
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ రేపు(ఆదివారం) సిట్ విచారణకు గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో తాను చేసిన వ్యాఖ్యలకుగానూ ఆధారాలను వ్యక్తిగతంగా హాజరై.. తమకు సమర్పించాలంటూ సిట్ నోటీసుల ద్వారా ఆయన్ని కొరిన సంగతి తెలిసిందే. అయితే గతంలో జారీ చేసిన నోటీసులు తనకు అందలేదని ఆయన విచారణకు గైర్హాజరు కాగా.. తాజాగా ఇవాళ ఆయనకు సిట్ మళ్లీ నోటీసులు జారీ చేసింది.
అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో హైదరాబాద్ లిబరేషన్ కార్యక్రమంతో పాటు.. ఎన్నికల ప్రచార కార్యక్రమంలలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం బీదర్(కర్ణాటక) వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు బదులు లీగల్‌టీం సిట్ విచారణకు హాజరు కావొచ్చని తెలుస్తోంది.