కోర్టు విధించిన రూ.17,500 జరిమానా చెల్లించాల్సి ఉండగా, అంత డబ్బు లేకపోవడంతో నిరాశ చెందారు. ఈ విషయాన్ని జైలు అధికారులు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యుల దృష్టికి తీసుకెళ్లగా వారు డబ్బు కట్టడంలో బిక్షపతి కూడా విడుదలయ్యారు. కాగా, ఖైదీలు విడుదల సందర్భంగా పలువురి కుటుంబ సభ్యులు శనివారం ఉదయం నుంచి జైలు వద్ద వేచి ఉన్నారు. తమ కుటుంబీకులు బయటకు రాగానే ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకోవడంతో ఉద్విఘ్న భరిత వాతావరణం నెలకొంది. అయితే, కొందరికి సంబంధించి బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడం గమనార్హం.
తల్లి లక్ష్మిని తీసుకెళ్తున్న కుమారుడు
38మంది విడుదలయ్యారు...
గాంధీ జయంతి సందర్భంగా జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయం ఉత్తర్వుల మేరకు సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 38 మంది ఖైదీలను విడుదల చేశారు. వీరిలో 14 ఏళ్లకు పైగా శిక్ష పూర్తి చేసిన 27 మంది పురుషులు, ఎనిమిదేళ్లకు పైగా శిక్ష పూర్తిచేసుకున్న 11 మంది మహిళలు ఉన్నారు. వీరందరూ పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు. – ఎన్.మురళీబాబు, జైలు సూపరింటెండెంట్
ఆదుకున్నారు..
కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. ఇప్పుడు విడుదలకు అన్ని అర్హతలు ఉన్నా జరిమానా చెల్లించేందుకు డబ్బు లేక పోవడంతో పెండింగ్‌లో పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా జైలు అధికారులు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు తెలపగా వారు డబ్బు చెల్లించారు. చాంబర్ ప్రతినిధులతో పాటు జైలు అధికారులకు రుణపడి ఉంటాను. – మొగిలిచెర్ల భిక్షపతి, కమలాపురం
Comments
Please login to add a commentAdd a comment