అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు.... అండగా ఉంటా | implementation of the objective of the agency tribal | Sakshi
Sakshi News home page

అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు.... అండగా ఉంటా

Published Sun, Jun 15 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు....  అండగా ఉంటా

అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు.... అండగా ఉంటా

 సాక్షి ప్రతినిధి, ఖమ్మం:  ‘రాజకీయాలకు కొత్త అయినా జిల్లా ప్రజలు నన్ను అక్కున చేర్చుకుని ఆశీర్వదించి గెలిపించారు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా ముందున్న కర్తవ్యం. ఆ విషయంలో ఎక్కడా రాజీపడను. ఖమ్మం జిల్లా ప్రజలకు ఢిల్లీలో అండగా ఉంటా. వారి కస్టోడియన్ బాధ్యతలు తీసుకుని ఢిల్లీలో ఖమ్మం వాణి వినిపిస్తా’ అని అంటున్నారు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి, పార్లమెంటు సమావేశాలకు తొలిసారి హాజరై జిల్లాకు వచ్చిన పొంగులేటి శనివారం తన విజన్‌పై ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
 
తాను ఖమ్మం పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజల పక్షాన పనిచేస్తానని, ఏజెన్సీ గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ తానని ఆయన చెప్పారు. పోలవరం ముంపు ప్రాంతాల విషయంలో తాను ఇప్పటికే పోరాడానని, లోక్‌సభలో స్పీకర్ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలియజేశానని, మున్ముందు కూడా వారి పక్షాన నిలబడి పోరాడతానని అన్నారు పొంగులేటి. కొత్తగా ఏర్పడిన నవతెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవాలని, అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందుకు  కృషి చేయాలని, కేంద్రం సహకరించాలని  పొంగులేటి అన్నారు.
 
ఇంటర్వ్యూ విశేషాలివి.....


సాక్షి: ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారు.. మీ అనుభూతి ఎలా ఉంది?
పొంగులేటి: చాలా సంతోషంగా ఉంది. ఒక ఎంపీగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం నిజంగా అదృష్టం. అలాగే లక్షలాది మంది గొంతుక వినిపించడం ఓ బాధ్యత కూడా. ఆ అదృష్టాన్ని ఆస్వాదిస్తూనే బాధ్యతను కూడా గుర్తించి పనిచేసినప్పుడు పదవికి సార్థకత లభిస్తుంది. ఇందుకోసం నా శక్తివంచన లేకుండా కృషి చేస్తా.
 
సాక్షి: పార్లమెంటు సభ్యునిగా మీరు జిల్లా అభివృద్ధిపై ఎలాంటి ముద్ర వేయబోతున్నారు?

 పొంగులేటి: ఖమ్మం ఎంపీగా తెలంగాణ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్కడినే ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇది నాపై మరింత బాధ్యత పెంచుతుంది. ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ సమస్యలను కూడా మా పార్టీ తరఫున వినిపించాల్సి ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తా. ఖమ్మంలో నా మార్కు చూపించాలనే తాపత్రయాన్ని ప్రజలు నాకు కలిగించారు. అందుకు సంబంధించి అన్నీ సిద్ధం చేసుకుంటున్నా. ఐదేళ్ల తర్వాత నన్ను ఎంపీగా గెలిపించిన ప్రజలకు న్యాయం జరిగిందనే భావన కలిగితే చాలు. జిల్లా ప్రజల పక్షాన ఢిల్లీలో కస్టోడియన్ బాధ్యతలు తీసుకుంటా.
 
సాక్షి: జిల్లా అభివృద్ధిలో మీ ప్రథమ ప్రాధాన్యాలు ఏంటి?
 పొంగులేటి: దివంగత నాయకుడు వైఎస్. రాజశేఖర్‌రెడ్డి బాటలో రైతులే నా తొలి ప్రాధాన్యత. రైతుకు ఎంత చేసినా తక్కువే. జిల్లా రైతాంగం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధర, సాగునీరు... ఇలా అన్ని విషయాల్లో రైతాంగం సమస్యలు ఎదుర్కొంటోంది. ఆయా సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా. రైతు విత్తు విత్తిన దగ్గరి నుంచి పంట అమ్ముకునేంతవరకు ప్రభుత్వాలు కాపలా ఉండాలన్నది నా వ్యక్తిగత భావన.
 
అదే విధంగా జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ విషయంలో ప్రత్యేక విజన్ రూపొందించే ప్రయత్నం జరుగుతోంది. గ్రామాల్లో తాగునీటి కల్పనపై కూడా దృష్టి పెట్టి పనిచేస్తా. అర్హులైన అందరికీ ఇళ్లు ఇప్పించాలన్నది నా ఆశయం. ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఎక్కడా నిర్లక్ష్యం వహించను. ఇక, జిల్లాలో ఎక్కువగా ఉన్న గిరిజనులు, గిరిజన ప్రాంతాల విషయంలో ఇప్పటివరకు ఉన్న నిర్లక్ష్యాన్ని పోగొట్టాలన్నది నా కోరిక. పోలవరం కింద ముంపునకు గురయ్యే ఏడు మండలాలను తెలంగాణలోనే ఉంచేలా ఇప్పటికే పోరాటం చేశా. ఇక ముందు కూడా పార్లమెంటులో పోరాడుతా.
 
సాక్షి: ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా?
 పొంగులేటి: ఖమ్మం ఎంపీగా ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసుకునే పనిచేస్తా. ఇందుకోసం ప్రతి నెలా చివర్లో మేధావులతో సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. జిల్లాలోని అన్ని వర్గాలకు చెందిన మేధావులు జిల్లా అభివృద్ధి కోసం చేసే సూచనలను పరిగణనలోకి తీసుకుని పనిచేయాలనుకుంటున్నా. ఇక, పార్లమెంటు సభ్యునిగా కేంద్రం నుంచి జిల్లాకు నిధులు తేవడం నా ప్రధాన బాధ్యత. దీంతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల నిర్మాణం పూర్తి చేయడం, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నిధులను పెంచడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా.
 
ముఖ్యంగా జిల్లాలో దాదాపు 5వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే వీలుంది. దీని కోసం అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి చేస్తా. ఇక తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలో నా పాత్ర ఎలాగూ ఉంటుంది. జిల్లాలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీకి తోడు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం కోసం అవసరమైతే ప్రైవేటు సెక్టార్‌ను కూడా ప్రోత్సహించే విషయంపై ఆలోచన జరుగుతోంది. ఇక గిరిజన, మైనింగ్ యూనివర్శిటీల ఏర్పాటు కేంద్రం పరిధిలోనే ఉంటుంది కనుక ఎంపీగా ఢిల్లీలో వీటి సాధన కోసం పని చేస్తా.
 
 సాక్షి: పట్టణ ప్రాంతాల విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు?
 పొంగులేటి: జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, ఇతర పట్టణాల అభివృద్ధితో పాటు పట్టణాల్లో డ్రైనేజి, సీసీ రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలనుకుంటున్నానను. ఖమ్మం పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఏళ్ల తరబడి ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పాటు తాగునీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. గోళ్లపాడు చానల్ శాశ్వత మరమ్మతులు చేయిస్తా. ఖమ్మానికి రింగ్‌రోడ్డు నిర్మించడం ద్వారా కొంతమేర ట్రాఫిక్ సమస్యను నివారించవచ్చు. పట్టణ ప్రాంతాలలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అర్హులందరికీ ఇళ్ల స్థలాలిప్పించేందుకు కృషి చేస్తా.
 
 సాక్షి: రాజకీయంగా ఎలా వ్యవహరించదల్చుకున్నారు?
పొంగులేటి: ఎన్నికలయ్యేంతవరకే రాజకీయాలు. ఆ తర్వాత ప్రజలందరూ ఒక్కటే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ చెపుతుండేవారు. రాజకీయ వివక్ష నా దగ్గర ఉండదు. అందరినీ ఒకేలా చూస్తా.  నవ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో మా పాత్ర ఉంటుంది. వైఎస్సార్‌సీపీ పక్షాన ఈ విషయంలో శక్తివంచన లేకుండా పనిచేస్తాం. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కూడా ప్రజల పక్షాన మా మద్దతు ఉంటుంది. ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. ముఖ్యంగా రైతు రుణాల విషయంలో వెనక్కు వెళ్లవద్దనేది నా సూచన. ఎన్నికల మేనిఫెస్టోను యథాతథంగా అమలుచేయాలని కోరుతున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement