
సాక్షి, హైదరాబాద్: నయీమ్ సంపాదించిన ఆస్తులు, భవనాలు, ఇతరత్రా వ్యవహారాల్లో అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నుంచి భారీగా నగదు బదిలీ జరిగి ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భావిస్తోంది. ఈ మేరకు నయీమ్ కేసుపై దృష్టి సారించిన ఈడీ అధికారులు.. సంబంధిత వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ‘నయీమ్’ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటికే 214 కేసులు నమోదుచేయగా.. వాటికి సంబంధించి 30 చార్జిషీట్లను దాఖలు చేసింది.
ఈ చార్జిషీట్లను, నయీమ్ అక్రమాస్తులకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు, పంచనామాలు, డాక్యుమెంట్లను పరిశీలించాలని ఈడీ నిర్ణయించినట్లు తెలిసింది. వాటి ప్రతులు కావాలంటూ రెండు రోజుల కింద ఈడీ అధికారులు లేఖ రాయగా.. పోలీసు శాఖ అందించినట్టు సమాచారం.
‘పెద్దల’ ఖాతాల్లోకి సొమ్ము వెళ్లిందా?
నయీమ్ ఎక్కడా కూడా సూట్‌కేస్ కంపెనీలు స్థాపించినట్టు సిట్‌కు ఆధారాలు లభించలేదు. గ్యాంగ్‌స్టర్‌గా దందాలు చేస్తూ దేశం నుంచి భారీగా సొమ్మును విదేశాలకు తరలించినట్టు కూడా ఆనవాళ్లేమీ దొరకలే దు. అయినా ఈడీ ఈ వ్యవహారంపై దృష్టి సారించడం, ఎఫ్‌ఐఆర్ లు, చార్జిషీట్లు, ఇతర డాక్యుమెంట్లు తీసుకో వడం సంచలనాత్మకంగా మారుతోంది. వాస్తవానికి సిట్ ఈ కేసు ప్రారంభంలోనే ఈడీకి లేఖ రాసింది. నయీమ్ కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి చర్యలు చేపట్టాలని కోరింది. కానీ మనీ ల్యాండరింగ్ వ్యవహారాలు జరిగినట్టు ఆధారాలు లేకపోవడంతో కేసు టేకప్ చేసేందుకు ఈడీ వెనుకాడింది.
కానీ ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడంపై ఆసక్తి నెలకొంది. 15 రోజుల కింద ఐటీ శాఖ నయీమ్ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈడీ కూడా రంగంలోకి దిగిందని, నయీమ్ నుంచి పలువురు ‘పెద్దల’ ఖాతాల్లోకి సొమ్ము ఏమైనా వెళ్లి ఉంటుందా అన్న కోణంలో పరిశీలన జరపనుందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment