
‘నయీంతో నాకు ఏ లింక్ లేదు’
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, నయీం డ్రైవర్ శామ్యుల్ను సిట్ అధికారులు సోమవారం ప్రశ్నించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ విచారణ కొనసాగింది. కాగా నయీం కేసులో నేడో, రేపో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సిట్ అధికారులు పలువురు రాజకీయ నేతలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. కాగా రవీందర్ రెడ్డి 1995 -1997 వరకూ చౌటుప్పల్ సీఐగా, 1997 -2000 వరకూ భువనగిరి డీఎస్పీగా, 2003-2004 వరకూ నల్లగొండ డీఎస్పీగా పని చేశారు.
సిట్ అధికారుల విచారణ అనంతరం రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తాను భువనగిరి డీఎస్పీగా పని చేస్తున్న సమయంలో నయీం అక్కడే జైల్లో ఉన్నాడని, వృత్తిపరంగా రెండుసార్లు అతడిని కలిసినట్లు తెలిపారు. తాను భువనగిరిలో పని చేసిన సమయంలో నయీం గ్యాంగ్ అంటూ ఎవరు లేరని అన్నారు. నయీంతో భూ సెటిల్మెంట్లు చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తనకు హైదరాబాద్లో అంగుళం భూమి కూడా లేదని, నిజామాబాద్లో భూములు ఉన్నట్లు తెలిపారు. తనకు తెలిసిన సమాచారాన్ని సిట్ అధికారులకు తెలిపానని, ఇతర పోలీస్ అధికారులు, నేతల గురించి తననేమీ అడగలేదని చెప్పారు.