సాక్షి, హైదరాబాద్: పేపర్ లీక్స్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగిస్తున్న సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం).. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు ఇవాళ(మంగళవారం) నోటీసులు జారీ చేసింది. మార్చి 24వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని అందులో కోరింది.
పేపర్ లీక్ విషయంలో చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ తమ ఎదుట హాజరు కావాలని సిట్ ఆ నోటీసుల్లో పేర్కొంది. టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ల లీక్ వ్యవహారంపై స్పందిస్తూ.. ఒకే ఊర్లో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకుగానూ ఆధారాలు తమకు ఇవ్వాలని సిట్ తన నోటీసుల్లో పేర్కొంది. ఇక మంగళవారం సాయంత్రం నోటీసులతో సిట్ అధికారులు.. బండి సంజయ్ నివాసానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే.. ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇప్పటికే సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23వ తేదీన తగిన ఆధారాలతో తమ ఎదుట హాజరు కావాలని కోరింది.
ఇదీ చదవండి: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment