సాక్షి, హైదరాబాద్: ఏళ్లకొద్దీ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. అలాగే మార్గదర్శకాలు కూడా రూపొందించింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది. ఖైదీల విడుదలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేసి మార్గదర్శకాలు రూపొందించాలన్న కేంద్రం సూచన మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యుడిగా న్యాయ శాఖ కార్యదర్శి, మెంబర్ సెక్రటరీగా జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌ను నియమించింది.
ఈ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మొదటి దఫా, వచ్చే ఏడాది ఏప్రిల్ 6 దండి మార్చ్ సందర్భంగా రెండో దఫా.. 2019 ఆక్టోబర్ 2న మూడో దఫాగా ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక రిమిషన్‌పై ఖైదీల విడుదల ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. శిక్షాకాలంలో పొందిన సాధారణ రిమిషన్‌తో సంబంధం లేకుండా ప్రత్యేక రిమిషన్ ద్వారానే విడుదలు ఉంటుందని పేర్కొంది.
మార్గదర్శకాలు ఇవే..
- మహిళల కోటాలో 55 ఏళ్లు, ఆపై వయసు ఉండి 50 శాతం శిక్ష అనుభవించిన వారి విడుదలను కమిటీ పరిశీలిస్తుంది.
- ట్రాన్స్‌జెండర్ కోటాలో 55 ఏళ్ల పైబడిన వారు, 50 శాతం శిక్షను అనుభవించిన వారై ఉండాలి.
- పురుష ఖైదీల కోటాలో 60 ఏళ్లు, ఆపై ఉన్న వారు 50 శాతం అసలు శిక్ష అనుభవించి ఉండాలి.
- 70 శాతం అంగవైకల్యం ఉన్న ఖైదీలు 50 శాతం శిక్ష పూర్తి చేసుకొని ఉండాలి.
- తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారినీ పరిగణనలోకి తీసుకోనున్నారు.
- శిక్షాకాలంలో 66 శాతం పూర్తి చేసుకున్న వారి విడుదలనూ కమిటీ పరిశీలిస్తుంది.
- దేశ భద్రత, ఉగ్రవాదం, పోటా యాక్ట్, టాడా యాక్ట్, యూఏపీఏ, రహస్య సంబంధిత కేసులు, హైజాకింగ్, ఆయుధాల సరఫరా, డ్రగ్స్ కేసులు, ఆర్థిక నేరాల్లో శిక్ష పొందిన వారు విడుదలకు అనర్హులుగా మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment