మార్చి చివరికి ఉద్యోగుల పంపకాలు పూర్తి
* మార్గదర్శకాల్లో మార్పులు లేవు: కమల్‌నాథన్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపకాలు మార్చి చివరివరకు పూర్తిచేస్తామని కమల్‌నాథన్ కమిటీ చైర్మన్ కమల్‌నాథన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఉదయం ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నార్త్‌బ్లాక్ వద్ద మీడియాతో మాట్లాడారు.
‘ఈ రోజు స్టేట్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపకాల ప్రక్రియ మొత్తం మార్చి చివరివరకు పూర్తి చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే నోటిఫై చేసిన 15 విభాగాల్లో ఉద్యోగుల విభజన ఆప్షన్లకు వారంరోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం. దీనిపై అభ్యంతరాలు చెప్పేందుకు పదిహేను రోజులు గడువు ఇస్తాం’ అని పేర్కొన్నారు.
మొత్తం 85 విభాగాలకుగాను ఇప్పటివరకు 15 విభాగాల్లో నోటిఫై చేసినట్టు చెప్పారు. మిగిలిన వాటిని డిసెంబర్ 10 వరకు పూర్తిచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ‘ ఇప్పటికే విభాగాల వారీగా ఉద్యోగుల సంఖ్య గుర్తింపును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కమిటీ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించినందున వీటిల్లో ఎలాంటి మార్పులకు అవకాశం లేదు’ అని కమల్‌నాథన్ స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి మరో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ క్యాడర్‌లో అధికారులు ఎక్కువగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయని ప్రశ్నించగా.. అందులోకి వెళ్లదలచుకోలేదని సమాధానమిచ్చారు.