నయీమ్ గురువుగా భావించేవాడు
⇒ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
⇒ 1986 నుంచి నాకు తెలుసు
⇒ అతడి దందాలతో నాకు సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: ‘‘నయీమ్ 1986లో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో ఉన్నప్పట్నుంచే నా వద్దకు వచ్చేవాడు. విద్యార్థి సంఘాలతో కలసి చేసే ఉద్యమాలకు నేను నాయకత్వం వహించేవాడిని. అప్పట్నుంచే నయీమ్ నాకు శిష్యుడయ్యాడు. నన్ను గురువుగా భావించేవాడు. కానీ ఆ తర్వాత కార్యక్రమాలకు నాకు సంబంధం లేదు. గుడికి పోయే వాళ్లు ఎవరు, ఏంటని చూడనట్టే.. సమస్యలపై నా దగ్గరికి వచ్చే వాళ్లను కూడా నేను వ్యక్తిగత విషయాలు అడగను’’ అని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గ్యాంగ్‌స్టర్‌గా నయీమ్ చేసే దందాలు, సెటిల్‌మెంట్లు, ఇతర నేరాలతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల గొంతు నొక్కే కుట్రలో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం తనను ఇరికించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
నయీమ్‌తో సంబంధాలున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకే గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో తనకు సంబంధాలున్నాయంటూ దుష్ర్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘డబ్బులు సంపాదించాలంటే నాకు అడ్డదారులు తొక్కాల్సిన అవసరమేముంది? ముఖ్యమంత్రులే నాకు క్లోజ్. చెన్నారెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు వరకు ప్రతి ఒక్కరితో నాకు సన్నిహిత సంబంధం ఉంది. పిలిచి మంత్రిని చేస్తానంటేనే నేను వెళ్లలేదు. బీసీల ఉద్యమం కోసం 40 ఏళ్లుగా పని చేస్తున్నాను. నాకు సెటిల్‌మెంట్లు, అక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. నయీమ్‌తో ఎలాంటి లావాదేవీలు నాకు లేవు’’ అని స్పష్టంచేశారు. రాష్ట్రానికి తండ్రిగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని, తనకు గిట్టని వారిని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
నన్ను సీఎంగా చూడాలనుకున్నాడు
‘‘నయీమ్ నన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాడు..’’ అని కృష్ణయ్య ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇది అటు రాజకీయవర్గాల్లో, ఇటు పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది. అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి తనను సీఎంగా చూడాలనుకున్నారని ఎమ్మెల్యే చెప్పడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారించాలి
నయీమ్ కేసును సీబీఐతో లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధీనంలోని సిట్ వల్ల న్యాయం జరగదని, వేల కోట్లకు సంబంధించిన ఈ కేసులో 98 శాతం మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారన్నారు. రాజకీయ కుట్రతోనే నయీమ్‌తో తనకు సంబంధాలు అంటగడుతున్నారన్నారు. నయీమ్‌తో దందాలు చేసినట్లు ఆధారాలు చూపిస్తే విమర్శలు చేసే వారికి సమాధానం చెబుతానన్నారు. ఇతర ఎమ్మెల్యేల మాదిరి తాను టీఆర్‌ఎస్‌లో చేరలేదనే కుట్ర పన్నారని ఆరోపించారు.