సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు పేరుతో ఇస్తున్న నోటీసులను నిలిపివేయాలని బీజేపీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేసింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘ఇటీవల హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కేసులో నిందితుల పేర్లను, నోటీసుల వివరాలను మీడియాకు సిట్ వెల్లడించకూడదు.
అయితే ఆ ఆదేశాలకు వ్యతిరేకంగా సిట్ పని చేస్తోంది. నోటీసులు ఇచ్చిన వాళ్ల వివరాలను మీడియాకు తెలిసేలా చేస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మీ జనార్దన సంతోష్(బీఎల్ సంతోష్)కు 41ఏ నోటీసులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. 17న నోటీసులు ఇచ్చిన వారందరి వివరాలు చానళ్లలో ప్రసారం అయ్యాయి. కేవలం బీజేపీ లక్ష్యంగా దర్యాప్తు సాగుతోంది.
41ఏ నోటీసు తర్వాత అరెస్టు చేస్తారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వాళ్లను వేధించే కుట్ర జరుగుతోంది. నోటీసుల తర్వాత దర్యాప్తు పేరుతో వాళ్లను ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు ఉన్నాయి. ఎలాగైనా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నం సాగుతోంది. సిట్ నోటీసుల అమలును నిలివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి’అని పిటిషన్‌లో ప్రేమేందర్‌రెడ్డి కోరారు. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ సీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ స్టేషన్ ఆఫీసర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ, పైలట్ రోహిత్‌రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment