
నాయి బ్రాహ్మణులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
సాక్షి, గుడివాడ: నాయి బ్రాహ్మణులకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీయిచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను మంగళవారం నాయి బ్రాహ్మణులు కలిశారు. తమ సమస్యలను జననేతకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక నాయి బ్రాహ్మణులకు అన్ని విధాల మేలు చేస్తామన్నారు.
వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...
నాయి బ్రాహ్మణులు లేకపోతే నాగరికత ముందు సాగలేదు. నేడు వీరు బతకలేని పరిస్థితి ఉంది. చిన్న కులం కావడంతో రాజకీయంగా ఎవరూ పట్టించుకోలేదు. క్షౌరశాలల్లో ఫ్యాన్‌లు, టూబ్‌లైట్లకు రూ. 8 నుంచి రూ. 14 వరకు కరెంట్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కనీసం 4 వేల రూపాయలు కరెంట్ బిల్లు కట్టాలంటే ఎలా బతకాలని వాపోతున్నారు. సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. 500 యూనిట్ల వరకు డొమెస్టిక్ టారీఫ్ ఉండేలా చూస్తాం. ప్రతి షాపుకు రూ. 10 వేలు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధం లేదా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రెండింటిలో ఒకటి అందిస్తాం. నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ బదులుగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తాం.
వైఎస్ జగన్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయి బ్రాహ్మణులు
ఆలయాల్లోనూ నాయి బ్రాహ్మణులు పనిచేస్తున్నారు. వాయిద్య కళాకారులుగా దేవుడికి సేవలు అందిస్తున్నారు. ఆలయాల్లో వీరిని పట్టించుకునే పరిస్థితి లేదు. వేతన భద్రత లేదు. వీళ్లకు జరగాల్సిన మేలు కచ్చితంగా చేస్తాం. ఆలయాల్లో పీస్ రేట్ల వల్ల క్షురకులు ఇబ్బంది పడుతున్నారు. గుర్తింపు పొందిన ఆలయాల్లో గుర్తింపు కార్డులు ఇచ్చి, స్థిరవేతనాలు ఇస్తాం. పాలక మండళ్లలో సభ్యులుగా అవకాశం కల్పిస్తాం. వాయిద్య కళాకారులకు ఇదేరకమైన మేలు చేస్తాం. చట్టసభల్లో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తాం. నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, కుమ్మరులు, రజకులు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. ఇటువంటి కులాలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment