
నయీం కేసులో మరో సంచలనం!
నయీముద్దీన్ కేసులో సరికొత్త సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో చాలామంది పోలీసులతో పాటు.. కొందరు అధికార పార్టీ నాయకుల పేర్లు కూడా బయటపడ్డాయి. నయీం బినామీలను విచారించినప్పుడు.. వాళ్లు ఇచ్చిన వాంగ్మూలంలో కొందరు ముఖ్యనేతల పేర్లు ఇప్పుడు వచ్చాయి. టీఆర్ఎస్ నాయకుడు, శాసనమండలి వైస్‌చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు పేరు ఇందులో ప్రముఖంగా ఉంది. గంగసాని రవీందర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. మధుకర్ రెడ్డి వాంగ్మూలంలో మరో టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం నల్లగొండ జిల్లాకు చెందిన మరికొందరు ప్రజాప్రతినిధుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు కొందరు నాయకులు తమకు సంబంధం లేదని.. ఎలాంటి ఆరోపణలనైనా ఎదుర్కొంటామని అన్నారు. ఇప్పుడు నేరుగా మండలి వైస్‌చైర్మన్ పేరే బయటకు రావడంతో ఆయన రాజీనామా చేస్తారా.. లేక ప్రజల ముందుకు వచ్చి తన వివరణ తెలియజేస్తారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది.
నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అతడి బినామీలలో పలువురిని పోలీసులు అరెస్టుచేశారు. వాళ్లను విచారించినప్పుడు పలువురు నాయకులు, పోలీసుల పేర్లు తెలిశాయన్న ప్రచారం జరిగినా, అవేవీ బయటకు మాత్రం రాలేదు. అయితే.. సీపీఐ నాయకుడు నారాయణ ఈ అంశంపై కోర్టులో కేసు దాఖలు చేయడంతో.. మూడు వారాల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భువనగిరి కోర్టులో సిట్ తన నివేదికను సమర్పించింది. అందులో.. తాము విచారించిన వారి వాంగ్మూలాల్లో ఎవరెవరి పేర్లు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించింది. వెలగపూడి శివరాంప్రసాద్ వాంగ్మూలంలో డీఎస్పీ మద్దిలేటి శ్రీనివాసరావు పేరు, యూసుఫ్‌ఖాన్ వాంగ్మూలంలో డీఎస్పీ మస్తాన్‌వలీ పేరు ఉన్నాయి. అలాగే లక్ష్మారెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంటులో సీఐ వెంకట్‌రెడ్డి పేరు ఉంది.
ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లే కాకుండా ఇంకా చాలామంది పోలీసులు, నాయకుల పేర్లు ఈ కేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికి 156 కేసులు నమోదు చేసి వంద మందికి పైగా అరెస్టు చేశారు. ఇప్పుడు తాజా వాంగ్మూలాలతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 13 మంది పోలీసు అధికారుల సర్వీసు రివాల్వర్లను కూడా సరెండర్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేసులో వందలకోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు, వందల ఎకరాల భూముల వివాదాలు ఉండటంతో.. దీనిపై సీబీఐ విచారణ జరపాలన్న డిమాండ్లు కూడా వస్తుండటంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కేసు ఆలస్యం అయ్యేకొద్దీ బాధితులకు అన్యాయం జరుగుతుందని, న్యాయం జరిగే అవకాశం లేదని అనడంతో మళ్లీ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఇప్పుడు కొత్తగా బయటపడిన పేర్లు ఉన్నవారికి ఎప్పుడు నోటీసులు జారీచేస్తారు, ఎప్పుడు అరెస్టులు జరుగుతాయనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.