నయీం కేసును సీబీఐకి అప్పగించాలి
నయీం కేసును సీబీఐకి అప్పగించాలి
Published Sat, Oct 8 2016 10:51 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM
శాలిగౌరారం : గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. శాలిగౌరారం మండల కేంద్రంలో శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ నేతలందరికీ నయీంతో సంబంధాలు ఉన్నాయని, వారిని కాపాడేందుకే సిట్‌తో విచారణ జరిపించారన్నారు. నయీంతో అంటకాగినవారి వివరాలు పూర్తిస్థాయిలో మీడియాలో ఆధారాలతో సహా ప్రచారం జరిగినా వారిపై చర్యలు మాత్రం శూన్యమన్నారు. నయీం కేసును తప్పుదోవ పట్టించేందుకు జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం ముందట వేసుకుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను ఓడించేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాపై కుట్రపన్ని నయీంతో బెదిరింపులకు పాల్పడిందన్నారు. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అతని వద్దనుండి లభ్యమైన సొమ్ము కేసీఆర్ వశం చేసుకున్నాడని అన్నారు. నయీం డైరీపై అనేక చర్చలు జరిగాయని, ఆ డైరీలో పేర్లు ఉన్నవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నయీం డైరీలోని పేజీలు చింపివేశారా అని సీఎం కే సాఆర్‌ను ప్రశ్నించారు. నయీంకు సంబంధాలు ఉన్న రాజకీయ నాయకులు, అధికారులను అరెస్ట్ చేసేంతవరకు ఊరుకునేదిలేదని, చట్టసభల్లో ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కేసీఆర్ పాలన ప్రజల పాలన కాదని, అది ఒక కుటుంబ పాలన మాత్రమేనన్నారు. ప్రజలకు ఆయన చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్త అంకుటిత దీక్షతో ముందుకు సాగాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అన్నెపర్తి జ్ఞానసుందర్, బండపల్లి కొమరయ్య, మురారిశెట్టి కృష్ణమూర్తి, తాళ్లూరి మురళి, నూక సత్తయ్య, అన్నెబోయిన సుధాకర్, చామల మహేందర్‌రెడ్డి, ఎర్ర యాదగిరి, షేక్ జహంగీర్, ఇంతియాజ్, నోముల విజయ్‌కుమార్, గూని వెంకటయ్య, గుండ్ల వెంకటయ్య, బొమ్మగాని రవి, రామస్వామి, మల్లయ్య, నర్సింహ్మా, రామచంద్రయ్య, శంకరయ్య, గోదల వెంకట్‌రెడ్డి, తొట్ల పుల్లయ్య, బీరం నర్సిరెడ్డి, అశోక్, తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement