
సిట్ పర్యవేక్షణాధికారిగా అంజనీకుమార్
- నయీమ్ కేసుల దర్యాప్తు వేగవంతం కోసం నియామకం
- ప్రస్తుత చీఫ్ నాగిరెడ్డితో కలసి పర్యవేక్షిస్తారని డీజీపీ వెల్లడి
- కేసులను త్వరగా కొలిక్కి తెచ్చేందుకు సిబ్బంది పెంపు
- నయీమ్ గ్యాంగ్‌పై 72 కేసులు నమోదు, 80 మంది అరెస్టు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సంబంధించిన కేసులను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పర్యవేక్షణాధికారిగా శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ చీఫ్‌గా ఉన్న ఐజీ వై.నాగిరెడ్డితో కలసి అంజనీకుమార్ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తారని అందులో పేర్కొన్నారు. ఈ కేసును వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చేందుకు సిట్‌లో అదనంగా మరికొంత మంది అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. నయీమ్ వ్యవహారంలో మెరుగైన దర్యాప్తుతో పాటు నిందితులకు సంబంధించిన పక్కా ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుల విచారణలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా న్యాయ సలహా తీసుకోవాలని సిట్‌ను ఆదేశించారు.
అదనపు సిబ్బంది ఏర్పాటు
నయీమ్ కేసు దర్యాప్తును వేగిరం చేసేందుకు ప్రభుత్వం సిట్‌లో మరికొందరు సిబ్బందిని నియమించింది. నయీమ్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటి వరకు 72 కేసులు నమోదవగా.. 80 మంది అరెస్టయ్యారు. రోజు రోజుకూ మరెన్నో కొత్త అంశాలు వెలుగు చూస్తుండడంతో.. ప్రస్తుతమున్న సిబ్బంది సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో డీజీపీ అనురాగ్‌శర్మ మరికొంత మంది సీనియర్ అధికారులను, సిబ్బందిని నియమించారు. ఇప్పటివరకు దర్యాప్తు బృందంలో ఒక ఐజీ, అదనపు ఎస్పీ, కొందరు ఇన్‌స్పెక్టర్లు, కింది స్థాయి సిబ్బంది ఉన్నారు. తాజాగా కరీంనగర్ అదనపు ఎస్పీ ప్రియదర్శిని, ఖమ్మం అదనపు ఎస్పీ సాయికృష్ణ, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అదనపు ఎస్పీ ఎండీ ఇస్మాయిల్, గోషామహల్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ పి.జైపాల్, నార్సింగ్ సీఐ పి.రామచంద్రరావులను నియమించారు.
సిట్‌కు మరో ఫిర్యాదు
నయీమ్ అక్రమాలకు సంబంధించి సిట్‌కు సోమవారం మరో ఫిర్యాదు అందింది. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన గోళి సుధాకర్‌రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్లు 29,44, 48, 49, 50, 55/1 లతో పాటు చెరుకూరు గ్రామ శివారులోని 95, 97, 98, 122, 44, 46, 302 సర్వే నంబర్లలో కలిపి మొత్తం 164 ఎకరాల భూమి కోసం గతంలో నయీమ్ గ్యాంగ్ తనను వేధించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను చంపుతామంటూ ముంబై నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సిట్‌కు అందజేశారు.