
నయీమ్‌కు గోకుల్ బ్యాంక్ సొమ్ము?
♦ రూ.3.4 కోట్లు అందించిన మాజీ చైర్మన్
♦ సీసీఎస్‌ను ఆశ్రయించిన టీఎస్ ఐటీ విభాగం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని గోకుల్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ఈ–సేవ, మీ–సేవ కార్యాలయాల ద్వారా వసూలైన ప్రభుత్వ సొమ్ములో రూ.3.4 కోట్లు దుర్వినియోగమయ్యాయి. దాదాపు ఏడాది క్రితం చోటు చేసుకున్న ఈ కుభకోణంపై తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావు గతవారం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) డీసీపీ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఈ గోల్‌మాల్ వెనుక ‘నయీమ్ కోణం’ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఈ–సేవ, మీ–సేవ కేంద్రాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఆధీనంలో పనిచేస్తున్నాయి. వివిధ రకాల పౌరసేవలకు సంబంధించి ఈ కేంద్రాల్లో వసూలైన మొత్తాలను ఐటీ విభాగం గోకుల్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లోని తమ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇటీవల ఐటీ విభాగం వివిధ కార్యకలాపాలకు సంబంధించి రూ.3 కోట్లకు పైగా చెక్కులు జారీ చేసింది.
ఇవన్నీ బౌన్స్ కావడంతో ఆరా తీయగా.. గోల్‌మాల్ వ్యవహారం బయట పడింది. దీనిపై ఐటీ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి ఐటీ విభాగం–గోకుల్ బ్యాంక్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో నయీమ్ కోణం వెలుగుచూసింది. గతంలో ఈ బ్యాంక్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన చీమల జగదీష్ యాదవ్‌ను నయీమ్ 2014లో కిడ్నాప్ చేశాడని, ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రాంతంలో బంధించి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడని తేలింది. ఈ నేపథ్యంలోనే జగదీష్ యాదవ్.. బ్యాంక్‌లోని ఐటీ విభాగానికి చెందిన నగదు నుంచి రూ.3.4 కోట్లు వివిధ దఫాలుగా నయీమ్‌కు చెల్లించినట్లు ఉత్తరప్రత్యుత్తరాల్లో వివరించినట్లు సమాచారం. తాను బెల్లి లతితకు అనుకూలంగా ఉండడం.. ఆమె హత్యానంతరం అంతిమయాత్రలో పాల్గొనడంతో పాటు నయీమ్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే తన కిడ్నాప్ జరిగిందని ఈ సందర్భంగా జగదీష్ పేర్కొన్నట్లు తెలిసింది. నయీమ్ బతికున్నంత కాలం ఈ విషయాన్ని బయటపెట్టని జగదీష్.. అతడి ఎన్‌కౌంటర్ తర్వాత సిట్ దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ ప్రభుత్వం గోకుల్ బ్యాంక్ చైర్మన్ సహా డైరెక్టర్లను ముందే తొలగించడానికి ఈ కుంభకోణమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంక్ కార్యకలాపాలు ప్రత్యేక అధికారి నేతృత్వంలో జరుగుతున్నాయి. ఐటీ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగదీష్ యాదవ్ సహా ఇతర డైరెక్టర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అవినాష్ మహంతి ‘సాక్షి’కి తెలిపారు. నగదు ఏమైంది? ఎక్కడకు వెళ్లింది? అనే అంశాలు గుర్తించాల్సి ఉందన్నారు. మాజీ చైర్మన్ జగదీష్ యాదవ్ చెబుతున్న కారణాలు వాస్తవమే అయినప్పటికీ.. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం నేరమేనని ఆయన స్పష్టం చేశారు. 1996లో ఏర్పడిన గోకుల్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు జగదీష్ యాదవ్ 2012లో చైర్మన్ అయ్యారు.