- మోహన్‌రెడ్డి బాధితుల సంఘం డిమాండ్
ముకరంపుర : నరహంతకుడు నయీం ముఠాతో మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డికి సంబంధాలున్నాయని మోహన్‌రెడ్డి బాధితుల సంఘం ఆరోపించింది. ఆయన అక్రమాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలని సిట్ చీఫ్, ఐజీ నాగిరెడ్డికి ఫిర్యాదు చేస్తామని తెలిపింది. శుక్రవారం కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ముస్కు మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నయీం తరహాలోనే గన్నుపెట్టి బాధితులను చంపుతామని మోహన్‌రెడ్డి ఎన్నో సార్లు బెదిరించారని ఆరోపించారు. మంగళవారం చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రెండుగంటల్లోనే సూసైడ్ నోట్‌ను తారుమారు చేసి చక్రం తిప్పారన్నారు. 16 ఎకరాల భూమిని తాకట్టుపెట్టి రూ.20 లక్షలు తీసుకున్న పాపానికి మోహన్‌రెడ్డి వేదింపులతో తన భర్తను పోగొట్టుకుని దిక్కులేని వాళ్లమయ్యామని బాధితురాలు బోగ లక్ష్మి కన్నీళ్ల పర్యంతమైంది. సీపీఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు, లోక్‌సత్తా జిల్లా బాధ్యుడు ప్రభాకర్, బాధితులు అరిగెల నర్సయ్య, నాగుల యాదగిరి, బండమీది వీరమ్మ, సాయన్న, సోమ సురేష్, కంకనాల వనిత, ఆవుదుర్తి బలరాం, తాటిపాముల సరోజన, రమేశ్, ఓం నమఃశివాయ, గువ్వల రాధాబాయి, సట్ల కొంరయ్య తదితరులు పాల్గొన్నారు.
నాకు చావు తప్ప మార్గం లేదు
– మోహన్‌రెడ్డి
బాధితుల సంఘం నాయకుల ఆరోపణలపై ‘సాక్షి’తో మాట్లాడారు. గతంలో తనకు భానుతో సంబంధాలున్నాయని, విదేశాల్లో డబ్బు దాచానన్నారన్నారు. కనీసం పాస్‌పోర్ట్ కూడా లేని తను విదేశాలకు ఎట్లా వెళ్తానని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటీ కూడా నిరూపించలేకపోయారని గుర్తు చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నారాయణరెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. పరిచయం కూడా లేని నయీంతో లింకు పెడుతూ డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. ఇలాంటి ఆరోపణలతో తన కుటుంబం మానసిక క్షోభకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తనకు చావు తప్ప మరో మార్గం కనిపించడం లేదన్నారు.