సాక్షి ప్రతినిధి, చెన్నై : కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతుండగా తమిళనాడు జైళ్లలోని ఖైదీలు మాత్రం ఆనంద తాండవం చేస్తున్నారు. వరంలా కొందరు ఖైదీలు బెయిల్‌పై విడుదలకు నోచుకోవడమే ఇందుకు కారణం. చైనాలో పుట్టి భారత్‌లోకి చొచ్చుకొచ్చిన కరోనా వైరస్ మరింత ప్రబలకుండా అనేక జాగ్రత్త చర్యలు అమల్లో ఉన్నాయి. జనం గుమికూడితే వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాపిస్తుందనే కోణంలో మంగళవారం సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చిన 144 సెక్షన్ ఈనెల 31వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జైళ్లలో కూడా ఖైదీలు పెద్దసంఖ్యలో ఒకేచోట ఉండడం కరోనావైరస్ వ్యాప్తికి దారితీస్తుందని ఆందోళన చెందిన సుప్రీంకోర్టు... జైళ్లలోని విచారణ ఖైదీలను జామీనుపై విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని నిబంధనలతో కూడిన బెయిల్‌పై తమిళనాడులోని అన్ని జైళ్ల నుంచి విచారణ ఖైదీలు విడుదలవుతున్నారు.
చెన్నై సెంట్రల్ పుళల్ జైల్లో ఆడ, మగ కలుపుకుని 3 వేల మందికి పైగా ఖైదీలున్నారు. ఈ జైలులోని ఖైదీలను విడుదల చేయాలని తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు న్యాయస్థానాల నుంచి జైలు అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ ఆదేశాలను అనుసరించి పుళల్ జైలు నుంచి 36 మంది మహిళా ఖైదీలు సహా మొత్తం 262 జామీనుపై విడుదల కానున్నారు. అలాగే కోయంబత్తూరు సెంట్రల్ జైలులో 700 మంది శిక్షాఖైదీలు, 600 మంది విచారణ ఖైదీలున్నారు. వీరిలో చిన్నపాటి నేరాలు చేసిన 131 మంది పురుషఖైదీలు, అయిదుగురు మహిళా ఖైదీలకు జామీనుపై విముక్తి లభించింది. సేలం సెంట్రల్ జైల్లో 800 మందికి పైగా ఖైదీలుండగా, వీరిలో దొంగసారాయి, లాటరీ టిక్కెట్ల అమ్మకం, దొంగతనాల నేరాలకు పాల్పడిన వారు 170 మంది ఉన్నారు. వీరిలో 75 మంది ఖైదీలను ఎంపికచేసి జాబితాను సేలం జిల్లా కోర్టుకు అప్పగించగా, వారిని విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది.
మదురై సెంట్రల్ జైల్లో సుమారు 1,500 మంది ఖైదీలుండగా, వీరిలో చిన్నపాటి నేరాలు చేసిన వారు 200 మందికి పైగా ఉన్నారు. తొలిదశలో 200 మందిని మంగళవారం విడుదల చేశారు. వేలూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో వేలూరు, తిరుపత్తూరు, రాణీపేట్టై, తిరువన్నామలై జిల్లాల్లోని జైళ్లు కూడా ఉన్నాయి. ఈ జైళ్లకు సంబంధించి 126 మందిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక, తిరువారూరు జిల్లా మన్నార్‌కుడిలోని జైల్లో 22 మంది విచారణ ఖైదీలుండగా వీరిలో 14 మందిని సోమవారం సాయంత్రం జామీనుపై విడిచిపెట్టారు. మిగతా 8 మంది ఖైదీలను మంగళవారం రాత్రి విడిచిపెట్టే అవకాశం ఉంది. అలాగే, తిరువారూరు మహిళా జైల్లోని 22 మందిలో 11 మందిని, పురుషుల జైల్లోని 18 మందిలో 11 మందిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. తిరుచ్చిరాపల్లి జైలు నుంచి ఆరుగురిని సొంతజామీనుపై విడుదల చేశారు. కాగా, పాలయంగోట్టై సెంట్రల్ జైలు నుంచి 62, తెన్‌కాశీ జైలు నుంచి 52, తూత్తుకూడి జైలు నుంచి 60, నాగర్‌కోవిల్ జైలు నుంచి 52 మంది విడుదలయ్యారు. వివిధ జైళ్లలో ఉన్న సాధారణ ఖైదీలను సైతం విడుదల చేసే చర్యలను చేపడుతున్నారు.
చదవండి : తమిళనాడులో తొలి కరోనా మరణం
Comments
Please login to add a commentAdd a comment