మరికొందరిపైనా వేటు!
నయీమ్‌తో అంటకాగిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు
► మౌఖిక విచారణ చేపట్టేందుకు ప్రత్యేక బృందం
► సీనియర్ ఐపీఎస్ నేతృత్వంలో ఏర్పాటుకు యోచన
► ఆరోపణలు రుజువైతే ఉద్యోగం నుంచి తొలగింపు
► క్రిమినల్ కేసుల నమోదు.. ఆపై కటకటాల్లోకి..
► 16 మంది అధికారులకు చార్జి మెమోలు
సాక్షి, హైదరాబాద్: నయీమ్‌తో కలసి సెటిల్‌మెంట్లు చేసి.. సస్పెండైన ఐదుగురు పోలీసు అధికారులు, విచారణ ఎదుర్కోనున్న మరో నలుగురు అధికారులపై మౌఖిక విచారణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. నయీమ్‌తో కలసి వారు సాగించిన భూకబ్జాలు, వసూళ్ల వివరాలను వెలికితీసేందుకు సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. నయీమ్ కేసులో ఆయా అధికారులు మూటగట్టుకున్న ఆస్తులు, బినామీ ఆస్తులను తేల్చి క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విచారణను బట్టి ఈ తొమ్మిది మంది అధికారులను జైలుకు కూడా పంపే అవకాశముందని, సర్వీసు నుంచి తొలగించేందుకు కూడా కార్యాచరణ సిద్ధమైందని పేర్కొంటున్నాయి.
వివరణ.. సస్పెన్షన్..
సస్పెండైన అధికారులతో పాటు మరో 16 మంది అధికారులపైనా విచారణ ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తమ వద్ద ఈ 16 మందికి సంబంధించి ఉన్న ఆధారాల ప్రకారం చార్జిమోమోలు జారీచేసినట్టు వెల్లడించారు. ఈ మెమోలకు సరైన వివరణ ఇవ్వకపోతే సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
దర్యాప్తు బృందానికి ఆ నలుగురి పేర్లు
ప్రస్తుతం నయీమ్ కేసులను విచారిస్తున్న చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు ఈ కేసుల భారం పెరిగిపోయింది. దీంతో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో మౌఖిక విచారణ బృందం ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావిస్తున్నట్టు తెలిసింది. నిక్కచ్చిగా వ్యవహరించే, ఒత్తిళ్లకు తలొగ్గని అధికారిని ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. అదనపు ఎస్పీ, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారులను విచారించేందుకు ఐజీ లేదా డీఐజీ స్థాయి అధికారికి బాధ్యత అప్పగించాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైనింగ్ విభాగం ఐజీగా ఉన్న చారుసిన్హా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న ఐజీ శశిధర్‌రెడ్డి, కౌంటర్ ఇంటలిజెన్స్ డీఐజీగా ఉన్న రాజేశ్‌కుమార్ పేర్లను పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఎస్పీ స్థాయి అధికారి సరిపోతారనుకుంటే హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి పేరును పోలీసు శాఖ పరిశీలిస్తోంది.
ఆ అధికారులపై నిఘా
సస్పెండైన ఐదుగురితో పాటు విచారణ ఎదుర్కొనే మరో నలుగురు అధికారులపై పోలీసు శాఖ నిఘా పెంచింది. ఆదేశాలు వెలువడిన దగ్గరి నుంచి వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, బినామీలుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులెవరినైనా కలిశారా.. నయీమ్ కేసుల్లో ఉన్న నిందితులెవరైనా కలిశారా అన్న అంశాలను పరిశీలించాల్సిందిగా ఇంటలిజెన్స్ విభాగాన్ని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది.
నయీమ్ దేశ సేవకుడు!
సస్పెన్షన్‌కు గురైన అధికారుల్లో ఓ ఏసీపీ స్థాయి అధికారి బాహాటంగానే నయీమ్‌ను పొగడడం గమనార్హం. నయీమ్ దేశానికి ఎంతో సేవచేశాడని, అతడిని ఉపయోగించుకుని సీనియర్ ఐపీఎస్‌లు కోట్లు గడించారని పేర్కొన్నారు. వారిని వదలి తమపై పడితే.. అసలు విషయాలన్నీ బయటపెడతామని వ్యాఖ్యానించారు. నయీమ్ ఎంతో మంది ఉగ్రవాదులను పట్టించాడని.. అతడి పేరు చెప్పుకుని పదవులు పొందిన రిటైర్డ్, ప్రస్తుత ఐపీఎస్‌లను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. అలాగైతే ఆయుధాలు పట్టించిన కేసు, సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు వంటి అనేక సంచలన కేసులు తిరగదోడాల్సి వస్తుందన్నారు. అంత ధైర్యం ప్రస్తుతమున్న అధికారులకు లేదని, పోలీసు శాఖ పరువు పోతుందనే.. తమపై వేటు వేసి చేతులు దులుపుకొంటున్నారని ఆరోపించారు.