నయీమ్ బాటలో..!
వ్యాపారికి ఇద్దరు విద్యార్థుల బెదిరింపు
కోదాడ అర్బన్: సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు.. నయూమ్‌ను ఆదర్శంగా తీసుకుని వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కోదాడ మండలం శాంతినగర్‌కు చెందిన కొల్లు గోపాల్‌రెడ్డి స్థానిక ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్నాడు. గోపాల్‌రెడ్డి స్నేహితుడి తమ్ముడైన పత్తేపురం నాగరాజు నగరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. గోపాల్‌రెడ్డి, నాగరాజులు చెడు వ్యసనాలకు అలవాటుపడ్డారు. నయీమ్ తరహాలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.
నయీమ్ భువనగిరికి చెందిన ఓ వ్యాపారవేత్తను బెదిరించిన కాల్ రికార్డును విని, ఎలా బెదిరింపులకు పాల్పడాలో తెలుసుకున్నారు. శాంతినగర్‌లో ఇటుకల వ్యాపా రం నిర్వహించే మల్లెల పూర్ణచందర్‌రావుకు ఫోన్ చేశారు. ‘నేను భాయ్‌ని మాట్లాడుతున్నా.. నాకు పది లక్షలు ఇవ్వాలి.. లేకుంటే నీ కుమార్తెతో పాటు కుటుంబసభ్యులను చంపుతాం’’ అని బెదిరించారు. దీంతో పూర్ణచందర్‌రావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు, వారి కాల్ డేటా ఆధారంగా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.