నగరానికి రానున్న సిట్
-
నయీం వ్యవహారంపై విచారణ జరిపే అవకాశం
-
గ్యాంగ్‌స్టర్ సన్నిహితులపై దృష్టి
-
ప్రాథమిక సమాచారం సేకరణ
వరంగల్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) త్వరంలోనే వరంగల్‌కు రానుందని పోలీసు వర్గాలు తెలిపాయి. నయీంతో సంబంధం ఉన్న నేతలను విచారించేందుకు సిట్ ముందుగా వీరి గురించి ప్రాథమిక సమాచారం సేకరిస్తోంది. నయీం డైరీలు, ఫోన్‌కాల్స్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. కేవలం మాట్లాడారా... ఏ కేసులలోనైనా భాగస్వాములయ్యారా అని నిర్ధారించుకున్న తర్వాత సిట్ బృందం జిల్లాకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. సిట్ అధికారులు ఇప్పటికే జిల్లాకు వచ్చి వివరాలు సేకరించినట్టు జరుగుతున్న ప్రచారాన్ని జిల్లాలోని పోలీసు అధికారులు ఖండిస్తున్నారు.
దీనిపై స్పష్టత లేదని చెబుతున్నారు. నయీం గ్యాంగ్‌తో జిల్లాకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులు, ఇద్దరు ప్రజాప్రతినిధులు తమ వ్యవహారాలను చక్కబెట్టుకున్నట్లు గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్ అనంతరం దొరికిన డైరీలో పేర్కొన్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా సంబంధాలు కొనసాగించిన నయీం అనుచరులపై సిట్ దృష్టి పెట్టింది. నయీం గ్యాంగ్ మనుషుల ఆచూకీ తెలుసుకుంటూ, అరెస్టులు చేసి విచారణ సాగిస్తున్నారు. అదే క్రమంలో వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న పాశం శ్రీనును సిట్ బృందం హైదరాబాద్‌కు రప్పించుకుని విచారించింది. సిట్ బృందం వరంగల్‌కు వస్తే ఇదే విచారణ సెంట్రల్ జైలులో కొనసాగించేవారన్న అభిప్రాయాలు పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. సెటిల్‌మెంట్లలో నయీం సహాయం తీసుకున్నారని ప్రచారం జరుగుతున్న ముగ్గురు పోలీసు అధికారులు, ఇద్దరు ప్రజాప్రతినిధుల పూర్తి సమాచారాన్ని సిట్ ఇప్పటికే స్థానిక పోలీసుల నుంచి తీసుకున్నట్టు తెలిసింది.
నయీం సహాయం పొందిన ముగ్గురు అధికారుల్లో ఇద్దరు పదవీ విరమణ చేశారు. మరొకరు హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ఒక డీల్ సెటిల్ చేసేందుకు నయీం జిల్లాకు వచ్చాడన్న కథనాలపై సిట్ దృష్టిపెట్టినట్లు తెలిసింది. పూర్తి స్థాయి సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో సేకరించేందుకు జిల్లాకు సిట్ బృందం వచ్చే అవకాశం లేక పోలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.