నయీం కేసులో ఆయనకు ఏదైనా జరిగితే...
► ఎమ‍్మెల్యే ఆర్. కృష్ణయ్యను ఇరికించే కుట్ర
► సీఎం అభ్యర్థిని బాబు కనీసం పట్టించుకోవడంలేదని మండిపాటు
► బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు శివనాగేశ్వరరావు గౌడ్
తెనాలి : బీసీల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను నయీం కేసులో ఇరికించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయనకు ఏదైనా జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీసీ నేత పేరం శివనాగేశ్వరరావు గౌడ్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం స్థానానికి అర్హుడని ఆయన్ను ఎన్నికల్లో పోటీచేయించి, తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న చంద్రబాబు, కనీసం ఆయన్ను ప్రతిపక్ష నేతగా చేయలేదని గుర్తుకు చేశారు. తాజాగా కృష్ణయ్యను నయీంకేసులో ‘సిట్’ విచారించిందన్నారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలిచిన చంద్రబాబు.. విలువలకు కట్టుబడిన ఆర్.కృష్ణయ్య సమస్యను పట్టించుకోవాలన్నారు.
చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కల్పనకు తగిన మద్దతును కూడగట్టేందుకు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఈ నెల 16న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్ణయించినట్టు చెప్పారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి మద్దతును కోరనున్నట్టు తెలిపారు. తద్వారా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కల్పన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు వీలుగా తగిన కార్యక్రమాన్ని రూపొందించుకోనున్నామని వివరించారు. దేశంలో 2600 కులాలంటే ఎస్సీలు 16 శాతం, ఎస్టీలు ఏడు శాతం, ఓసీలు ఏడు శాతం ఉన్నట్టు ఆయన గుర్తుచేశారు. జనాభాలో బీసీలు 58 శాతంగా ఉంటే, ఏడు శాతమున్న ఓసీలు 60 శాతం లబ్ధిని పొందుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిశ వెంకటేశ్వరరావు, స్థానిక బీసీ నేతలు పాల్గొన్నారు.