తప్పుడు డాక్యుమెంట్లతో రూ.4 కోట్ల స్థలం రిజిస్ట్రేషన్
పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థల యజమాని
దందాలో భాగస్వాములుగా టీడీపీ నేతలు
20 రోజులుగా అజ్ఞాతంలో నిందితులు
ముందస్తు బెయిల్ వచ్చిందనుకుని బయటకు వచ్చిన కొందరు
ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పోలాకి, మరొకరి అరెస్టు
సాక్షి, రాజమహేంద్రవరం : చారిత్రక నగరం రాజమహేంద్రవరంలోనూ ఆస్తులను కుతంత్రంతో కబ్జా చేసే నయీం తరహా ముఠా ఒకటి వెలుగులోకి వచ్చింది. యజమానికి తెలియకుండా తప్పుడు డాక్యుమెంట్లలో రాజమహేంద్రవరం రంభ, ఊర్వశి, మేనక థియేటర్ కాంప్లెక్స్‌కు సమీపంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఇంటి పక్కన రూ.4 కోట్ల విలువైన స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన స్థల యజమాని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇద్దరిని అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ దందాలోటీడీపీ నేతలు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పోలాకి పరమేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నేతలు, నగరంలో వ్యాపార సంఘాల నేతలు భాగస్వాములుగా ఉన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వీరందరిపై సెక్షన్ 420, 120–బి, రెడ్‌విత్ 34 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులో ఉంటున్న బండారు వెంకటరమణ కుటుంబానికి సూరాబత్తుల వీధి ( కూరగాయల మార్కెట్ నుంచి టౌన్‌హాల్‌కు వెళ్లేదారి)లో 356 గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో 1995 వరకు ఇల్లు ఉంది. పూర్వం ఆ ఇల్లు బ్రహ్మముడి సుబ్బయ్య, ఆయన సతీమణి లక్ష్మమ్మల స్వార్జిత ఆస్తి. వీరి పేరుపై 1904 ఏప్రిల్ 8న రిజిస్టరైన డాక్యుమెంట్ ఉంది. వీరి నలుగురు కుమారులు వరదరాజులనాయుడు, సత్యనారాయణ, కృష్ణమూర్తి, వీరాస్వామిలకు ఈ ఆస్తిపై 1/4 వంతున హక్కు ఉన్నట్టు సంయుక్త డాక్యుమెంట్ ఉంది. కాగా, వెంకటరమణ తల్లిదండ్రులు బండారు సుబ్బారావు, సత్యవతి 1977కు పూర్వం వారికి వివాహం జరిగినప్పటి నుంచి ఆ ఇంటిలో నివాసం ఉంటూ అద్దెను నలుగురు హక్కుదారులకు చెల్లించేవారు.
మూడు వాటాలు కొనుగోలు చేసిన సత్యవతి హక్కుదారుల్లో సత్యనారాయణ సతీమణి సీతాబాయి, వీరాస్వామి కుమారులు సుబ్బయ్య, బాలాజీరావులు, మూడో హక్కుదారుడు కృష్ణమూర్తి తమకున్న 1/4 వాటాలను కలపి 3/4 వాటా ఆస్తిని 1978 జూ¯ŒS 22న రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బండారు వెంకటరమణ తల్లి సరస్వతి పేరుమీద రిజిస్టర్ చేశారు. మిగతా 1/4 వాటాకు హక్కుదారైన వరదరాజులనాయుడు సతీమణి తాయారమ్మ, కుమారులు పార్థసారథి, రామచంద్రన్, ఆదికేశవులనాయుడు, పద్మనాభంలు 1980 ఆగస్ట్ 23న తమ వాటాను కూడా సత్యవతికి విక్రయిస్తామని చెప్పి రూ.1000 అడ్వాన్‌స తీసుకుని ఒప్పందపత్రం రాయించుకున్నారు. అయితే తదుపరి ఆ పక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచీ ఈ ఇంటికి సంబంధించిన మొత్తం ఆస్తిపన్నును సత్యవతి పేరుమీద నగరపాలక సంస్థకు వెంకటరమణ చెల్లిస్తున్నారు. ఈ ఏడాది మార్చి వరకు కూడా పన్నులు చెల్లించారు. పలుమార్లు రిజిస్ట్రేషన్ విషయమై వరదరాజులనాయుడు కుమారులను సంప్రదించారు. అయినా ఫలితం లేకపోవడంతో లాయర్ ద్వారా నోటీసులు కూడా పంపారు. 1995లో భవనం శిథిలమైపోవడంతో ఆ ఇంటిని ఖాళీ చేశారు. 2014లో నగరపాలక సంస్థ ఆదేశాల మేరకు దానిని కూల్చివేయించారు.
పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ...
ప్రస్తుతం ఆ ప్రాంతంలో గజం విలువ రూ.లక్షకు పైగా పలుకుతోంది. 356 గజాల విలువ దాదాపు రూ.4 కోట్లు ఉంటుంది. దీంతో 1/4 వాటా హక్కుదారుడైన వరదరాజులనాయుడు కుమారుల్లో ఆదికేశవులనాయుడు, పద్మనాభంల తరఫున పద్మనాభం వియ్యంకుడు పుచ్చకాయల త్రిమూర్తులుతో కలసి పద్మనాభం 2015లో రంగంలోకి రు. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరువర్గాలు రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్‌సీపీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు వద్దకు చేరారు. అందరు కలసి రౌతు నివాసంలో సమావేశమైయ్యారు. 1980లో చేసిన అగ్రిమెంట్ ధర కాకుండా, ప్రస్తుత మార్కెట్ ధర కాకుండా మధ్యస్తంగా రౌతు, ఆకుల నిర్ణయించిన రేటుకు 1/4 వాటాను విక్రయించేందుకు నిర్ణయించగా ఇరు వర్గాలు సమ్మతించాయి. పదిరోజుల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి పద్మనాభం, ఆయన వియ్యంకుడు వెళ్లిపోయారు.
కుట్ర ఇలా చేశారు..
పెద్దమనుషులు చెప్పిన రేటుకు ఒప్పుకుని వెళ్లిపోయిన పద్మనాభం, ఆయన వియ్యంకుడు పుచ్చకాయల త్రిమూర్తులు అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ చేయలేదు. తమ వాటాను ఇతరులకు విక్రయించేందుకు వారు రాజమహేంద్రవరానికి చెందిన లంకా వెంకట అప్పారావు, కె.బ్రహ్మాజీరావు, ధవళ్వేరానికి చెందిన కాంగ్రెస్ నేత దంగుడుబియ్యం నారాయణ, రావులపాలేనికి చెందిన సత్తార్ కలసి మొత్తం ఆస్తిని కాజేసేందుకు తప్పుడు డాక్యుమెంట్ల సృష్టించారు. 2016 అక్టోబర్ 6న వెంకటరమణ తల్లి సత్యవతి పేరుపై ఉన్న మూడు భాగాల ఆస్తితో కలిపి మొత్తం నాలుగువాటాల ఆస్తిని ఆకుల సాయిబాబా, షేక్ మీరాసాహెబ్, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పోలాకి పరమేశ్వరరావు, తలశెట్ల నాగరాజు, మట్టా నరసింహరాజు, మద్దు శ్రీనివాస్, లంకా వెంకట అప్పారావు, దంగుడుబియ్యం నారాయణ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఇందుకు పద్మనాభం కోడలు పుచ్చకాయల త్రిమూర్తులు కుమార్తె బ్రహ్మముడి ప్రభావతి, కె.బ్రహ్మాజీరావు సాక్షి సంతకాలు చేశారు. ఆస్తిలో 1/4 వాటా మాత్రమే పద్మనాభంకు చెందిందని, మిగతా మూడూ వెంకటరమణకు చెందినదని డాక్యుమెంట్లు సృష్టించిన వారికి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికీ తెలుసు. అయినా కుట్రపూరితంగా ఆస్తిని కాజేసేందుకు వ్యూహం పన్నారు.
అజ్ఞాతంలో నిందితులు..
జరిగిన వ్యవహారాన్ని తెలుసుకున్న బండారు వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయడంతో రిజిస్ట్రేష¯ŒS చేసేందుకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన వారు, ఆ ఆస్తి గురించి తెలిసీ కుట్రపూరితంగా రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్న వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. బెయిల్ వచ్చిందనుకుని ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆర్యాపురం బ్యాంకు వెళ్లిన ఆ బ్యాంకు డైరెక్టర్ పోలాకి పరమేశ్వరరావుని, మెయి¯ŒSరోడ్డులో దుకాణంలో ఉన్న ఆకుల సాయిబాబాను ఎస్సై సీహెచ్ రాజశేఖర్ అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మిగతా నిందితులు మాత్రం ఇంకా బయటకు రాలేదు.