
నయీం కేసులో 'ప్ర'ముఖ్యులకు నోటీసులు!
నయీం అక్రమాలను దర్యాప్తు చేస్తోన్న సిట్.. మరికొద్ది గంటల్లోనే కొందరు ప్రముఖులకు నోటీసులు జారీచేయబోతున్నట్లు సమాచారం.
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ హతమయిన రెండు నెలలకు కేసు దర్యాప్తు కీలక ఘట్టానికి చేరుకుంది. నయీం అక్రమాలను దర్యాప్తు చేస్తోన్న సిట్ ఇప్పటివరకూ గ్యాంగ్ స్టర్ అనుచరులను మాత్రమే అరెస్టు చేయగా.. మరికొద్ది గంటల్లోనే కొందరు ప్రముఖులకు నోటీసులు జారీచేయబోతున్నట్లు సమాచారం. గరిష్టంగా మూడు రోజుల్లో కొందరు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు సిట్ తాఖీదులు ఇవ్వబోతోంది. సోమవారం చోటు చేసుకున్న కీలక పరిణామాలు ఇదే విషయాన్ని స్పస్టం చేస్తున్నాయి.
నయీమ్ అరాచకాలలో పరోక్ష, ప్రత్యక్ష సహకారం అందించిన ‘ముఖ్య’మైన వారికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన సిట్.. అందుకు అనుగుణంగా వారి కార్యకలాపాలకు సంబంధించిన కార్యాచరణను వడివడిగా పూర్తి చేస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 21 మంది పోలీసు అధికారులకు నయీంతో సంబంధాలున్నట్లు ఆధారాలు లభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు డీజీపీ అనురాగ్‌శర్మ నివేదిక కూడా అందజేశారు. భూకబ్జాలు, బెదిరింపులకు సంబంధించి నయీమ్‌కు ఎవరెవరూ ఏ విధంగా సహకరించారో కూలంకషంగా వివరించారు.
మొదటి విడుతలో భాగంగా ఒక ఎమ్మెల్సీ, నలుగురు పోలీసు అధికారులకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా సంబంధిత ఎమ్మెల్సీకి సోమవారం స్పష్టమైన సంకేతాలను పంపిచారు. రెండు, మూడు రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్లు, అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అదే విధంగా నోటీసులు అందుకోబోతున్న పోలీసు అధికారులకు కూడా సంకేతాలు అందాయి. రాష్ట్రంలో నూతల జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొందరు అదనపు ఎస్పీలకు నాన్‌క్యాడర్ ఎస్పీ హోదా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ప్రతిపాదిత లిస్టులో అర్హతలున్నా ముగ్గురు ఏఎస్పీలను... కేవలం నయీమ్ కేసుల నేపథ్యంలో పక్కన పెట్టారు. కనుక వారికి కూడా నోటీసులిచ్చి విచారించాలని సిట్ భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు స్పష్టం చేశాయి.
పక్కా ఆధారాలు లభ్యం..
నయీమ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన రాజకీయ నాయకులు, పోలీసులకు సంబంధించి మరికొన్ని బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. ఇది వరకే కొన్ని ఫోటోలు వెలువడగా... తాజాగా భూ లావాదేవీలకు సంబంధించి లింకులు, కొన్ని డాక్యుమెంట్లు సైతం బయటపడ్డాయి. కొందరు బాధితులిచ్చిన ఫిర్యాదులతో పాటు తదుపరి కస్టడీలో భాగంగా నిందితులు చెప్పిన వివరాలపై దర్యాప్తు చేయగా పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అలాగే ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అందజేసిన వివరాలు మరింత రూఢీ చేశాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, వారికి సంబంధించిన వ్యక్తుల భూ బాగోతాలను రిజిస్ట్రేషన్లశాఖ పూర్తి వివరాలను అందజేసింది. నాయకులు, అధికారులు తమ కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల పేరిట పెద్ద ఎత్తున భూ లావాదేవీలు జరిపినట్లు బయటపడింది. వాటన్నింటిని ఆధారాలుగా చేసుకున్న సిట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఉచ్చు బిగించేందుకు సిద్ధమవుతోంది.
శేషన్న ముఖ్య అనుచరుడి అరెస్టు..
నరహంతకుడు నయీమ్ కుడి భుజంగా పేరొందిన శేషన్న ముఖ్య అనుచరుడు ఈశ్వరయ్యను సిట్ సోమవారం అరెస్టు చేసింది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఈశ్వరయ్యను గత 15రోజుల క్రితమే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఈశ్వరయ్య ఇంటి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు కొన్ని ఆధారాలు సైతం సేకరించారు. ఇతని ద్వారా ఇప్పటికీ తప్పించుకొని తిరుగుతున్న శేషన్నకు సంబంధించిన వివరాలు రాబట్టినట్లు తెలిసింది. అలాగే నయీమ్ డెన్‌లకు సంబంధించిన వివరాలను కూడా అతని ద్వారా రాబట్టినట్లు సమాచారం. మొత్తంగా ఇప్పటి వరకు నయీమ్ ముఠాపై రాష్ట్ర వ్యాప్తంగా 130కేసులు నమోదవగా... 93 మంది అరెస్టయ్యారు.