‘మరో రూపంలో సంక్షోభం’
హైదరాబాద్: తమిళనాడులో బలపడేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. కుట్రలు కట్టిపెట్టి, చట్టబద్ధంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నించాలని ఆయన హితవు పలికారు. తమిళనాడులో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజ్యాంగ బద్ధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షోభం సమసి చట్టబద్ధ పాలన రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. జయలలిత అనారోగ్యం.. ఆమెను సీఎం చూడనివ్వకపోవడం, ఆ తర్వాత కేంద్రం వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. సంక్షోభం ఇప్పుడు ముగిసిపోతుందని తాను భావించడం లేదని మరో రూపంలో వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. పళనిస్వామి, శశికళ మధ్య సంబంధాలు మళ్లీ సంక్షోభానికి దారితీస్తాయన్నారు.
గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు మూసివేయడం బాధాకరమని, ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చూసైనా ఈ నిర్ణయం మార్చుకోవాలన్నారు. నయీమ్ గ్యాంగ్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉన్నట్టు అనిపిస్తోందన్నారు. నయీమ్ కేసులో సీబీఐ విచారణ జరపాలని, అప్పుడే నిజానిజాలు బయట పడతాయని పేర్కొన్నారు.
జేఏసీ చేపట్టిన కొలువుల ర్యాలీకి మద్దతు ఇస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ప్రైవేట్ రంగం లో రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నయీమ్ కేసు మూసివేయడం దారుణమన్నారు. ఈ కేసుతో రాజకీయ నాయకులకు, అధికారులకు సంబంధం లేదనడం అర్ధ రహితమని పేర్కొన్నారు.