నయీమ్ డెన్‌లో మూడు బస్తాల ఫొటోలు
- అందులో రాజకీయ నేతలు, ఐపీఎస్‌లు, కానిస్టేబుళ్లు
- నయీమ్ కుటుంబీకులు, సన్నిహితులను మళ్లీ కస్టడీలోకి తీసుకున్న సిట్
- గ్యాంగ్‌స్టర్ అరాచకాలపై మరో రెండు ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసుల విచారణను సిట్ మరింత వేగవంతం చేసింది. నయీమ్‌తో అంటకాగిన వారికి ఉచ్చు బిగించేందుకు విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగా పకడ్బందీగా ఆధారాలను సేకరిస్తోంది. ఇప్పటివరకు గ్యాంగ్‌స్టర్ డెన్‌లలో దాదాపు మూడు బస్తాల ఫొటోలు లభించాయి. ఇందులో రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్న నాయకుల నుంచి ఐపీఎస్ అధికారులు, కానిస్టేబుళ్ల వరకు ఫొటోలు లభ్యమయ్యాయి.
దీంతో వీటిపై సిట్ కసరత్తు ముమ్మరం చేసింది. నయీమ్‌తో లింకులు, ఫొటోల విషయంలో స్పష్టత కోసం అతని కుటుంబీకులు, సన్నిహిత వ్యక్తులను విచారించేందుకు వారిని కస్టడీలోకి తీసుకుంది. నయీమ్ భార్య హసీనా, సోదరి సలీమా, మేనల్లుడు ఫయాజ్, వంటమనిషి ఫర్హానా, కీలక సన్నిహితుడు టెక్ మధు తదితరులను కస్టడీలోకి తీసుకుంది. ఇప్పటివరకు లభించిన ఆధారాలను వారి ముందుంచి మరోసారి విచారించనుంది.
అరడజను మంది పోలీసు ఉన్నతాధికారులు!
నయీమ్ చాలా తెలివిగా తన వద్దకు వచ్చిన ప్రతీ ముఖ్యమైన వ్యక్తిని వారికి తెలియకుండానే ఫొటోలు తీయించాడు. ఇలా అరడజను వరకు పోలీసు ఉన్నతాధికారులు, పదుల సంఖ్యలో డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు ఉండ టం గమనార్హం. ఆ ఫొటోలన్నీ ఎలాంటి స్టిల్స్ లేకుండా చాలా క్యాజువల్‌గా ఉన్నాయి. నయీమ్‌తో మాటామంతీ జరుపుతున్నప్పుడు వారికి తెలియకుండానే అతని మనుషులు ఫొటోలు తీయడం, వాటిని భద్రంగా దాచిపెట్టడం చూసి విచారణాధికారులే ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు సీసీ కెమెరాల ద్వారా రికార్డయిన వీడియోలను సైతం భద్రపరిచారు.
విచిత్రమేమిటంటే కొన్ని సందర్భాల్లో.. నయీమ్ కొందరు పోలీసు అధికారుల ఇళ్లకు వెళ్లి చర్చలు జరిపాడు. ఆ సందర్భంలో కూడా ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని కూడా నయీమ్ చాలా జాగ్రత్తగా దాచి ఉంచాడు. కేసుల దర్యాప్తులో భాగంగా అతని డెన్‌లలో సోదాలు నిర్వహించిన పోలీసులకు ఇవన్నీ దొరికాయి. వీటిని పరిశీలించిన ఉన్నతాధికారులు అవి వాస్తవమైనవా..? లేక ఏమైనా మార్ఫింగ్ చేశారా? అనేది తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అక్కడ్నుంచి వచ్చే నివేదిక ఆధారంగా కేసు కీలక మలుపు తిరగనుంది.
మా భూములు లాక్కొన్నారు..
నరహంతక ముఠా నయీమ్ గ్యాంగ్‌పై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వందకు పైగా కేసులు నమోదు చేసి, 90 మందికిపైగా నిందితులను అరెస్టు చేశారు. తాజాగా సిట్‌కు శుక్రవారం మరో రెండు ఫిర్యాదులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన 40 మంది రైతులు శాంతిభద్రతల అదనపు డీజీ, సిట్ పర్యవేక్షణాధికారి అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. తమ భూములను నయీమ్ ముఠా లాక్కొందని తెలిపారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన గంగామణి మరో ఫిర్యాదు చేశారు. దశరథ మహారాజ ఆశ్రమానికి చెందిన 26 ఎకరాల 12 గుంటలను నయీమ్ మనుషులు దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె తెలిపారు.