Siddavatam Yanadaiah
-
నా పదవికి న్యాయం చేస్తా: యానాదయ్య
సాక్షి, కడప (వైఎస్సార్ జిల్లా): సామాన్య కార్యకర్త అయిన తనకు రాష్ట్ర చైర్మన్ పదవి దక్కడం పట్ల నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదయ్య హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీల ఆర్థిక, సామాజిక లబ్ది కోసం 56 బీసీ కులాల వారికి లబ్ది చేకూరేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడం గర్వించదగ్గ విషయమని ప్రశంసించారు. తోకలు కట్ చేస్తాం, తాట తీస్తాం అన్న సచివాలయంలోనే తల ఎత్తుకుని తిరిగేలా సీఎం వైఎస్ జగన్ తమకు పదవి ఇచ్చారని అన్నారు. (చదవండి: 56 బీసీ కార్పొరేషన్లు – చైర్మన్ల వివరాలు) తన పదవికి తప్పకుండా న్యాయం చేస్తానని, నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీయిచ్చారు. తనపై విశ్వాసం ఉంచి పదవి ఇచ్చిన సీఎం జగన్‌కు ఆయన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ మేయర్ కొత్తమద్ది సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, జిల్లాలోని శాసనసభ్యులకు సహకరించిన నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. కాగా, యానాదయ్యను రాష్ట్రస్థాయి పదవిలో నియమించడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయీ బ్రాహ్మణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నాయీ బ్రాహ్మణ చైర్మన్ పేరు: సిద్దవటం యానాదయ్య విద్యార్హత: బిఏ పుట్టిన తేది: 01–07–1968 తల్లిదండ్రులు: రామయ్య, పిచ్చమ్మ భార్య: వెంకటసుబ్బమ్మ పిల్లలు: శ్రీహరి, రెడ్డి వైష్ణవి స్వగ్రామం: అత్తిగారిపల్లె, పెనగలూరు (మండలం) రాజకీయ ప్రస్థానం: విద్యార్థి నాయకుడిగా ఉంటూ నాయీ బ్రాహ్మణ సంఘంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకూ 25 ఏళ్లు పనిచేశారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి అటు జిల్లాలో, రాష్ట్రంలో పలు ఉద్యమాలు చేశారు. 2009లో వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప పార్లమెంటుకు పోటీ చేసే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
‘నాయీబ్రాహ్మణులకు అండగా ఉంటాం’
సాక్షి, విజయవాడ: దివంగత మహానేత వైఎస్సార్ బీసీలకు అండగా నిలిశారని, బీసీలకు నామినేటెడ్ పదవులు పెద్ద సంఖ్యలో కట్టబెట్టారని.. తండ్రి బాటలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. బీసీల సమస్యలను పరిష్కరించడమే కాకుండా, చట్ట సభల్లో వారిని తన పక్కన జగన్మోహన్రెడ్డి కూర్చోబెట్టుకుంటున్నారని తెలిపారు. మంగళవారం జరిగిన నాయీబ్రాహ్మణుల ఆత్మీయ సదస్సులో మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ సమస్యలు పరిష్కరించమంటే నాయీబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు బెదిరించారని గుర్తు చేశారు. మత్స్యకారులను బెల్టుతో తోలు ఊడదిస్తానని చంద్రబాబు హెచ్చరించారని తెలిపారు. బీసీలను చంద్రబాబు ఆరోవేలుగా చూస్తే, సీఎం జగన్ మాత్రం బీసీలకు అక్కున చేర్చుకున్నారని చెప్పారు. నాయీబ్రాహ్మణులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని చెప్పారు. అండగా ఉంటాం: కొడాలి నాని షాప్ ఉన్న నాయీబ్రాహ్మణులకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం పదివేలు ప్రకటించారని మంత్రి కొడాలి నాని తెలిపారు. అణగారిన వర్గాలు, పేదల కష్టాలను దగ్గరుండి చూశారు కాబట్టే వారికి నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం అవకాశం కల్పించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. నాయీబ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారని, వారికి ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నాయీబ్రాహ్మణులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. జగన్ మాటంటే మాటే: యానాదయ్య వైఎస్ జగన్ మాట ఇచ్చారంటే మాట తప్పరని రాష్ట్ర నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సిద్ధవటం యానాదయ్య అన్నారు. షాప్ ఉన్న ప్రతి నాయీబ్రాహ్మణుడికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని హామీయిచ్చిన సీఎం వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. బీసీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం కేటాయిస్తూ చరిత్రాత్మక చట్టం చేశారని పేర్కొన్నారు. గతంలో తమ సమస్యలు చెప్పుకొనేందుకు చంద్రబాబును కలిస్తే నాయీబ్రాహ్మణుల తోక కత్తిరిస్తామని బెదిరించారని.. ఎన్నికల్లో చంద్రబాబు, లోకేశ్‌లకు నాయీబ్రాహ్మణులు తోకలు కట్ చేశారని ఎద్దేవా చేశారు. ఆత్మీయ సదస్సుకు నాయీబ్రాహ్మణులు భారీ సంఖ్యలో హాజరైయ్యారు. -
వైఎస్ఆర్సీపీలోకి..నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దవటం యానాదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావులకొల్లు మల్లేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌లో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో కడప మేయర్, వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు ఆధ్వర్యంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణ సమస్యలపై అనేకసార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని, పైగా చర్చలకని సచివాలయానికి పిలిచి తీరని అవమానం చేశారన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపి కనీ సంక్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తే తమపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. అదే సమస్యలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. దేవాలయాల్లో క్షురకులను పర్మినెం ట్ చేయడం, తిరుమలతో సహా అన్ని దేవాలయ పాలకవర్గాల్లో క్షురకులకు అవకా శం, బార్బర్ షాపుల్లో 250 యూనిట్ల వర కూ ఉచిత విద్యుత్, ఆపైన 500 యూనిట్ల వరకూ డొమెస్టిక్‌గా మార్పు, శాసనమండలిలో అవకాశం, ఫెడరేషన్ స్థానంలో కార్పొరేషన్ ఏర్పాటు, బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సహకారం, ప్రతి జిల్లాలో సంగీత కళాశాల, బ్యూటీపార్లర్ శిక్షణా కేం ద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే తమ సమస్యలు పరి ష్కారం అవుతాయని నమ్మి పార్టీలో చేరామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్‌రెడ్డి, నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
పేదోళ్ల మనోభావాలతో చెలగాటమా?
సాక్షి, విజయవాడ: పేదోళ్ల మనోభావాలతో టీడీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, బలహీనవర్గాల పట్ల దారుణంగా ప్రవర్తిస్తోందని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి కె. పార్థసారధి విమర్శించారు. కనీస వేతనాల కోసం విజయవాడ దుర్గగుడిలో ఆందోళన చేస్తున్న క్షురకులకు పార్టీ నాయకులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయాలకు మంచి ఆదాయం ఉన్నా క్షురకుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం నిన్న ప్రభుత్వ పెద్దలను కలిసి అభ్యర్థించినా కనీసం పట్టించుకోలేదని వాపోయారు. ఇది ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు కనీస వేతనం రూ.17 వేలు ఇవ్వాలని ఏపీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్దవటం యానాదయ్య డిమాండ్ చేశారు. గత మూడు రోజుల నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీస వేతనం లేకుండా ఎలా జీవించాలని ప్రశ్నించారు. సాయంత్రంలోగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు దిగొచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.