నయీమ్ కేసును సీబీఐకి ఇవ్వండి
శాసనమండలిలో షబ్బీర్ అలీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని మండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. శుక్రవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ‘నయీమ్ ఎన్‌కౌంటర్’అంశం చర్చకు వచ్చింది. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసు వివరాలు, పురోగతి సభకు చదివి వినిపించారు. దీనిపై విపక్ష నేత షబ్బీర్ అలీ చర్చకు దిగారు. సిట్ నుంచి కేసును సీబీఐకి ఎందుకు బదిలీ చేయాలో ఆయన మండలి చైర్మన్‌కు వివరించారు. ‘నయామ్ ఎన్‌కౌంటర్‌ను ఎవరూ తప్పుపట్టటం లేదు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో ఏకే 42 ఆయుధం దొరికింది. ఇది మిల్ట్రీ పరిధిలోకి వస్తుంది.
నయీం ఇంట్లో దాదాపు రూ.1,000 కోట్ల నగదు బయట పడిందని అంటున్నారు. ఈ డబ్బు హవాలా డబ్బా? మనీ ల్యాండరింగ్‌దా? అనే విషయం తేలాలి అంటే ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్) అధికారులు దర్యాప్తు జరపాలి. నయీమ్ మహిళలను విదేశాలకు ఎగుమతి చేసేవాడని, స్రోబుద్దీన్‌తో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఈ లెక్కన ఇంటర్‌పోల్ అధికారుల సహాయం అవసరం. నయీమ్ నరహంతక కార్యకలాపాలు నాలుగు ఐదు రాష్ట్రాల్లో విస్తరించినట్టు చెబుతున్నారు. మన పోలీసులకు ఇతర రాష్ట్రాల పోలీసులు సహకరించకపోవచ్చు. ఈ కేసులో ఒక డీజీపీ స్థాయి అధికారికి కూడా సంబంధం ఉందని అంటున్నారు. స్థాయిలో తక్కువగా ఉన్న అధికారి తన అత్యున్నత అధికారిని ఎలా ప్రశ్నిస్తారు? ఇన్ని సమస్యలు ఉన్నందునే కేసును సీబీఐకి అప్పగించాలి’అని షబ్బీర్ అలీ కోరారు.