Same Phone And IMEI Number In SIT Notices In MLA Purchase Case - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలకు ఎర కేసు: ఒకటే ఫోన్, ఐఎంఈఐ నంబర్లు

Published Sun, Nov 20 2022 3:47 AM | Last Updated on Sun, Nov 20 2022 10:18 AM

Same Phone And IMEI Number In SIT Notices In MLA Purchase Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తులో భాగంగా జారీ చేసిన నోటీసులలో గందరగోళం నెలకొంది. సోమవారం హైదరాబాద్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మెరబెట్లు లక్ష్మీ జనార్దన సంతోష్‌ (బీఎల్‌ సంతోష్‌), కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లకు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇరువు రూ విచారణకు వచ్చేటప్పుడు వారు వినియోగించే మొబైల్‌ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, ఐపాడ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను వెంట తీసుకురావాలని నోటీసులో సిట్‌ పేర్కొంది. ఫలానా ఫోన్‌ నంబరు, ఫలానా ఐఎంఈఐ నంబరు గల సెల్‌ఫోన్‌ను తప్పనిసరిగా తీసుకు రావాలని ఆదేశించింది. ఫోన్‌లోని సమాచారాన్ని తొలగించడం లేదా చెరపడం కానీ చేయరాదని పేర్కొంది. అయితే బీఎల్‌ సంతోష్, శ్రీనివాస్‌.. ఇద్దరికీ సిట్‌ జారీ చేసిన నోటీసులలో పేరొన్న ఫోన్‌ నంబరు, ఐఎంఈఐ నంబర్లు ఒకటే ఉండటం గందరగోళానికి తెరతీసింది. 

ముద్రణలో పొరపాటేనా.. 
ఇరువురు ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సిట్‌ విచారణాధికారి, రాజేంద్రనగర్‌ డివిజన్‌ ఏసీపీ బి.గంగాధర్‌ ఈ నెల 16న నోటీసులు జారీ చేశా రు. అయితే ఒకే రోజు ఒకే సమయానికి ఇద్దరికీ నోటీసులు జారీ చేసే క్రమంలో ముద్రణలో పొరపాటు జరిగిందా? లేక దర్యాప్తులో భాగంగా ఆ ఫోన్‌ నంబరు ఎవరి దగ్గర ఉంది? ఎవరు వినియోగిస్తున్నారో తెలుసుకోవటానికే అలా ఇద్దరి నోటీసుల్లోనూ ఒకటే ఫోన్, ఐఎంఈఐ నంబర్ల ను పేర్కొన్నారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. నోటీసులో పేర్కొన్న ఫోన్‌ నంబరుకు ‘సాక్షి’ కాల్‌ చేసేందుకు ప్రయత్నించగా.. ట్రూ కాలర్‌లో బీఎల్‌ సంతోష్‌ అనే పేరు రావటం గమనార్హం. దీంతో శ్రీనివాస్‌కు జారీ చేసిన నోటీసు ముద్రణలో సిట్‌ అధికారు లు పొరపాటు చేసి ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో ఈనెల 29లోగా దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్‌ కవర్‌లో అందించాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. సమయం తక్కువగా ఉండటంతో నోటీసుల జారీలో పొరపాట్లు దొర్లి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బీఎల్‌ సంతోష్‌ స్వస్థలం కర్ణాటకలోని ఉడిపి జిల్లా హిరియాడ్కా పట్టణం కాగా.. సిట్‌ అధికారులు మాత్రం బెంగళూరులోని మల్లేశ్వరం, టెంపుల్‌ స్ట్రీట్‌ చిరునామాతో నోటీసులు జారీ చేయడం గమనార్హం. 

ఎవరికీ భౌతికంగా అందించలేదు.. 
ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు హరియాణాలోని ఫరీదాబాద్‌ పురోహితుడు రామచంద్రభారతి అలియాస్‌ సతీష్‌ శర్మ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహాయాజీలను విచారించి న పోలీసులు వారి నుంచి మరింత సమాచారా న్ని రాబట్టారు. వీటి ఆధారంగా  సంతోష్, శ్రీనివాస్‌లతో పాటు కేరళలో బీజే పీకి మిత్రపక్షమైన భరత్‌ ధర్మజనసేన(బీడీజేఎస్‌) అధినేత తుషార్‌ వెల్లపళ్లి, రామచంద్రభారతికి మధ్యవర్తిత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్న కేరళకు చెందిన వైద్యుడు జగ్గు స్వామికి కూడా 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ అయ్యాయి.

అయితే వీరిలో ఏ ఒక్కరికీ కూడా సిట్‌ అధికారులు భౌతికంగా నోటీసులు అందించకపోవటం గమనార్హం. శ్రీనివాస్, జగ్గు స్వామి ఇళ్లకు నోటీసులు అతికించగా, తుషార్‌ ఇంట్లో లేకపోవటంతో ఆయన ఆఫీసు సెక్రటరీకి నోటీసులు అందించారు. అయితే ఈనెల 3న సీఎం కేసీఆర్‌.. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి సంభాషించిన ఆడియో, వీడి యో రికార్డులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో రామచంద్రభారతి, బీఎల్‌ సంతోష్, సునీల్‌కుమార్‌ బన్సల్, తుషార్‌ పేర్లను పలుమార్లు ప్రస్తావించారు. ఇందులో సంతోష్, తుషార్లకు సిట్‌ ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. బన్సల్‌కు నోటీసులు జారీ చేశారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

స్పష్టత కోసమేనా? 
కాగా.. అరెస్టు సమయంలో రామచంద్రభా రతి సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులోని కాంటాక్ట్‌లను పరిశీలించగా.. ‘సంతోష్‌ బీజేపీ’ పేరిట ఉన్న ఫోన్‌ నంబర్‌కు ఇంగ్లీషులో పంపిన సందేశాలను పోలీసులు గుర్తించారు. ‘నేను రామచంద్రభారతిస్వా మీజిని, హరిద్వార్‌ బైఠక్‌లో మిమ్మల్ని కలిశా. తెలంగాణలో కీలకాంశాలపై చర్చించాలి. 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ అపాయింట్‌మెంట్‌ కావాలి, ఆ ముగ్గురికీ కొంత విట మిన్‌ ఎం అవసరం.. వంటి పలు సందేశాలను పోలీసులు గుర్తించారు. సంతోష్‌ బీజేపీ నుంచి మాత్రం రామచంద్రభారతికి ఎలాంటి రిప్‌లైలు వచ్చినట్లు పోలీసులకు కనిపించలేదని తెలుస్తోంది. ఈ అంశంపై స్పష్టత కోసమే సిట్‌ అధికారులు బీఎల్‌ సంతోష్, శ్రీనివాస్‌లకు ఇరువురికీ ఒకే ఫోన్‌ నంబరు, ఐఎంఈఐ నంబరును తీసుకురావాలని సూచించినట్లు పోలీసు వర్గాలు అంటున్నాయి. అసలు ఆ ఫోన్‌ను ఎవరు వినియోగిస్తున్నారో బయటపడుతుందని చెపుతున్నారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్‌లు.. బీజేపీకి కొత్త టెన్షన్‌!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement