అధైర్య పడొద్దు అండగా ఉంటాం.. | YSRCP definitely help to farmers, says ponguleti | Sakshi
Sakshi News home page

అధైర్య పడొద్దు అండగా ఉంటాం..

Published Sat, Apr 18 2015 4:33 AM | Last Updated on Thu, Aug 9 2018 4:45 PM

అధైర్య పడొద్దు అండగా ఉంటాం.. - Sakshi

అధైర్య పడొద్దు అండగా ఉంటాం..

  • ఆదుకుంటే సర్కార్‌కు సెల్యూట్ చేస్తాం... లేకుంటే పోరాటమే
  • వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
  • కరీంనగర్ జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అన్నదాతలెవరూ అధైర్యపడొద్దని,  పదిరోజుల్లో ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు.  ఈనెల 20 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లోనూ అకాల వర్షాల వల్ల తెలంగాణ రైతాంగానికి జరిగిన నష్టంపై చర్చిస్తామన్నారు. ప్రధానిమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి నూటికి నూరుశాతం నష్టపరిహారం అందేలా ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలోని మల్యాల, చొప్పదండి, జగిత్యాల, వేములవాడ ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడు తూ తెలంగాణలోని ఏడు జిల్లాల్లో వరి, మామిడి, అరటి, పసుపు, నువ్వులు, జొన్న, సజ్జ పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు.
     
     కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అన్నదాతను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో విపత్తులో పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ఇచ్చేవారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు వైఎస్ తరువాత వచ్చిన పాలకులెవరూ అన్నదాతకు అండగా నిలవడం లేదన్నారు. తెలంగాణలో ఇప్పటికే 600 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే వైఎస్ మాదిరిగా అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. 10 రోజుల్లోగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ఉసురు తగిలిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించబోదన్నారు. 10 రోజుల్లో అన్నదాతను ఆదుకుంటే ప్రభుత్వానికి  సెల్యూట్ చేస్తామని... లేనిపక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడటంలో తామే ముందుంటామని స్పష్టం చేశారు.  పర్యటనలో పొంగులేటితోపాటు పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శులు నల్లా సూర్యప్రకాష్‌రావు, గాదె నిరంజన్‌రెడ్డి, మతిన్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బి.రవీందర్, క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement