prisoners release
-
162 మంది ఖైదీల విడుదల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/ఆరిలోవ (విశాఖ తూర్పు)/కడప అర్బన్/బుక్కరాయసముద్రం/ఒంగోలు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడంతో రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి పలువురు ఖైదీలు సోమవారం విడుదలయ్యారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, కడప, అనంతపురం, ఒంగోలు కారాగారాల నుంచి 162 మంది విడుదలై స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. విడుదలైన వారిని వారి బంధువులు సంతోషంగా తమవెంట తీసుకెళ్లారు. వివిధ కారాగారాల నుంచి 195 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్‌కుమార్ గుప్తా ఆదివారం ఆదేశాలు జారీచేశారు. వీరిలో 175 మంది జీవితఖైదీలు, 20 మంది ఇతర శిక్షలు పడినవారు ఉన్నారు. ఈ 195 మందిలో 13 మంది మహిళలున్నారు. కొన్ని కారణాలవల్ల కొందరు సోమవారం విడుదల కాలేదు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 66 మంది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 66 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో 48 మంది జీవితఖైదు పడినవారు, ఏడుగురు పదేళ్లలోపు శిక్ష పడినవారు ఉన్నారు. ఇక్కడి మహిళా జైలు నుంచి 11 మంది విడుదలకు అర్హులు కాగా.. ఎనిమిది మంది విడుదలయ్యారు. ఒకరు ముందే బెయిల్‌పై విడుదలకాగా, ఇద్దరిని విశాఖపట్నం జైలుకు మార్చడంతో అక్కడ నుంచి విడుదలయ్యారు. వీరందరికీ జీయర్ ట్రస్ట్ వారు దుస్తులు, న్యాయవాది రవితేజ స్వీట్‌బాక్సులు పంచారు. ► విశాఖపట్నం కేంద్ర కారాగారం నుంచి 41 మంది ఖైదీలు విడుదలయ్యారు. వారిలో 34 మంది జీవిత ఖైదీలు, ఏడుగురు ఇతర శిక్షలు పడినవారు ఉన్నారు. ► వైఎస్సార్ జిల్లా కడప కేంద్ర కారాగారం నుంచి 33 మంది విడుదలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. విడుదలైన ఖైదీలను వారి బంధువులు టెంకాయలు, హారతితో దిష్టితీసి తమవెంట తీసుకెళ్లారు. ► అనంతపురం జిల్లాలో 15 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఇక్కడి రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి 14 మంది ఖైదీలను, జిల్లా జైలు నుంచి ఒకరిని ప్రభుత్వం విడుదల చేసింది. ► ఒంగోలు జిల్లా జైలు నుంచి ఏడుగురు జీవితఖైదీలు విడుదలయ్యారు. -
గాంధీ జయంతి నాడు ఖైదీలకు విముక్తి
సాక్షి, వరంగల్: జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాలతో 38 మంది ఖైదీలను వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు శనివారం రాత్రి విడుదల చేశారు. గాంధీ జయంతి సందర్భంగా సత్ప్రవర్తనతో శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక రెమిషన్ జారీ చేసింది. ఈ మేరకు వరంగల్ సెంట్రల్ జైలులో 66 శాతం శిక్ష పూర్తి చేసిన 41 మంది విడుదలకు అర్హులుగా పేర్కొంటూ జాబితా రూపొందించారు. ఈ జాబితాను పరిశీలించిన ఉన్నతాధికారులు 38 మంది విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచిస్తున్న జైలు సూపరింటెండెంట్ మురళీబాబు ఈసందర్భంగా ఫైల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 1వ తేదీన గవర్నర్ ఆమోదానికి పంపించగా శుక్రవారం గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. అయితే, దుబ్బాక ఉప ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం వేచి చూడగా, శనివారం అనుమతి వచ్చింది. అయితే, ప్రభుత్వం జీఓ విడుదల చేసినా జైళ్ల శాఖ నుంచి శనివారం సాయంత్రం 6 గంటలకు ఆదేశాలు రాగానే అధికారులు ఖైదీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి నేరాలకు పాల్పడబోమని, సత్ప్రవర్తనతో సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తామని మహాత్మాగాంధీ చిత్రపటం ముందు వారితో జైలు సూపరింటెండెంట్ మురళీబాబు ప్రమాణం చేయించారు. ఆదుకున్న ‘చాంబర్’ కమలాపురం మండలానికి చెందిన మొగిలిచర్ల బిక్షపతి పేరు విడుదలయ్యే వారి జాబితాలో ఉంది. అయితే, ఆయన కోర్టు విధించిన రూ.17,500 జరిమానా చెల్లించాల్సి ఉండగా, అంత డబ్బు లేకపోవడంతో నిరాశ చెందారు. ఈ విషయాన్ని జైలు అధికారులు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యుల దృష్టికి తీసుకెళ్లగా వారు డబ్బు కట్టడంలో బిక్షపతి కూడా విడుదలయ్యారు. కాగా, ఖైదీలు విడుదల సందర్భంగా పలువురి కుటుంబ సభ్యులు శనివారం ఉదయం నుంచి జైలు వద్ద వేచి ఉన్నారు. తమ కుటుంబీకులు బయటకు రాగానే ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకోవడంతో ఉద్విఘ్న భరిత వాతావరణం నెలకొంది. అయితే, కొందరికి సంబంధించి బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడం గమనార్హం. తల్లి లక్ష్మిని తీసుకెళ్తున్న కుమారుడు 38మంది విడుదలయ్యారు... గాంధీ జయంతి సందర్భంగా జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయం ఉత్తర్వుల మేరకు సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 38 మంది ఖైదీలను విడుదల చేశారు. వీరిలో 14 ఏళ్లకు పైగా శిక్ష పూర్తి చేసిన 27 మంది పురుషులు, ఎనిమిదేళ్లకు పైగా శిక్ష పూర్తిచేసుకున్న 11 మంది మహిళలు ఉన్నారు. వీరందరూ పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు. – ఎన్.మురళీబాబు, జైలు సూపరింటెండెంట్ ఆదుకున్నారు.. కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. ఇప్పుడు విడుదలకు అన్ని అర్హతలు ఉన్నా జరిమానా చెల్లించేందుకు డబ్బు లేక పోవడంతో పెండింగ్‌లో పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా జైలు అధికారులు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు తెలపగా వారు డబ్బు చెల్లించారు. చాంబర్ ప్రతినిధులతో పాటు జైలు అధికారులకు రుణపడి ఉంటాను. – మొగిలిచెర్ల భిక్షపతి, కమలాపురం -
ఆగస్టు 15కు ఖైదీల విడుదల లేనట్లే!
సాక్షి, హైదరాబాద్ : ఆగస్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ నెలాఖరుకు గానీ, వచ్చే నెల మొదటివారంలోగానీ జాబితా సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. వాస్తవానికి ఇటీవల ప్రభుత్వం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయించింది. ఆమేరకు జాబితా రూపొందించాలని జైలు అధికారులను ఆదేశించింది. అయితే ఈ జాబితా ఇంకా సిద్ధం కాలేదని సమాచారం. ఇందులో న్యాయపరంగా అనేక చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే, ఈ జాబితా రూపకల్పనలో అధికారులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి జాబితా రూపొందిస్తున్నారు. జాబితాలో తీవ్ర, హీనమైన నేరాలు, రిపీటెడ్ అఫెండర్స్‌ను అసలు పరిగణనలోకి తీసుకోవడంలేదు. అలాగే చిన్నారులపై లైంగిక వేధింపులు, ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడ్డవారిని కూడా దూరంపెట్టారు. వందశాతం పూర్తి అర్హత కలిగిన ఖైదీలనే ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. -
పంద్రాగస్టుకు ఖైదీల విడుదల
సాక్షి, హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని హోంశాఖను ఆయన కోరారు. సీఎం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖైదీల విడుదలపై చర్చ జరిగింది. ఆగష్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కారాగారాల్లో అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ కసరత్తు గురువారానికి కొలిక్కి వచ్చే అవకాశముందని ఓ ఉన్నతాధికారి సాక్షికి వివరించారు. కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ జైళ్లశాఖ దాదాపు 100 మందికి పైగా ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
399 మంది ఖైదీలకు సీఎం కేసీఆర్ క్షమాభిక్ష!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 399 మంది ఖైదీలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు క్షమాభిక్ష ప్రసాదించనున్నారు. ఖైదీల క్షమాభిక్ష పైలుపై ఈరోజు సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఆగస్టు 15న వారిని విడుదల చేస్తారు. ఈక్రమంలో ఖైదీల విడుదలకు అవసరమైన విధివిధానాలను పది రోజుల్లో పూర్తి చేయాలని హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్విని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016 లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవిత, జీవితేతర, తక్కువ శిక్షాకాలం ఖైదీలను విడుదల చేసింది. అదే తరాహాలో 2020 ఆగస్టు 15 న ప్రసాదించే ఖైదీల క్షమాభిక్ష జీవో ఉంటుందని తెలిసింది. ఖైదీలు, వారి కుటుంబాలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల పోరాటాల ఫలితం మూలంగానే తెలంగాణ ప్రభుత్వం స్పందించినట్టు సమాచారం. (జ్వరం వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు : ఈటల) -
ఏపీలో 259 మంది ఖైదీల విడుదల
సాక్షి, అమరావతి: కారాగారాలపై కరోనా ఎఫెక్ట్ పడకుండా ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ జాగ్రత్తలు పాటించింది. దీనిలో భాగంగా ఇప్పటికే 259 మందిని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయగా మిగిలిన వారు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. విడుదల అయిన వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్, సొంత ఇంటి (హౌస్ ఐసోలేషన్)లో ఉండాలి. నెల రోజుల తర్వాత తిరిగి వారి వారి జైళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) మహ్మద్ హసన్ రేజా అన్ని జైళ్ల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. (చదవండి: ఆ వార్డులన్నీ రెడ్ జోన్లు) ఇవీ తీసుకున్న జాగ్రత్తలు... ► కరోనాను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఖైదీల రద్దీగా ఉండే జైళ్లలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ► ప్రస్తుతం రాష్ట్రంలోని 81 జైళ్లలో 6,930 మంది ఖైదీలున్నారు. వీరికి కరోనా వైరస్ సోకకుండా జైలు అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు. ► జైలు బ్యారక్‌లలో తక్కువ మందిని ఉంచడం, భోజనం సమయంలో పది మంది చొప్పున అనుమతిస్తున్నారు. బ్యారక్ లోపల, జైలు ఆవరణలోను ఖైదీలు భౌతిక దూరం పాటించేలా చూస్తున్నారు. ► రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఖైదీలకు అవసరమైన మాస్కులను జైళ్లలోనే తయారు చేస్తున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, నెల్లూరు, కడప సెంట్రల్ జైళ్లతోపాటు విజయవాడ, ఒంగోలు డిస్ట్రిక్ట్ జైళ్లలోను మాస్కుల తయారీ చేస్తున్నారు. జైళ్లలో ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్రంలోని జైళ్లలో కరోనా కారణంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సిఫారసులతో ఏడేళ్లలోపు జైలు శిక్ష పడిన వారిని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేశాం. మిగిలిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. లాక్డౌన్ అమలులోకి రావడానికి ముందే జైళ్ల శాఖలో ములాఖత్ (ఇంటర్వ్యూ)లు రద్దు చేశాం. – జైళ్ల శాఖ ఐజీ జి.జయవర్ధన్ -
కోవిడ్-19: ఖైదీలకు శుభవార్త!
భోపాల్: భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో జైళ్లలో రద్దీని నివారించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 8వేల మంది ఖైదీలను విడుదల చేసేందుకు అవసరమైన ప్రక్రియను సోమవారం ప్రారంభించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 8,000 మంది ఖైదీలలో 5,000 మందిని 60 రోజుల పాటు పెరోల్‌పై విడుదల చేయనుండగా, గరిష్ట శిక్ష కాలం ఐదేళ్ల లోపు ఉన్న 3 వేలమంది ఖైదీలను 45 రోజుల పాటు మధ్యంతర బెయిల్‌పై విడుదల చేస్తామని ఆ రాష్ట్ర జైళ్ల డైరెక్టర్ జనరల్ సంజయ్ చౌదరి జాతీయ మీడియాతో పేర్కొన్నారు. జైళ్లలో ఎక్కువమంది ఉన్నందున కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. గరిష్టంగా ఏడు సంవత్సరాల శిక్ష విధించిన కేసులలో ఖైదీలను పెరోల్ లేదా మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయడాన్ని పరిశీలించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. రాష్ట్రంలో 125 జైళ్లలో 28,601 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం మాత్రమే ఉన్నా ప్రస్తుతం 42 వేల మంది ఖైదీలు ఉన్నారు. ఇక కరోనా వైరస్ కారణంగా 47 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, నలుగురు మరణించారు. (కరోనా: కేజ్రివాల్ ప్రభుత్వం కీలక చర్యలు) -
కరోనా.. జైలు పక్షులకు స్వేచ్ఛ
సాక్షి ప్రతినిధి, చెన్నై : కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతుండగా తమిళనాడు జైళ్లలోని ఖైదీలు మాత్రం ఆనంద తాండవం చేస్తున్నారు. వరంలా కొందరు ఖైదీలు బెయిల్‌పై విడుదలకు నోచుకోవడమే ఇందుకు కారణం. చైనాలో పుట్టి భారత్‌లోకి చొచ్చుకొచ్చిన కరోనా వైరస్ మరింత ప్రబలకుండా అనేక జాగ్రత్త చర్యలు అమల్లో ఉన్నాయి. జనం గుమికూడితే వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాపిస్తుందనే కోణంలో మంగళవారం సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చిన 144 సెక్షన్ ఈనెల 31వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జైళ్లలో కూడా ఖైదీలు పెద్దసంఖ్యలో ఒకేచోట ఉండడం కరోనావైరస్ వ్యాప్తికి దారితీస్తుందని ఆందోళన చెందిన సుప్రీంకోర్టు... జైళ్లలోని విచారణ ఖైదీలను జామీనుపై విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని నిబంధనలతో కూడిన బెయిల్‌పై తమిళనాడులోని అన్ని జైళ్ల నుంచి విచారణ ఖైదీలు విడుదలవుతున్నారు. చెన్నై సెంట్రల్ పుళల్ జైల్లో ఆడ, మగ కలుపుకుని 3 వేల మందికి పైగా ఖైదీలున్నారు. ఈ జైలులోని ఖైదీలను విడుదల చేయాలని తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు న్యాయస్థానాల నుంచి జైలు అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ ఆదేశాలను అనుసరించి పుళల్ జైలు నుంచి 36 మంది మహిళా ఖైదీలు సహా మొత్తం 262 జామీనుపై విడుదల కానున్నారు. అలాగే కోయంబత్తూరు సెంట్రల్ జైలులో 700 మంది శిక్షాఖైదీలు, 600 మంది విచారణ ఖైదీలున్నారు. వీరిలో చిన్నపాటి నేరాలు చేసిన 131 మంది పురుషఖైదీలు, అయిదుగురు మహిళా ఖైదీలకు జామీనుపై విముక్తి లభించింది. సేలం సెంట్రల్ జైల్లో 800 మందికి పైగా ఖైదీలుండగా, వీరిలో దొంగసారాయి, లాటరీ టిక్కెట్ల అమ్మకం, దొంగతనాల నేరాలకు పాల్పడిన వారు 170 మంది ఉన్నారు. వీరిలో 75 మంది ఖైదీలను ఎంపికచేసి జాబితాను సేలం జిల్లా కోర్టుకు అప్పగించగా, వారిని విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. మదురై సెంట్రల్ జైల్లో సుమారు 1,500 మంది ఖైదీలుండగా, వీరిలో చిన్నపాటి నేరాలు చేసిన వారు 200 మందికి పైగా ఉన్నారు. తొలిదశలో 200 మందిని మంగళవారం విడుదల చేశారు. వేలూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో వేలూరు, తిరుపత్తూరు, రాణీపేట్టై, తిరువన్నామలై జిల్లాల్లోని జైళ్లు కూడా ఉన్నాయి. ఈ జైళ్లకు సంబంధించి 126 మందిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక, తిరువారూరు జిల్లా మన్నార్‌కుడిలోని జైల్లో 22 మంది విచారణ ఖైదీలుండగా వీరిలో 14 మందిని సోమవారం సాయంత్రం జామీనుపై విడిచిపెట్టారు. మిగతా 8 మంది ఖైదీలను మంగళవారం రాత్రి విడిచిపెట్టే అవకాశం ఉంది. అలాగే, తిరువారూరు మహిళా జైల్లోని 22 మందిలో 11 మందిని, పురుషుల జైల్లోని 18 మందిలో 11 మందిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. తిరుచ్చిరాపల్లి జైలు నుంచి ఆరుగురిని సొంతజామీనుపై విడుదల చేశారు. కాగా, పాలయంగోట్టై సెంట్రల్ జైలు నుంచి 62, తెన్‌కాశీ జైలు నుంచి 52, తూత్తుకూడి జైలు నుంచి 60, నాగర్‌కోవిల్ జైలు నుంచి 52 మంది విడుదలయ్యారు. వివిధ జైళ్లలో ఉన్న సాధారణ ఖైదీలను సైతం విడుదల చేసే చర్యలను చేపడుతున్నారు. చదవండి : తమిళనాడులో తొలి కరోనా మరణం -
ఖైదీల విడుదల్లో టీడీపీ రాజకీయం!
సాక్షి, అమరావతి: సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల విషయంలోనూ అధికార పార్టీ టీడీపీ రాజకీయం చేస్తోంది. టీడీపీ నేతలు సిఫార్లు చేసిన ఖైదీలకే విడుదల విషయంలో ప్రాధాన్యత కల్పిస్తోంది. తాజాగా 33 మంది ఖైదీల విడుదలకు శనివారం ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. విడుదలకు 168 మంది ఖైదీలు అర్హత సాధిచినప్పటికీ.. కేవలం టీడీపీ నేతలు కోరుకున్న 33 మందిని మాత్రమే విడుదల చేస్తోంది. 128 మంది విడుదలను తిరస్కరించింది. తాజా కేబినేట్ నిర్ణయంతో మంత్రి ఆదినారయణ రెడ్డి సిఫారసు చేసిన ఆరుగురు ఖైదీలు అనంతపురం జైలు నుంచి విడుదలకానున్నారు. ఈ నిర్ణయంపై 128 మంది ఖైదీల కుటంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం 149 మంది అర్హత సాధించగా.. 49 మందిని మాత్రమే విడుదల చేసింది. కోర్టుకు వెళ్లి విడుదలకు అర్హత సాధించిన వాళ్లని కూడా ఈ సారి పట్టించుకోకపోవడం గమనార్హం. -
ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపలేదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్షననుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్రం పరిశీలనకు పంపినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఖండించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన ఈనెల 9వ తేదీన సమావేశమైన మంత్రివర్గం.. ఏడుగురు రాజీవ్ హంతకుల విడుదలకు సిఫారసు చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మాన ప్రతిని గవర్నర్‌కు కూడా పంపింది. అయితే, గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అనేక ఊహాగానాలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు ఈనెల 14న మాత్రమే తమకు అందాయని, నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గవర్నర్ కార్యాలయం పేర్కొంది. -
ఖైదీల విడుదలకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఏళ్లకొద్దీ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. అలాగే మార్గదర్శకాలు కూడా రూపొందించింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది. ఖైదీల విడుదలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేసి మార్గదర్శకాలు రూపొందించాలన్న కేంద్రం సూచన మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యుడిగా న్యాయ శాఖ కార్యదర్శి, మెంబర్ సెక్రటరీగా జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌ను నియమించింది. ఈ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మొదటి దఫా, వచ్చే ఏడాది ఏప్రిల్ 6 దండి మార్చ్ సందర్భంగా రెండో దఫా.. 2019 ఆక్టోబర్ 2న మూడో దఫాగా ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక రిమిషన్‌పై ఖైదీల విడుదల ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. శిక్షాకాలంలో పొందిన సాధారణ రిమిషన్‌తో సంబంధం లేకుండా ప్రత్యేక రిమిషన్ ద్వారానే విడుదలు ఉంటుందని పేర్కొంది. మార్గదర్శకాలు ఇవే.. - మహిళల కోటాలో 55 ఏళ్లు, ఆపై వయసు ఉండి 50 శాతం శిక్ష అనుభవించిన వారి విడుదలను కమిటీ పరిశీలిస్తుంది. - ట్రాన్స్‌జెండర్ కోటాలో 55 ఏళ్ల పైబడిన వారు, 50 శాతం శిక్షను అనుభవించిన వారై ఉండాలి. - పురుష ఖైదీల కోటాలో 60 ఏళ్లు, ఆపై ఉన్న వారు 50 శాతం అసలు శిక్ష అనుభవించి ఉండాలి. - 70 శాతం అంగవైకల్యం ఉన్న ఖైదీలు 50 శాతం శిక్ష పూర్తి చేసుకొని ఉండాలి. - తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారినీ పరిగణనలోకి తీసుకోనున్నారు. - శిక్షాకాలంలో 66 శాతం పూర్తి చేసుకున్న వారి విడుదలనూ కమిటీ పరిశీలిస్తుంది. - దేశ భద్రత, ఉగ్రవాదం, పోటా యాక్ట్, టాడా యాక్ట్, యూఏపీఏ, రహస్య సంబంధిత కేసులు, హైజాకింగ్, ఆయుధాల సరఫరా, డ్రగ్స్ కేసులు, ఆర్థిక నేరాల్లో శిక్ష పొందిన వారు విడుదలకు అనర్హులుగా మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. -
వివాదాస్పదంగా మారిన ఖైదీల విడుదల
-
వివాదాస్పదంగా మారిన ఖైదీల విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 49మంది ఖైదీలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. అయితే ఖైదీల విడుదల వివాదాస్పదంగా మారింది. రిపబ్లిక్ డే సందర్భంగా జైళ్ల శాఖ అధికారులు పంపిన 149మంది జాబితాలో 100మందిని ప్రభుత్వం తిరస్కరించడమే కాకుండా ఖైదీల విడుదలను టీడీపీ నేతల సిఫార్సులను పాటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విడుదల కానున్నవారిలో వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ రాగిపిండి సుధాకర్ రెడ్డి కూడా ఉన్నారు. గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం రాజారెడ్డి హత్యకేసులో మరో 12మందిని విడుదల చేసిన విషయం విదితమే. కాగా 1998లో వైఎస్ రాజారెడ్డిని ప్రత్యర్థులు బాంబులు వేసి వేటకొడవళ్లతో దారుణంగా హతమార్చారు. -
ఏపీ కేబినెట్ వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న సుధాకర్ రెడ్డిని సత్ప్రవర్తన పేరుతో విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్సార్ జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నేతను కలిసినట్లు సమాచారం. సత్ప్రవర్తన కింద విడుదల కోసం జైళ్లశాఖ 149మంది జాబితా ఎంపిక చేసింది. వారిలో 100 మందిని తిరస్కరించిన కేబినెట్, 49 మంది విడుదలకు ఆమోదం తెలిపింది. ఇందులో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న సుధాకర్ రెడ్డి పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి నెల్లూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. నెల్లూరు జైలు నుంచి ముగ్గురు విడుదలయ్యే అవకాశం ఉంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాల్సిన ప్రభుత్వం.. రాజకీయ కోణంలో ఖైదీల విడుదలకు సిద్ధపడిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేబినెట్ నిర్ణయం చూసి జైళ్ల శాఖ అధికారులు విస్తుపోతున్నారు. -
546 మంది భారత ఖైదీలకు విముక్తి!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ జైళ్లల్లో మగ్గుతున్న 546 మంది భారతీయులకు త్వరలో విముక్తి లభించనుంది. పాక్ లో ఎన్నో ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న వీరిని భారత్‌కు పంపివేసినట్లు పాక్ ప్రభుత్వం శనివారం ఓ జాబితా విడుదల చేసింది. 2008 మే21న చేసుకున్న ఒప్పందం ప్రకారం తమ దేశంలో శిక్ష అనుభవిస్తున్న భారతీయులను విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం హైకమిషనర్ గౌతమ్ బాంబవాలేకు ఖైదీల జాబితా అందజేసింది. విడుదలకానున్న 546 మంది భారతీయులలో 52 మంది సామాన్య ప్రజానికం ఉండగా, 494 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. ప్రతి ఏడాది జనవరి 1న, జులై 1న ఇలా రెండు పర్యాయాలు పరస్పరం ఖైదీలను వారి దేశాలకు పంపివేసేందుకు గాను వారి జాబితా విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. భారత్ విడుదల చేయనున్న తమ దేశ ఖైదీల జాబితా కోసం ఎదురుచూస్తున్నట్లు ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ చెప్పారు. -
అర్హులైన ఖైదీల విడుదలకు కసరత్తు
హైదరాబాద్ : తెలంగాణలో జైళ్ల సంస్కరణలకు పెద్దపీట వేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆయన సోమవారం చర్లపల్లి జైలును సందర్శించారు. జైళ్ల అభివృద్ధి కోసం దేశంలోని జైళ్లకు ప్రత్యేక టీమ్‌లను పంపిస్తామన్నారు. క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల విడుదలకు కసరత్తు చేస్తున్నామని, ఖైదీల క్షమాభిక్షపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని నాయిని తెలిపారు. త్వరలో ఖైదీలను విడుదల చేయటం సాధ్యం కాకపోవచ్చన్నారు. మార్గదర్శకాలను రూపొందించి అర్హులైన ఖైదీలను విడుదల చేస్తామన్నారు. ఈ సందర్భంగా జైలులోని బియ్యం, దుప్పట్లను ఆయన పరిశీలించారు. ఖైదీల భోజనంలో నాణ్యత పెంచుతామని ఆయన తెలిపారు. ఇక జైళ్లలో సెల్ఫోన్లు, గంజాయి వినియోగించే ఖైదీలు.... వారికి సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని నాయిని స్పష్టం చేశారు. జైళ్లలో వైద్యుల కొరతను తీరుస్తామని హామీ ఇచ్చారు.