
సాక్షి, విజయవాడ: పేదోళ్ల మనోభావాలతో టీడీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, బలహీనవర్గాల పట్ల దారుణంగా ప్రవర్తిస్తోందని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి కె. పార్థసారధి విమర్శించారు. కనీస వేతనాల కోసం విజయవాడ దుర్గగుడిలో ఆందోళన చేస్తున్న క్షురకులకు పార్టీ నాయకులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయాలకు మంచి ఆదాయం ఉన్నా క్షురకుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం నిన్న ప్రభుత్వ పెద్దలను కలిసి అభ్యర్థించినా కనీసం పట్టించుకోలేదని వాపోయారు. ఇది ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు కనీస వేతనం రూ.17 వేలు ఇవ్వాలని ఏపీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్దవటం యానాదయ్య డిమాండ్ చేశారు. గత మూడు రోజుల నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీస వేతనం లేకుండా ఎలా జీవించాలని ప్రశ్నించారు. సాయంత్రంలోగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు దిగొచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment